close

తాజావార్తలు


42 ఏళ్ల వయసులో లియాండర్‌ పేస్‌ గ్రాండ్‌శ్లామ్‌ గెలిస్తే...

36ఏళ్లప్పుడు నేనెంతో కొంత క్రికెట్‌ ఆడగలను:శ్రీశాంత్‌

కష్టకాలంలో అమ్మానాన్న, అత్తమామలు అండగా నిలిచారు

నా పిల్లలు నా కథ నుంచి శక్తి పొందుతారు

దిల్లీ: ‘42 ఏళ్ల వయసులో లియాండర్‌ పేస్‌ గ్రాండ్‌శ్లామ్‌ గెలిచినప్పుడు 36 ఏళ్ల వయసులో నేను ఎంతో కొంత క్రికెట్‌ ఆడగలను’ అని టీమిండియా వెటరన్‌ స్పీడ్‌స్టర్‌ ఎస్‌.శ్రీశాంత్‌ ధీమా వ్యక్తం చేశాడు. బీసీసీఐ తనపై విధించిన జీవితకాల నిషేధాన్ని సుప్రీం కోర్టు పక్కకు పెట్టిన తర్వాత అతడు మీడియాతో మాట్లాడాడు. 2013 ఐపీఎల్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలతో ముంబయి స్పిన్నర్‌ అంకింత్‌ చవాన్‌, హరియాణా క్రికెటర్‌ అజిత్‌ చండీలా సహా శ్రీశాంత్‌పై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

బీసీసీఐ గౌరవిస్తుందని భావిస్తున్నా
‘ఇన్నేళ్ల తర్వాత నాకు ఇకపై ఎలాంటి జీవితం దక్కనుందో తెలీదు. నా జీవితమైన క్రికెట్‌కు ఆరేళ్లు దూరమయ్యా. దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పును బీసీసీఐ గౌరవిస్తుందని భావిస్తున్నా. క్రికెట్‌ మైదానంలోని మళ్లీ నన్ను అనుమతిస్తుందని ఆశిస్తున్నా. ఇప్పుడు నేను పాఠశాల క్రికెట్‌ మైదానానికి వెళ్లగలను. ‘నన్ను అనుమతించలేదు’ అని చెప్పకుండా శిక్షణ పొందగలను. నాకెంత వీలైతే అంత క్రికెట్‌ను ఆడగలను’ అని శ్రీ చెప్పాడు.

ప్రపంచం అనుమానించిన వేళ..
‘నా అత్తమామలకు ధన్యవాదాలు చెబుతున్నా. ప్రపంచం నన్ను అనుమానించిన వేళ వారు నన్ను నమ్మారు. కూతుర్ని నాకిచ్చి పెళ్లిచేశారు. కష్టకాలంలో నా తల్లిదండ్రులు నాకు అండగా ఉన్నారు. విపత్కర సమయంలో నన్ను నమ్మడం అంత సులువు కాదు. అవును, నాతో కలిసి క్రికెట్‌ ఆడిన వారి నుంచి ఫోన్‌కాల్స్‌ వచ్చాయి. వాట్సప్‌ సందేశాలు వచ్చాయి. భజ్జు పా (హర్భజన్‌సింగ్‌) నాతో మాట్లాడాడు. వీరూ భాయ్, సురేశ్‌ (రైనా) నాతో టచ్‌లో ఉన్నారు. నా ప్రియ మిత్రుడు రాబిన్‌ (ఉతప్ప)తో ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటా’ అని పేర్కొన్నాడు.

నా పిల్లలు తెలుసుకుంటారు
‘ఇంతకాలం, నేను నా పిల్లలకు ఏం చెప్పాలా అని తరుచూ ఆలోచించేవాడిని. ఒక తండ్రిగా వారు నా గురించి ఏమనుకుంటున్నారో అని ఆలోచించేవాడిని. ఇప్పుడు, వారు పెరిగి పెద్దైన తర్వాత కష్ట సమయంలో పోరాటం వదలకపోవడమే తమ తండ్రి బలమని చెప్తాను. తమ తండ్రి జైలుకు వెళ్లాడని, గడ్డు కాలం గడిపాడని, తనపై వచ్చిన తప్పుడు ఆరోపణలను ఎదుర్కొని పటిష్ఠంగా తిరిగొచ్చాడని వారు తెలుసుకుంటారు. నా జీవిత కథ నుంచి వారు శక్తిని పొందగలరు’ అని శ్రీశాంత్‌ భావోద్వేగంతో చెప్పాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.