
తాజావార్తలు
ఓపెనర్ మయాంక్ అగర్వాల్ రెండో డబుల్ సెంచరీ
ఆటముగిసే సరికి భారత్ 493/6, 343 పరుగుల ఆధిక్యం
హోల్కర్ స్టేడియం దద్దరిల్లింది. పరుగుల వరదతో తడిచి ముద్దైంది. టీమిండియా బ్యాట్స్‌మెన్ ఒకే రోజు 400 పరుగులు చేశారు. యువ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (243; 330 బంతుల్లో 29×4, 8×6)దే అందులో సగం వాటా. సొగసైన బౌండరీలు కళ్లు చెదిరే సిక్సర్లతో అతడు సాధించిన రెండో ద్విశతకం చూసి అభిమానులు పరవశంలో మునిగి తేలారు. అతడి విజృంభణకు రికార్డులెన్నో బద్దలయ్యాయి. ఛెతేశ్వర్ పుజారా (54; 72 బంతుల్లో 9×4), అజింక్య రహానె (86; 172 బంతుల్లో 9×4), రవీంద్ర జడేజా (60 బ్యాటింగ్; 76 బంతుల్లో 6×4, 2×6) అర్ధశతకాలు సాధించడంతో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా భారీ స్కోరు చేసింది. రెండో రోజు, శుక్రవారం ఆట ముగిసే సరికి 493/6తో నిలిచింది. ఆఖర్లో నైట్‌వాచ్ మన్ ఉమేశ్ యాదవ్ (25 బ్యాటింగ్; 10 బంతుల్లో 1×4, 3×6) పదునైన సిక్సర్లతో అభిమానులను ఆనందంలో ముంచెత్తాడు. వెరసి ప్రత్యర్థిపై కోహ్లీసేన 343 పరుగుల ఆధిక్యంలో ఉంది.
ఇండోర్‌లో రెండో రోజంతా ‘మయాంకం’ నడిచింది. 43 పరుగులతో ఆట ఆరంభించిన చెతేశ్వర్ పుజారా అర్ధశతకం కాగానే ఔటయ్యాడు. జట్టు స్కోరు 105 వద్ద అబు జయేద్ అతడిని ఔట్ చేశాడు. మరి కాసేపటికే సారథి విరాట్ కోహ్లీ (0; 2 బంతుల్లో) డకౌట్ అవ్వడంతో అభిమానులు నిరాశచెందారు. అయితే వారి మోముల్లో నవ్వులు విరబూయించాడు మయాంక్. 98 బంతుల్లో అర్ధశతకం చేసిన అతడు అజింక్య రహానెతో కలిసి చెలరేగాడు. వీరిద్దరూ సునాయాసంగా బంగ్లా బౌలర్లను ఎదుర్కోవడంతో 188/3తో టీమిండియా లంచ్‌కు వెళ్లింది. ఆ తర్వాత చూడముచ్చటైన బౌండరీలతో మయాంక్ శతకం అందుకున్నాడు. రహానె అర్ధశతకం చేయడంతో నాలుగో వికెట్‌కు 190 పరుగుల భాగస్వామ్యం ఏర్పడింది. క్రీజులో కుదురుకున్న ఈ జోడీని జింక్స్‌ను ఔట్ చేయడం ద్వారా అబు జయేద్ విడదీశాడు. అప్పుడు స్కోరు 309.
తేనీటి విరామం తర్వాత క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజాతో కలిసి మయాంక్ స్కోరుబోర్డును వేగంగా కదిలించాడు. వరుస బౌండరీలు బాదాడు. ఓ భారీ సిక్సర్‌తో కెరీర్లో రెండో ద్విశతకం (303 బంతుల్లో) అందుకున్నాడు. ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వేగంగా త్రిశతకం అందుకునే క్రమంలో జట్టు స్కోరు 432 వద్ద మెహదీ హసన్ బౌలింగ్‌లో అబు జయేద్‌కు క్యాచ్ ఇచ్చాడు. జడ్డూతో 123 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. ప్రత్యర్థి ఆటగాళ్లంతా అతడిని అభినందించారు. వృద్ధిమాన్ సహా (12) నిరాశపరిచాడు. అశ్విన్ కన్నా ముందుగా వచ్చిన ఉమేశ్ యాదవ్ భారీ సిక్సర్లు బాదడంతో స్కోరుబోర్డు పరుగులెత్తింది. జడ్డూ అర్ధశతకం చేసిన తర్వాత ఆట ముగిసింది. బంగ్లా పేసర్ అబు జయేద్ (4/108) ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం టీమిండియా 343 పరుగుల ఆధిక్యంలో ఉంది. మూడోరోజు ఒక సెషన్ ఆడిన తర్వాత కోహ్లీసే ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే అవకాశం ఉంది.
- ఇండోర్
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
దేవతార్చన
- విడాకులిప్పించి మరీ అత్యాచారం...
- రివ్యూ: వెంకీ మామ
- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- ఆయేషా మీరా భౌతికకాయానికి ‘రీ-పోస్టుమార్టమ్’..?
- స్నానాల గదిలో సీసీ కెమెరా ఏర్పాటుకు యత్నం
- బాలీవుడ్ భామతో పంత్ డేటింగ్?
- వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలుస్తాం: మోదీ
- ఇండిగో విమానం 9 గంటల ఆలస్యం
- ఎన్‌కౌంటర్‌పై జ్యుడీషియల్ విచారణ... పోలీసుశాఖలో అలజడి
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం