close

తాజావార్తలు

మహీ.. నీ దేశభక్తికి సలామ్‌

ప్రపంచకప్‌ అనంతరం ధోనీ రిటైర్మెంట్‌పై వస్తున్న వార్తలకు ప్రస్తుతానికి కామా పడింది. వచ్చే నెలలో మొదలు కానున్న విండీస్‌ పర్యటనకు దూరంగా ఉంటానని ధోనీనే స్వయంగా బీసీసీఐకి చెందిన ఓ ఉన్నతాధికారితో చెప్పినట్టు తెలిసింది. గౌరవ లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలో ఉన్న ఈ మాజీ సారథి తర్వాతి రెండు నెలలూ పారామిలిటరీ రెజిమెంట్‌తో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ గొప్ప ప్రశాంతత ప్రదర్శించే మిస్టర్‌ కూల్‌ ఊహించని నిర్ణయంతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అనూహ్య నిర్ణయాలు తీసుకోవడం మహీకి కొత్తేమీ కాదు. ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో తన దేశభక్తిని ధోనీ భిన్న రూపాల్లో చూపించాడు. ఆర్మీ క్యాంపులు సందర్శించడం, గ్లోవ్స్‌పై బలిదాన్‌ గుర్తుతో బరిలోకి దిగడం.. ఇలా ఒక్కటేమీటి ఒక లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలో ఉన్న ధోనీ ఎన్నో సందర్భాల్లో తన దేశభక్తిని వైవిధ్యంగా చాటాడు. వాటిలో కొన్ని..

‘క్రికెట్‌ వల్లనే నేనీ స్థాయిలో ఉన్నాను. దేశానికి సేవ చేయడానికి నాకు దొరికిన గొప్ప అవకాశం ఇది. ఎప్పుడైతే నా క్రికెటర్‌ కెరీర్‌ ముగుస్తుందో.. వెంటనే ఆర్మీలోకి వచ్చి దేశసేవకి అంకితమవుతాను’ లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలో జమ్మూలోని నియంత్రణ రేఖ, సియాచిన్‌ బేస్‌ క్యాంపు సందర్శనలో ఉన్నప్పుడు ధోనీ నాడు అన్న మాటలివి. 

2011, నవంబర్‌ 1న ప్యారాచూట్‌ రెజిమెంట్‌లో ఎంఎస్‌ ధోనీ గౌరవ లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదా పొందుతున్న నాటి దృశ్యం. ఒలింపిక్స్‌లో షూటింగ్‌లో బంగారు పతాకం గెలిచిన అభినవ్‌ బింద్రాతో పాటుగా ధోనీ ఈ హోదాతో గౌరవం పొందాడు. 

గతేడాది ధోనీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా భారత అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్‌ అందుకున్నాడు. లెప్టినెంట్‌ కల్నల్‌ హోదాలో ఉన్న ధోనీ పురస్కారాన్ని అందుకోవడానికి సైనిక దుస్తులతో వచ్చి తనలోని దేశభక్తిని గొప్పగా చాటుకున్నాడు. పురస్కారం అందుకోవడానికి వచ్చే ముందు ధోనీ చేసిన సైనిక కవాతును చూసిన ప్రతి భారతీయుడి మది కచ్చితంగా తన్మయంతో పులకరించిపోయిందనటంలో సందేహం లేదుకదా!

ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత సైనికులు ప్రయాణిస్తున్న వాహన శ్రేణిపై పుల్వామా వద్ద ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 40మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉగ్ర ఘాతకానికి యావత్‌ జాతి మొత్తం ఖండించింది. పెద్ద ఎత్తున నివాళులు అర్పించారు. ఈ క్రమంలో భారత క్రికెట్‌ జట్టు కూడా అమరులకు నివాళి అర్పిస్తూ మార్చిలో రాంచీ వేదికగా ఆసీసీతో వన్డేలో ఆర్మీ టోపీలను ధరించి మైదానంలోకి దిగింది. ఈ టోపీలను ధోనీనే స్వయంగా జట్టు సభ్యులకు అందించడం ప్రత్యేక ఆకర్షణ.

అది హామిల్టన్‌ వేదికగా న్యూజిలాండ్‌తో మూడో టీ20 మ్యాచ్‌. భారత్‌ ఫీల్డింగ్‌ కొనసాగుతుండగా మైదానంలో ఓ అభిమాని జాతీయ జెండాతో ఒక్కసారిగా ధోనీ కాళ్లపై పడ్డాడు. ఆ సమయంలో అతని చేతిలో ఉన్న జాతీయపతాకం చేజారుతుండగా అప్రమత్తమైన ధోనీ.. పతాకాన్ని కింద పడకుండా పట్టుకొని జాతి పట్ల తనకున్న గౌరవాన్ని మరోసారి చాటాడు.

ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో తన గ్లోవ్స్‌పై బలిదాన్‌ గుర్తుతో ధోనీ బరిలోకి దిగాడు. దీనిపై ఐసీసీ అభ్యంతరం తెలిపింది. ఒకనొక దశలో దీనిపై పెద్ద చర్చే సాగింది. కానీ ఐసీసీ నిబంధనల కారణంగా తర్వాతి మ్యాచ్‌లో బలిదాన్‌ గుర్తులేకుండానే ఆడాడు.

లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలో ఆగ్రా పారా ట్రైనింగ్‌ స్కూల్‌లో సాధన చేస్తున్న దృశ్యం. ఈ హోదాలో మొదటిసారి శిక్షణకు హాజరైన ధోనీ రెండు వారాల పాటు జరిగిన సాధారణ శిక్షణలో పాల్గొన్నాడు. 

చెన్నైలో జరిగిన డిఫెన్స్‌ ఎక్సో-2018 కార్యక్రమంలో పాల్గొన్న ధోనీ. ‘ఇండియా: ది ఎమర్జింగ్‌ డిఫెన్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ హబ్‌’ పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో భారత రక్షణ రంగంలో యుద్ధ విమానాలు, యుద్ధ ట్యాంకుల ప్రదర్శన జరిగింది. ఆ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ధోనీ యుద్ధ ట్యాంకులను పరిశీలిస్తున్న దృశ్యం. 

లెఫ్టినెంట్‌ కల్నల్‌ శిక్షణలో భాగంగా ధోనీ తొలిసారి ప్యారాచూట్‌ జంప్‌కు సిద్ధమవుతున్న దృశ్యం. ఏఎన్‌-32 ట్రాన్స్‌పోర్ట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ నుంచి 1,250 అడుగుల ఎత్తు నుంచి ధోనీ ప్యారాచూట్‌ జంప్‌ చేశాడు. 

లెప్టినెంట్‌ కల్నల్‌ హోదాలో ధోనీ భారత్‌-పాక్‌ నియంత్రణ రేఖ వద్ద సైనిక శిబిరాన్ని, సియాచిన్‌ బేస్‌ క్యాంపును సందర్శించిన నాటి దృశ్యం. అక్కడే ఉన్న సైనిక కుటుంబాలతో ముచ్చటించిన ధోనీ.. ఆర్మీ మేజర్ల సమక్షంలో నియంత్రణ రేఖ సరిహద్దులను పరిశీలించాడు. 

 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.