
ప్రధానాంశాలు
ముగ్గురు మొనగాళ్లు.. మీ విలువకు సరిలేరు
జ్వాలను రగిల్చిన పంత్, పుజారా, యాష్
‘‘క్రికెట్ జట్లలో పుజారా, పంత్, అశ్విన్ ప్రాముఖ్యం అందరికీ అర్థమైందనే అనుకుంటున్నా. టెస్టు క్రికెట్లో మూడో స్థానంలో దిగి నాణ్యమైన బౌలింగ్‌లో ప్రతిసారీ బంతిని బాదలేరు. ఊరికే 400 టెస్టు వికెట్లు అలా వచ్చేయవు - సౌరవ్ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు’’
పుజారా.. టీమ్ఇండియా అదృష్టం
ఎన్నెన్ని మాటలు.. ఎన్నెన్ని అవమానాలు.. చెతేశ్వర్ పుజారా ఎదుర్కొన్న విమర్శలను చెప్పేందుకు మాటలు సరిపోవు! ‘ఆసీస్ బౌలింగ్ దాడిని ఎదుర్కొనేందుకు అతడు జంకుతున్నాడు’, ‘కేవలం డిఫెన్స్‌కే పరిమితమై జట్టు ఓటమి పాలయ్యేందుకు కారకుడవుతున్నాడు’, ‘పరుగులు చేయకుండా క్రీజుకే పరిమితమై అవతలి ఎండ్‌లో సహచరుల స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాడు’, ‘ఇప్పుడు టెస్టు క్రికెట్ మారింది. అతడు తన ఆట మార్చుకోవాలి. స్ట్రైక్‌రేట్ పెంచుకోవాలి’.. నయావాల్పై మాటల దాడిది. అతడి డిఫెన్స్ విధానం తమకెంత చేటు చేసిందో ఆసీస్ మాజీలకు తెలియందా! గత పర్యటనలో అతడిదే విధానంతో కదా కంగారూల నడ్డి విరించింది. పరుగుల వరద పారించింది. భారత బౌలర్లు కాపాడకోగల లక్ష్యాలను నిర్దేశించింది. అతడి విలువ తెలుసుకాబట్టే ఆసీస్ మాజీలు ఆ మైండ్‌గేమ్‌కు తెరతీసింది. తెరవెనుక వ్యూహం తెలుసుకోని కొందరు భారతీయులు మాత్రం పుజారాపై విమర్శలు ఎక్కుపెట్టేశారు.
ఓపెనర్లు త్వరగా పెవిలియన్ చేరితే కొత్త బంతిని ఎదుర్కొనేందుకు పుజారా వాడే టెక్నిక్ డిఫెన్స్. అది అతడి సహజశైలి. ఒకట్రెండు మ్యాచుల్లో భారీ స్కోర్లు చేయలేదని తన సహజశైలి ఎలా మార్చుకోగలడు? క్రికెట్ తెలిసిన ఎవ్వరైనా సొంత శైలిని వదుకోవాలని సూచించరు. ద్రవిడ్‌లాంటి దిగ్గజాలైతే అసలు బ్యాటింగ్ టెక్నిక్ గురించే బోధించరు. మానసికంగా నువ్వెంత దృఢంగా ఉన్నావన్నదే వారు బోధిస్తారు. పుజారా అందులో సిద్ధహస్తుడు కాబట్టే సిడ్నీ టెస్టుతో కెరీర్లో 6000 పరుగుల మైలురాయి దాటేశాడు. భారత్‌లో 11 మంది ఆ ఘనత సాధిస్తే అత్యంత వేగంగా సాధించిన ఆరో ఆటగాడతను. ఓపికలో తిరుగులేదు కాబట్టే సిడ్నీ రెండో ఇన్నింగ్స్‌లో 205 బంతులు ఆడాడు. దాదాపు మూడున్నర గంటలు క్రీజులో ఉన్నాడు. ఊరికే అతడు బంతుల్ని డిఫెండ్ చేస్తే 18 శతకాలు, 27 అర్ధశతకాలు చేయగలడా చెప్పండి! టీమ్ఇండియాకు ఎన్నో గెలుపుల్లో కీలకంగా నిలిచి.. మరెన్నో ఓటములను అడ్డుకొన్న ఈ యోధుడు భారత జట్టులో ఉండటమే ఓ అదృష్టం.
అశ్విన్.. టీమ్ఇండియా బలం
ఒకప్పుడు టీమ్ఇండియాకు శాశ్వత ఆటగాడైన రవిచంద్రన్ అశ్విన్‌కు రెండేళ్లుగా సరైన అవకాశాలే ఇవ్వడం లేదు. కొత్త ప్రతిభ రావడం ఒకటైతే ఫింగర్ స్పిన్నర్ల కన్నా మణికట్టు మాయగాళ్లే మెరుగన్న అపోహ మరొకటి. దాదాపుగా అతడిని సుదీర్ఘ ఫార్మాట్‌కే పరిమితం చేశారు. గతంలో ఆసీస్, న్యూజిలాండ్‌కు తీసుకెళ్లినా జట్టులో చోటివ్వలేదు. కొన్నిసార్లు జట్టు కూర్పు కుదరడం లేదు. మరికొన్ని సార్లేమో బ్యాటింగ్‌లో విఫలమవుతున్నాడని పక్కన పెట్టారు. కానీ కొత్త విషయాలు నేర్చుకొనేందుకు ఎంతగానో కష్టపడే యాష్ అవన్నీ మనసులోనే పెట్టుకొన్నాడు. తన అమ్ములపొదిలో మరిన్ని బౌలింగ్ అస్త్రాలు పెంచుకున్నాడు. బ్యాటింగ్ పరంగానూ అవకాశాల కోసం ఎదురుచూశాడు.
ఈ సిరీసులో మొదట అతడికి అదృష్టం కలిసిరాలేదు. కానీ సిడ్నీ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం అతడు ఊరుకోలేదు. ముందురోజు విపరీతంగా బౌలింగ్ చేసి వెన్నునొప్పితోనే నిద్రపోయాడు. ఉదయం బూట్లు కట్టుకోలేకపోయిన అతడే దాదాపు మూడు గంటలు క్రీజులో వంగి ఆసీస్ బౌలర్లు వేసిన బంతుల్ని డిఫెండ్ చేశాడు. ఎంత ఆత్మవిశ్వాసం, ఎంత కసి, ఎంత పట్టుదల ఉంటే ఇలా చేయగలడు. నిజానికి అతడు ఒక టెస్టులో 100+ బంతులు ఎదుర్కొని రెండేళ్లు గడిచిపోయింది. అయినా అతడు సిడ్నీలో 190 నిమిషాలు నిలబడి క్రీజులో లైయన్, కమిన్స్, స్టార్క్, హేజిల్‌వుడ్ వేసిన బంతుల్ని డిఫెండ్ చేశాడు. అందులో కొన్ని దేహానికి తగిలాయి. గాయాలైనా సరే మొక్కవోని దీక్షతో అతడు టీమ్ఇండియాను గట్టెక్కించాడు. అతడి అనుభవం విలువేంటో చాటిచెప్పాడు.
పంత్.. టీమ్ఇండియా ఆయుధం
భవిష్యత్తు ఎంఎస్ ధోనీ! ఇదీ రిషభ్ పంత్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసినప్పుడు వినిపించిన మాటలు. అందుకు తగ్గట్టే అతడు అదరగొట్టాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లో శతకాలు బాదేశాడు. వెస్టిండీస్‌పై రెండుసార్లు 90+ స్కోరు వద్ద ఔటయ్యాడు. వేగంగా పరుగులు చేస్తూ వారెవ్వా అనిపించాడు. తొలి సిరీసులోనే ఎక్కువ క్యాచులు అందుకొని ధోనీ రికార్డులు బద్దలుకొట్టేశాడు. ఎక్స్ ఫ్యాక్టర్‌గా జట్టుకు తనెంతో విలువైన ఆటగాడినని చాటిచెప్పాడు. కానీ అదేంటో.. మహీతో పోలికల ఉచ్చులో పడి ఆటపై ఏకాగ్రత కోల్పోయాడు. కీపింగ్‌లో ప్రాథమిక అంశాల్లో విఫలమయ్యాడు. తనవైన బ్యాటింగ్ మెరుపులు మాయం అయ్యాయి. పదేపదే విఫలమై విమర్శల పాలయ్యాడు.
దాదాపుగా ఏడాదికాలం నుంచి పంత్‌కు తుదిజట్టులో చోటు దక్కడం లేదు. దేశవాళీకి వెళ్లకతప్పదన్న సంకేతాలు వెలువడ్డాయి. అదృష్టవశాత్తు మళ్లీ తనకు అచ్చొచ్చిన ఆసీస్‌లో పంత్ మెరిశాడు. గత పర్యటనలో శతకం బాదేసిన సిడ్నీలో త్రుటిలో శతకం చేజార్చుకున్నాడు. తీవ్ర ఒత్తిడిలో ఉన్న సమయంలో ప్రత్యర్థి బౌలింగ్ దాడిని తన వీరబాదుడుతో కకావికలం చేసేసి సమీకరణాన్ని భారత్‌కు అనుకూలంగా మార్చాడు. ఒత్తిడిలో విధ్వంసం సృష్టించగల సత్తా ఉంది కాబట్టే గంగూలీ, పాంటింగ్, కుంబ్లే, గంభీర్ వంటి మాజీలు జట్టులో అతడికి చోటివ్వాలని, ప్రోత్సహించాలని అంటుంటారు. సిడ్నీలో లైయన్ బౌలింగ్‌లో అతడు బాదిన బౌండరీలు, సిక్సర్లు దాదాపుగా ఆసీస్‌కు చెమటలు పట్టించాయి. పుజారాతో కలిసి పంత్ మరింత భాగస్వామ్యం అందజేసుంటే భారత్ కచ్చితంగా విజయం సాధించేదే. నిజానికి పంత్ విలువేంటో అందరికీ తెలుసు. అందుకే అతడికి అండదండలు లభిస్తాయి. కానీ అతడు చేయాల్సింది మాత్రం ఒక్కటే. తన విలువేంటో తానే గుర్తించడం.
-ఇంటర్నెట్ డెస్క్
ప్రధానాంశాలు
సినిమా
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- ఆ ఓటమి కన్నా ఈ డ్రా మరింత ఘోరం
- భీమవరం మర్యాదా.. మజాకా..!
- బాయ్‌ఫ్రెండ్ ఫొటో పంచుకున్న కాజల్
- కన్న కూతురిపై ఏడేళ్లుగా అత్యాచారం
- మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్టు
- కొత్త అధ్యక్షుడి తీరని కోరిక!
- చీరకట్టుతో కమలా హారిస్ ప్రమాణ స్వీకారం?
- గుడివాడ రెండో పట్టణ ఎస్సై ఆత్మహత్య
- కూలీలపైకి దూసుకెళ్లిన లారీ..15 మంది మృతి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
