close

కథనాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కివీస్‌పై పగా? మంచోళ్లను ప్రేమిస్తాం డూడ్‌!

మీడియా సమావేశంలో విరాట్‌ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు

ఆక్లాండ్‌: న్యూజిలాండ్‌పై అసలు పగ, ప్రతీకారం వంటి ఆలోచనలే రావని టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ అన్నాడు. కివీస్‌ ఆటగాళ్లందరూ ఎంతో మంచోళ్లని ప్రశంసించాడు. వారు మైదానంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించరని పేర్కొన్నాడు. గతేడాది ఇంగ్లాండ్‌లో జరిగిన ప్రపంచకప్‌ సెమీస్‌లో కోహ్లీసేన 18 పరుగుల తేడాతో విలియమ్సన్‌ బృందం చేతిలో ఓడిన సంగతి తెలిసిందే. శుక్రవారం వారితో తొలి టీ20 ఆడుతున్న సందర్భంగా విరాట్‌ మీడియాతో మాట్లాడాడు.


చక్కని ప్రత్యర్థులు

న్యూజిలాండ్‌ ఆటగాళ్లందరూ చాలా చాలా మంచోళ్లు. వారితో ఆడుతుంటే ప్రతీకారం తీర్చుకోవాలని అస్సలు అనిపించదు. ఎన్నో ఏళ్లుగా మేం వారితో కలిసిమెలిసి ఆడుతున్నాం. ప్రతిసారీ మైదానంలో పోటీ గురించీ ధ్యాస ఉంటుంది. ఇంగ్లాండ్‌లో వారు అంతర్జాతీయ క్రికెట్‌ ఆడే దేశాలకు ఆదర్శంగా నిలిచారు. ప్రతి బంతి, ప్రతి మ్యాచును అత్యుత్తమంగా ఆడేందుకే ప్రయత్నిస్తారు. అది వారి దేహభాషలోనే ప్రతిబింబిస్తుంది. నిరంతరం వారు సత్ప్రవర్తనతోనే మెలుగుతారు. మైదానంలో అంగీకారయోగ్యం కాని పనులు చేయరు. సొంతగడ్డపై ఆడుతున్న ప్రయోజనం కివీస్‌కు ఉంటుంది. కానీ గతంలో మాకిక్కడ ఆడిన అనుభవం ఉంది. ప్రతి సిరీస్‌ను మేం తాజగానే ఆరంభిస్తాం. న్యూజిలాండ్‌లో న్యూజిలాండ్‌తో పోరు సవాలే. ఐతే మేం అందుకు సిద్ధం. అత్యుత్తమంగా ఆడతాం.


రాహుల్‌కే కీపింగ్‌!

యువ ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ అద్భుతంగా కీపింగ్‌ చేస్తున్నాడు. అదనపు బ్యాట్స్‌మన్‌ రూపంలో సమతూకాన్ని మరింత పెంచాడు. కొన్నాళ్లు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగాలని మేం కోరుకుంటున్నాం. మేం ఎవర్నుంచీ ఏమీ లాగేసుకోవడం లేదు. జట్టుకు వారేమిస్తున్నారన్నదే చూస్తున్నాం. ఇతర ఆటగాళ్ల పరిస్థితి ఏంటి? అని బయట మాట్లాడుతున్న సంగతి తెలుసు. జట్టుకు ఏదవసరం?అత్యుత్తమ సమతూకం తేవడమెలాగ అన్నదే మాకు కీలకం. టీమిండియా కోసం రాహుల్‌ ఎలాంటి పాత్ర ఇచ్చినా పోషించేందుకు సిద్ధంగా ఉన్నాడు. అతడు జట్టు మనిషి. అతనెప్పుడు కొత్త అవకాశాల కోసం ఎదురుచూస్తుంటాడు. దానిని సద్వినియోగం చేసుకుంటారు. ఆందోళన పడడు.


బాధలేదు

కీలక ఆటగాళ్లు గాయపడ్డారన్న బెంగ మాకేమీ లేదు. వారి స్థానాలను ఎవరితో భర్తీ చేయాలన్న ఆందోళన లేదు. ఐపీఎల్‌, భారత్‌-ఏ తరఫున టీ20లు ఆడిన చాలామంది ఆటగాళ్లు మాకు అందుబాటులో ఉన్నారు. ప్రపంచకప్‌లో ధావన్‌ గాయపడ్డాడు. శ్రీలంక సిరీస్‌కు మళ్లీ అందుబాటులోకి వచ్చాడు. పునరాగమనం ఎప్పుడు చేసినా జట్టు అతడిని ప్రేమిస్తుంది. అందుబాటులో ఉన్న ఆటగాళ్లతోనే అత్యుత్తమ బ్యాటింగ్‌ లైనప్‌ ఎంచుకుంటుంది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.