
తాజావార్తలు
మాంచెస్టర్: ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ మరో విజయంతో మురిసింది. మంగళవారం అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 150 పరుగుల భారీ తేడాతో అద్భుత విజయాన్ని కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 397 పరుగులు సాధించింది. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(148; 71బంతుల్లో 4×4, 17×6) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అతనితో పాటు బెయిర్‌స్టో(90; 99బంతుల్లో 8×4, 3×6), రూట్(88; 82బంతుల్లో 5×4, 1×6) అర్ధశతకాలతో రాణించడంతో ఇంగ్లాండ్ భారీ స్కోరు సాధించగలిగింది. లక్ష్య ఛేదనకు దిగిన అఫ్గానిస్థాన్ చివరిదాకా పోరాడింది. ఇంగ్లాండ్ బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ గొప్ప పట్టుదల ప్రదర్శించింది. పరుగులు రాబట్టలేకున్నా.. చివరిదాకా నిలిచి అభిమానులు మనసులు గెలుచుకుంది. కానీ చివర్లో ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి వరుస వికెట్లు కోల్పోవడంతో 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 247 పరుగులకే పరిమితమైంది. హస్మతుల్లా(76; 100బంతుల్లో 5×4, 2×6), రహమత్(46; 74బంతుల్లో 3×4, 1×6), అస్ఘర్(44; 48బంతుల్లో 3×4, 2×6) గొప్ప పోరాట ప్రతిమతో ఆకట్టుకున్నారు.
ఉప్పెనలా విరుచుకుపడ్డారు..
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ నిదానంగా ఇన్నింగ్స్ ఆరంభించింది. ఇంగ్లాండ్ తొలి పది ఓవర్లలో 46 పరుగులు చేసి ఓ వికెట్ చేజార్చుకుంది. ఓపెనర్ జేమ్స్ విన్సి (26) జట్టు స్కోరు 44 వద్ద వెనుదిరిగాడు. అఫ్గాన్‌కు అదొక్కటే సంతోషం! ఆ తర్వాత దిక్కుతోచని పరిస్థితి. అప్పటి వరకు నెమ్మదిగా ఆడుతున్న బెయిర్‌స్టో సహచరుడు జో రూట్ సహకారంతో వేగంగా ఆడి అర్ధశతకం అందుకున్నాడు. రెండో వికెట్‌కు 120 పరుగుల భాగస్వామ్యం అందించాడు. బౌండరీలు, సిక్సర్లతో భారీ విధ్వంసానికి శంఖారావం పూరించాడు. అయితే శతకానికి చేరువైన అతడిని 30వ ఓవర్లో గుల్బదిన్ నయీబ్ ఔట్ చేశాడు. అప్పటికి జట్టు స్కోరు 164. క్రీజులోకి రావడమే ఆలస్యం సారథి ఇయాన్ మోర్గాన్ సిక్సర్లు బాదడం మొదలుపెట్టాడు.
36 బంతుల్లో అర్ధశతకం.. 57 బంతుల్లో శతకం అందుకున్నాడు. ఇది నాలుగో అత్యంత వేగవంతమైన శతకం. అప్పటికే అతడు 11 సిక్సర్లు బాదాడు. దీంతో ఇంగ్లాండ్ 43.5 ఓవర్లకు 300 స్కోరు అందుకుంది. శతకం తర్వాత మరింత చెలరేగాడు మోర్గాన్. ఎడాపెడా సిక్సర్లు బాదాడు. తన ఇన్నింగ్స్‌లో 17 సిక్సర్లు బాదేశాడు. వన్డేల్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్ల రికార్డు సృష్టించాడు. క్రిస్‌గేల్ (16 సిక్సర్లు), రోహిత్ శర్మ (16) ఘనతను తుడిచిపెట్టాడు. మరోవైపు రూట్ సైతం అర్ధశతకం చేశాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 189 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ తరఫున ఇదే అత్యధిక భాగస్వామ్యం. జట్టు స్కోరు 350 దాటిన తర్వాత గుల్బదిన్ నయీబ్ వేసిన 47వ ఓవర్లో వీరిద్దరూ పెవిలియన్ చేరారు. బెన్‌స్టోక్స్ (2), బట్లర్ (2) విఫలమైనా చివర్లో మొయిన్ అలీ తనదైన శైలిలో భారీ సిక్సర్లు బాది స్కోరు 397కు చేర్చాడు. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి అతడు 1 పరుగే చేశాడు. లేదంటే స్కోరు 400కు చేరేదే.
నిదానంగా ఆడినా..
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్ రెండో ఓవర్లోనే ఓపెనర్ నూర్ ఆలీ వికెట్ కోల్పోయింది. తర్వాత రహమత్‌తో కలిసి గుల్బదిన్ గొప్ప పోరాటం చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లను ఎదుర్కొంటూ కుదురుకునే ప్రయత్నం చేశాడు. నాలుగు బౌండరీలు, ఓ సిక్సర్‌తో కాసేపు ఆకట్టుకున్నాడు. కానీ 12ఓవర్లో మార్క్‌వుడ్ బౌలింగ్‌లో గుల్బాదిన్(37) బట్లర్ చేతికి చిక్కాడు. ఈ క్యాచ్‌ను బట్లర్ అందుకున్న తీరు అద్భుతం. అప్పుడు క్రీజులోకి వచ్చిన హస్మతుల్లా.. రహమత్‌తో కలిసి నిదానంగా స్కోరుబోర్డును నడిపించాడు. ఇంగ్లాండ్ బౌలర్లను అసహనానికి గురి చేస్తూ వికెట్ ఇవ్వకుండా ఈ జోడీ గొప్పగానే ఆడింది. కానీ 25ఓవర్లో రషీద్.. రహమత్(46) పెవిలియన్‌కు పంపి ఈ జోడీ విడగొట్టాడు. తర్వాత వచ్చిన ఆస్ఘర్(44)తోనూ హస్మతుల్లా గొప్ప భాగస్వామ్యమే నెలకొల్పాడు. ఈ క్రమంలోనే 35ఓవర్ ఆఖరి బంతికి బౌండరీ బాది హస్మతుల్లా అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. కానీ రషీద్, మార్క్ వుడ్, ఆర్చర్ చివర్లో కట్టుదిట్టంగా బంతులు వేయడంతో అఫ్గాన్ వరుస వికెట్లు కోల్పోయింది. అప్పటికే ఛేదించాల్సిన లక్ష్యం భారీగా ఉండటం.. ఓవర్లు కూడా పూర్తి అవడంతో భారీ ఓటమి తప్పలేదు.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
దేవతార్చన
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- ఎన్కౌంటర్ స్థలంలో.. హల్చల్!
- సంజుకు.. కోహ్లీసేనకు.. చావోరేవో
- నిందితుల్లో ఇద్దరు మైనర్లు?
- ఇక పీఎఫ్ తగ్గించుకుని.. జీతం పెంచుకోవచ్చా..!
- పెళ్లైన ఏడాదికే భర్తతో విడిపోయిన శ్వేతా బసు
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- ‘అమిత్ షాపై ఆంక్షల్ని పరిశీలించండి’
- నిర్భయ దోషులకు త్వరలో ఉరి