
తాజావార్తలు
ముంబయి: పోటీ క్రికెట్లో తిరిగి పునరాగమనం చేసిన టీమ్ఇండియా ఓపెనర్ పృథ్వీషా అదరగొట్టాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్లో అసోం బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ముంబయి తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు 39 బంతుల్లోనే 63 పరుగులు బాదాడు. పునరాగమనం చేసిన తొలి మ్యాచ్‌లోనే విజృంభించిన పృథ్వీషాకు బీసీసీఐ స్వాగతం పలికింది. అతడి అర్ధశతకం సెలబ్రేషన్స్‌ను ట్విటర్లో పోస్ట్ చేసింది. ఆదిత్య (82) కూడా అర్ధశతకంతో రాణించడంతో ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన అసోం 8 వికెట్లు కోల్పోయి 123 పరుగులే చేసింది. దీంతో ముంబయి 83 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
డోపింగ్ పరీక్షలో విఫలమైన పృథ్వీషాను బీసీసీఐ ఎనిమిది నెలలు సస్పెండ్ చేసింది. మార్చిలో అతడు ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడాడు. ఆ సమయంలో జలుబు చేయడంతో ఔషధాల దుకాణం నుంచి దగ్గు మందు కొనుగోలు చేసి వాడాడు. అందులో ‘వాడా’ బహిస్కృత డ్రగ్ ‘టర్బులిన్’ ఉంది. ఆటగాళ్లు ముందుగా బోర్డు అనుమతి తీసుకొంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. తొందరపాటులో పృథ్వీషా ఈ విషయాన్ని బీసీసీఐకి వెల్లడించలేదు. ఫలితంగా 8 నెలల సస్పెన్షన్ ఎదుర్కొన్నాడు. నవంబర్ 15న అతడిపై సస్పెన్షన్ తొలగిపోయింది. గత వారంలో పుట్టినరోజు జరుపుకున్న అతడు పునరాగమనం తర్వాత చెలరేగుతానని ధీమా వ్యక్తం చేశాడు. ఇకపై మీరు పృథ్వీషా 2.0ని చూస్తారని ట్వీట్ చేశాడు.