close

తాజావార్తలు

పరుగు తీయలేదు చక..చక..ఐనా అదుర్స్‌!
మార్టిన్‌ గప్తిల్‌. న్యూజిలాండ్‌ విధ్వంసక ఓపెనర్‌. 2015 ప్రపంచకప్‌లో డబుల్‌ సెంచరీ వీరుడు. ఈ సారి కివీస్‌ అతడిపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. అనూహ్యంగా ఫామ్‌ కోల్పోయిన అతడు ఎక్కువ పరుగులు చేయకుండా నిరాశ పరిచాడు. ఫీల్డర్‌గా మాత్రం అందరినీ ఆకట్టుకున్నాడు. తన అద్భుత ప్రతిభతో అందరి నోట్లో నానాడు. సోషల్‌ మీడియాలో హీరో అయ్యాడు. ఎలాగో చూద్దామా!

దిమ్మెరపోయిన స్మిత్‌ 

ఈ మెగాటోర్నీలో కివీస్‌ తొలుత శ్రీలంకతో తలపడింది. 137 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో గప్తిల్‌ 51 బంతుల్లోనే 73తో అజేయంగా నిలిచాడు. తన మెరుపు బ్యాటింగ్‌తో ప్రత్యర్థికి దడ పుట్టించాడు. ప్చ్‌..! ఆ తర్వాత ఫామ్‌ కోల్పోయాడు. వరుసగా 25, 0, 35, 0, 5, 20, 8, 19 మాత్రమే చేశాడు. బ్యాటింగ్‌తో కాకపోయినా తిరుగులేని ఫీల్డింగ్‌ ద్వారా కివీస్‌ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఆస్ట్రేలియా మ్యాచ్‌లో స్టీవ్‌స్మిత్‌ క్యాచ్‌ను కళ్లుచెదిరే రీతిలో అందుకున్నాడు. షార్ట్‌ఫైన్‌ లెగ్‌లో నమ్మశక్యం కాని రీతిలో బంతిని ఒడిసి పట్టిన గప్తిల్‌ను చూసి స్మిత్‌ షాకయ్యాడు. నిరాశగా వెనుదిరిగాడు.

మహీ ఆశలపై నీళ్లు

ఈ పొడగరి మరో అద్భుత విన్యాసానికి భారత్‌తో సెమీఫైనల్‌ సాక్ష్యంగా నిలిచింది. సిక్సర్‌ బాది టీమిండియాను గెలిపించేందుకు సిద్ధమైన ఎంఎస్ ధోనీని ఆ తర్వాత క్షణాల్లోనే రనౌట్‌ చేసిన గప్తిల్‌కు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. ఫైన్‌ లెగ్‌లోకి బంతిని పంపించిన మహీ ఒక పరుగు తీశాడు. అవతలి ఎండ్‌లో భువనేశ్వర్‌ ఉండటంతో మళ్లీ స్ట్రైక్‌కు రావాలని రెండో పరుగుకు ప్రయత్నించాడు. అత్యంత వేగంగా పరుగెత్తాడు. ఇంతలోనే బంతి అందుకున్న గప్తిల్‌ రాకెట్‌ వేగంతో కీపర్‌ వైపు విసిరాడు. మహీ బ్యాటు క్రీజుకు రెండు అంగుళాల దూరంలో ఉండగా బంతి వికెట్లను గిరాటేసింది. చెప్పలేని బాధ, ఆవేదనతో మహీ మైదానం వీడాడు. ఈ రనౌట్‌తో గప్తిల్‌ సోషల్‌ మీడియాలో సంచలనంగా మారాడు.

తనకే షాక్‌!

ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైనల్లో గప్తిల్‌ చరిత్రలో నిలిచిపోయాడు. ఛేదనలో ట్రెంట్‌ బౌల్ట్‌ వేసిన ఆఖరి ఓవర్‌లో స్టోక్స్‌ తొలి రెండు బంతులు డిఫెండ్‌ చేశాడు. మూడో బంతిని కళ్లుచెదిరే సిక్సర్‌గా మలిచాడు. దాంతో సమీకరణం 3 బంతుల్లో 9 పరుగులుగా మారింది. నాలుగో బంతిని భారీ షాట్‌కు ప్రయత్నించినా కుదర్లేదు. అందుకే ఒక పరుగు పూర్తి చేసిన స్టోక్స్‌ రెండో పరుగు కోసం విశ్వ ప్రయత్నం చేశాడు. అప్పటికే బంతి అందుకున్న గప్తిల్‌ నేరుగా వికెట్ల వైపు విసిరాడు. క్రీజులోకి డైవ్‌ చేసిన స్టోక్స్‌ బ్యాటుకు తగిలిన బంతి రెప్పపాటు కాలంలో వేగంగా బౌండరీ దాటేసింది. ఉద్దేశ పూర్వకంగా బంతిని అడ్డుకోలేదు కాబట్టి స్టోక్స్‌ తప్పేమీ లేదని అంపైర్లు నిర్ణయించారు. తీసిన 2 పరుగులకు ఓవర్‌ త్రో రూపంలో వచ్చిన 4 పరుగుల్ని కలిసి మొత్తం 6 ఇచ్చారు. ఈ ఘటన గప్తిల్‌తో పాటు కేన్‌ విలియమ్సన్‌, ఆటగాళ్లు, అభిమానులను హతాశులను చేసింది. చివరి రెండు బంతుల్లో ఇంగ్లాండ్‌ విజయానికి 3 పరుగులు అవసరం కాగా రెండే చేయడంతో మ్యాచ్‌ టైగా ముగిసింది.

అంతులేని నిర్వేదం

విజేత ఎవరో తేల్చేందుకు అంపైర్లు సూపర్‌ ఓవర్‌ నిర్వహించారు. ఇంగ్లాండ్‌ 15 పరుగులు చేసింది. 16 పరుగుల విజయ లక్ష్యంతో జేమ్స్‌ నీషమ్‌, మార్టిన్‌ గప్తిల్‌ క్రీజులోకి వచ్చారు. 5 బంతుల్లో 14 పరుగులు చేశారు. ఆఖరి బంతికి కివీస్‌కు 2 పరుగులు కావాలి. క్రీజులో గప్తిల్‌ టెన్షన్‌తో ఉన్నాడు. ఆర్చర్‌ వేసిన ఫుల్‌ లెంగ్త్‌ బంతిని మిడ్‌ వికెట్‌ వైపు ఆడాడు. ఒక పరుగు చేశాడు. వెంటనే రెండో పరుగుకు మళ్లాడు. సగం దూరం వచ్చేశాడు. ఇంతలోనే ఫీల్డర్‌ జేసర్‌ రాయ్‌ బంతి అందుకొని జోస్‌ బట్లర్‌ వైపు విసిరాడు. క్రీజు ముందుకు వచ్చిన దానిని అందుకున్న బట్లర్‌ రెప్పపాటు క్షణంలో వికెట్లను గిరాటేశాడు. గప్తిల్‌ తన భారీ కాయంతో డైవ్‌ చేసినప్పటికీ ఫలితం లేదు. సూపర్‌ ఓవర్‌ సైతం టై కావడంతో మ్యాచ్‌లో ఎక్కువ బౌండరీలు కొట్టిన ఇంగ్లాండ్‌ను విజేతగా ప్రకటించారు. నిర్వేదంతో గప్తిల్‌ మోకాళ్లపై కూర్చొని పిచ్‌పైనే ఉండిపోయాడు. సహచరుడు నీషమ్‌, ప్రత్యర్థి ఆటగాడు క్రిస్‌వోక్స్‌ ఓదార్చినా అతడి కళ్లలో ఉబికి వస్తున్న కన్నీటి బిందువులను ఆపుకోలేకపోయాడు. ఇదీ ఈ ప్రపంచకప్‌లో మార్టిన్‌ గప్తిల్‌ రోలర్‌ కాస్టర్‌ రైడ్‌!!

- ఇంటర్నెట్‌డెస్క్‌


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.