close

తాజావార్తలు

విండీస్‌ను చిత్తు చేసిన బంగ్లా

ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం

టాంటన్‌: పసలేని బౌలింగ్‌.. పదునులేని ఫీల్డింగ్‌.. నిలకడలేని బ్యాటింగ్‌.. మొత్తంగా ఆల్‌రౌండర్లతో దుర్భేద్యంగా ఉన్న భీకర వెస్టిండీస్‌.. బంగ్లాదేశ్‌ ముందు తలవంచింది. అది కూడా మామూలుగా కాదు. ఏకంగా ఏడు వికెట్ల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. ఫలితం ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌కు రెండో విజయం. ఆల్‌రౌండర్‌ ప్రదర్శన చేసిన షకిబ్‌ అల్‌ హసన్‌(124*; 99బంతుల్లో 16×4) శతకంతో చెలరేగి.. అంతకుముందు (2/54)బంతితోనూ రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతనితోపాటు లిటన్‌ దాస్‌(94*; 69బంతుల్లో 8×4, 4×6) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడటంతో విండీస్‌ నిర్దేశించిన 322 పరుగుల భారీ లక్ష్యాన్ని బంగ్లాదేశ్‌ మూడు వికెట్ల కోల్పోయి 41.3 ఓవర్లలోనే ఛేదించింది. అంతకుముందు బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌కు వన్‌డౌన్‌ బ్యాట్స్‌మెన్‌ షై హోప్‌(96; 121బంతుల్లో 4×4, 1×6), లూయిస్‌(70; 67బంతుల్లో 6×4, 2×6), హెట్‌మయిర్‌(50; 26బంతుల్లో 4×4, 3×6) అర్ధశతకాలతో రాణించి ఆదుకున్నారు.  

బంతితో బంగ్లా భళా..

మ్యాచ్‌ ఆరంభంలోనే బంగ్లాదేశ్‌ పైచేయి సాధించింది. కారణం విధ్వంసక ఆటగాడు క్రిస్‌ గేల్‌ను ఖాతా తెరవనీయకుండానే పెవిలియన్‌కు పంపడం. 13 బంతులాడిన గేల్‌ బంగ్లా బౌలర్లను ఎదుర్కోవడంలో విఫలమై యువ బౌలర్‌ సైపుద్దీన్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన షై హోప్‌తో కలిసి లూయిస్‌ నిదానంగా ఇన్నింగ్‌ నిలబెడుతూ వచ్చాడు. గత మ్యాచ్‌ల కంటే భిన్నంగా ఆడుతూ వచ్చిన లూయిస్‌ ఆరంభంలో అనవసరపు షాట్లకు పోకుండా నిదానంగా జోరు కొనసాగించాడు. తర్వాత దూకుడు పెంచి అర్ధశతకం అందుకున్నా.. 25ఓవర్‌లో షకిబ్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడి సబ్బీర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన పూరన్(25) కాసేపు మెరిపించి వెళ్లాడు. అప్పుడు క్రీజులోకి వచ్చిన హేట్‌మయిర్‌.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. భారీ షాట్లతో అలరిస్తూ 25బంతుల్లోనే అర్ధశతకం అందుకున్నాడు. కానీ మరుసటి బంతికే ముస్తాఫిజుర్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. రసెల్‌(0) కూడా అదే ఓవర్‌లో చివరి బంతికి బౌల్డ్‌ అయ్యాడు. సారథి హోల్డర్‌(33; 15బంతుల్లో 4×4, 2×6) ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడినా.. కీలక సమయంలో ఔట్‌ అయ్యాడు. అయితే చివరి దాకా క్రీజులోనే ఉన్న షైహోప్‌ మాత్రం ఆశించినంత వేగంగా ఆడలేకపోవడం.. చివరి బ్యాట్స్‌మెన్‌ కూడా అనవసరపు షాట్లకు ప్రయత్నించి ఔట్‌ కావడంతో విండీస్‌ చేజేతులా భారీ స్కోరు చేసే అవకాశాన్ని కోల్పోయింది. దీంతో 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 321 పరుగుల వద్ద విండీస్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. 

బ్యాట్‌తోనూ అదే జోరు..

భారీ లక్ష్యమైనా బంగ్లా ఎక్కడా బెదరలేదు. భీకర బౌలింగ్‌తో బెంబేలెత్తిస్తున్న ఫాస్ట్‌ బౌలర్లును ధాటిగా ఎదుర్కొంటూ బంగ్లా ఓపెనర్లు మంచి ఆరంభమే ఇచ్చారు. తొలి వికెట్‌కు 52పరుగుల జోడించి సౌమ్య సర్కార్‌(29; 23బంతుల్లో 2×4, 2×6) తొమ్మిదో ఓవర్‌లో రసెల్‌ బౌలింగ్‌లో గేల్‌ చేతికి చిక్కాడు. 48పరుగుల వద్ద మరో ఓపెనర్‌ తమీమ్‌ షెల్డన్‌ చేతిలో రనౌట్‌గా పెవిలియన్‌కు చేరుకున్నాడు. అయితే అప్పటికే షకిబ్‌ కుదురుకున్నాడు. విండీస్ బౌలర్లను ధైర్యంగా ఎదుర్కొంటూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించడం ఆరంభించాడు. ముష్ఫికర్‌ రహీం(1) వెంటనే ఔట్‌ అయినా.. లిటన్‌ దాస్‌ సహకారంతో షకిబ్‌ జట్టును విజయం దిశగా నడిపించాడు. ఈ క్రమంలో థామస్‌ బౌలింగ్‌లో 34ఓవర్‌ ఆఖరి బంతిని బౌండరీకి తరలించి శతకాన్ని అందుకున్నాడు. అది కూడా 83బంతుల్లోనే.. ఇక అప్పటి నుంచి గేర్‌ మార్చి ఆడిన ఈ జోడీ విండీస్‌ బౌలర్లపై ఓవర్‌ ఓవర్‌కి ఆధిపత్యం కొనసాగిస్తూ వారిని పూర్తిగా ఒత్తిడిలోకి నెట్టేశారు. ఫీల్డింగ్‌ లోపాలు కూడా విండీస్‌కు ప్రతికూలంగా మారాయి. చివరి వరకూ అదే జోరు సాగించిన షకిబ్‌-లిటన్‌ జోడీ మరో వికెట్‌ పడకుండానే బంగ్లాకు అపురూప విజయాన్ని అందించారు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.