close

తాజావార్తలు

ఓడిపోవడం అంటే.. ఆగిపోవడం కాదు!

పోరాడుతున్న బంగ్లా షేర్‌ ముష్ఫికర్‌

క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు ముష్ఫికర్ రహీమ్‌. సహచరులంతా వెనుదిరుగుతున్నా విజయం కోసం ఒక్కడే నిలబడతాడు. జట్టు బాధ్యతలను భుజాన వేసుకొని చివరి వరకు పోరాడతాడు. కానీ, ఆఖర్లో గెలుపు ముంగిట బోల్తాపడుతుంటాడు. బంగ్లాదేశ్‌ వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మెన్, సారథిగా జట్టుకు ఎన్నో మధుర విజయాలు అందించిన అతడు.. ఎన్నో ఓటములను చవిచూశాడు. విజయానికి అడుగు దూరంలో ఎన్నో మ్యాచుల్లో నిలిచిపోయాడు. పోరాడుతున్నా దేశాన్ని గెలిపించలేకపోయానని ఎన్నోసార్లు బాధపడ్డాడు. బహుశా ఓటమి బాధేంటో ముష్ఫికర్‌కు మాత్రమే తెలుసేమో! అయినా తిరిగి మరింత శక్తిని కూడగట్టుకొని బరిలోకి దిగుతున్నాడు.

అరంగ్రేటంలోనే రికార్డు!

ముష్ఫికర్ 16 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్‌ మొదలుపెట్టాడు. 2005లో లార్డ్స్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు ఆడాడు. లార్డ్స్‌లో ఆడిన అతి పిన్నవయస్కుడిగా రికార్డు సృష్టించాడు. తొలి టెస్టులో రాణించలేకపోయినా, తర్వాత నిలకడగా ఆడుతూ 2007 ప్రపంచకప్‌కు ఎంపికయ్యాడు. ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాను ఓడించడంలో కీలక పాత్ర పోషించాడు. అజేయంగా అర్ధశతకం బాది జట్టుకు చారిత్రక విజయాన్ని అందించాడు. ఆ తర్వాత అతడు వెనుదిరిగి చూడలేదు. 2007లో శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఎంపికయ్యాడు. జట్టును గెలిపించాలని ఆఖరి వరకు పోరాడాడు. కానీ, లంక బౌలర్ల ముందు నిలవలేకపోయాడు. 

మొదటి ఇన్నింగ్స్‌లో లంక బౌలర్ల ధాటికి బంగ్లా 62 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బరిలోకి దిగిన శ్రీలంక 451/6 స్కోరు వద్ద మొదటి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. 389 పరుగుల వెనుకంజతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన బంగ్లా 78 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.  కెరీర్‌లో మూడో టెస్టే ఆడుతున్న ముష్ఫికర్‌ జట్టు బాధ్యతలను భుజాన వేసుకొని గొప్పగా పోరాడాడు. 80 పరుగులు చేసి బంగ్లా స్కోరు 299 పరుగులకు చేర్చాడు. ఓటమి నుంచి జట్టును కాపాడాలని అతడు శ్రమించినా ఫలితం లేకపోయింది. కానీ, ఈ పోరాటంతో సుదీర్ఘ ఫార్మాట్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.


భారత్‌పై పోరాడినా తప్పని ఓటమి
2010లో సొంతగడ్డపై బలమైన భారత జట్టుతో ముష్ఫికర్‌ పోరాడిన ఇన్నింగ్స్‌ను క్రికెట్‌ అభిమానులు ఎన్నటికి మరవలేరు. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్ఇండియా సచిన్ శతకంతో అదరగొట్టగా 243 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో 242 పరుగులు చేసింది. మహ్మదుల్లా (69), ముష్ఫికర్‌ (44) రాణించారు. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 413/8 స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది. 415 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన బంగ్లా 135 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన ముష్ఫికర్‌ ఎంతో బాధ్యతాయుతంగా ఆడాడు. చక్కని షాట్లతో అలరించాడు. కానీ, సహచరులంతా భారత బౌలర్ల ధాటికి వెనుదిరుగుతున్నారు. అయినా క్రీజులో నిలబడి స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు.  బంతుల్ని బౌండరీకి తరలిస్తూ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. దీంతో స్కోరుబోర్డు 300 పరుగులు దాటింది. కానీ, అతడిని మిశ్రా బోల్తా కొట్టించడంతో బంగ్లా పోరాటం ముగిసింది. తొలి శతకం అందుకున్నానన్న సంతోషం కంటే జట్టును గెలిపించలేకపోయాననే వేదనే అతడిని ఎక్కువ కలచివేసింది.


కెప్టెన్సీ తప్పించినా.. తగ్గని పోరాటం

2012, ఆసియాకప్‌కు ముష్ఫికర్‌ను సారథిగా ఎంపికచేశారు. అతడి సారథ్యంలో బంగ్లా తొలిసారిగా ఫైనల్‌కు చేరింది. 2013, మార్చిలో శ్రీలంకతో జరిగిన మొదటి టెస్టులో అతడు ద్విశతకాన్ని బాది చరిత్ర సృష్టించాడు. బంగ్లా తరఫున డబుల్ సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు సాధించాడు. ఆ తర్వాత కొన్ని కారణాలతో 2013, మేలో కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. కానీ, బంగ్లా క్రికెట్ బోర్డు జులైలో మరోసారి జట్టు పగ్గాలను తనకే కట్టబెట్టింది. నవంబర్‌లో స్వదేశంలో జరిగిన న్యూజిలాండ్‌ వన్డే సిరీస్‌ను 3-0తో గెలిపించాడు. 2014లో జరిగిన ఆసియా కప్‌లో భారత్‌ మ్యాచ్‌లో గాయపడి కూడా శతకాన్ని సాధించాడు. కానీ, జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. 

ఆసియాకప్‌లో అఫ్గాన్‌ చేతిలో కూడా బంగ్లా పరాజయాన్ని చవిచూసింది. ఆ తర్వాత వెస్టిండీస్‌ సిరీస్‌లో కూడా ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయింది. దీంతో అతడిని వన్డే కెప్టెన్సీ బాధ్యతలను బీసీబీ తప్పించింది. అయినా బ్యాటింగ్‌లో గొప్ప ప్రదర్శన చేస్తూ సిరీసుల్లో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 2015 ప్రపంచకప్‌లో జట్టును క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరడంలో కీలకపాత్ర పోషించాడు. మెగాటోర్నీ తర్వాత కూడా తన సూపర్‌ ఫామ్‌ను కొనసాగించాడు. పాక్‌ను వైట్‌వాష్ చేయడంలో తనదైన పాత్ర పోషించాడు. ఆ తర్వాత జరిగిన 2016 టీ20 ప్రపంచకప్‌ ముష్ఫికర్‌కు చేదు జ్ఞాపకంగా నిలిచిపోయింది. గెలుపు ముంగిట్లో అతడు బోల్తా పడటంతో ప్రపంచకప్‌ నుంచి బంగ్లా నిష్క్రమించాల్సి వచ్చింది.


అనూహ్య ఓటమి

2016 ప్రపంచకప్ గ్రూప్‌ దశలో బెంగళూరు వేదికగా భారత్‌తో బంగ్లా తలపడింది. క్వార్టర్‌ ఫైనల్స్‌కు అర్హత సాధించాలంటే ఇరు జట్లకు తప్పక గెలవాల్సిన మ్యాచ్‌ అది. బంగ్లా విజయానికి ఆరు బంతుల్లో 11 పరుగులు అవసరం. అయినా బంగ్లా అభిమానులు గెలుపుపై ధీమాగా ఉన్నారు. దానికి కారణం క్రీజులో ముష్ఫికర్ రహీమ్ ఉన్నాడు‌. హార్దిక్‌ పాండ్య వేసిన ఆఖరి ఓవర్‌ తొలి బంతిని మహ్మదుల్లా సింగిల్‌ తీసి స్ట్రైక్‌రొటేట్‌ చేశాడు. రెండో బంతిని ముష్ఫికర్ ఎక్స్‌ట్రా కవర్‌ మీదుగా కళ్లుచెదిరే బౌండరీ బాదాడు. ఆ తర్వాతి బంతిని ధోనీ, షార్ట్‌ ఫైన్‌లెగ్‌ ఫీల్డర్ మధ్య నుంచి ఫోర్‌ బాదాడు. దీంతో విజయ సమీకరణం మూడు బంతుల్లో రెండు పరుగులుగా మారింది. భారీ షాట్‌తో దేశానికి చారిత్రక విజయాన్ని అందించాలని నాలుగో బంతిని మిడ్‌వికెట్‌ మీదుగా భారీ షాట్ ఆడాడు. కానీ, ధావన్‌ క్యాచ్‌ పట్టడంతో ముష్ఫికర్ పోరాటం ముగిసింది. ఆ తర్వాత రెండు బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయి బంగ్లా పరుగు తేడాతో ఓటమిపాలైంది.

 

జట్టు బాధ్యతలను భుజాన వేసుకొని ఆఖరి వరకు పోరాడే ముష్ఫికర్‌ ఆఖర్లో మాత్రం తడబడుతుంటాడు. దీంతో ఎన్నో విజయాలు అతడికి దూరమయ్యాయి. అయినా నిరాశ చెందకుండా తిరిగి తన దేశం కోసం కసిగా పోరాడుతున్నాడు. జట్టుకు అతడే ప్రధాన బలం. ప్రస్తుతం భారత్‌తో జరుగుతున్న సిరీస్‌లో సీనియర్‌ ఆటగాళ్లు షకిబ్‌, తమీమ్‌ లేకపోయినా బంగ్లా పోటీ ఇస్తుందంటే అతడే కారణం. దిల్లీ టీ20లో అర్ధశతకంతో బంగ్లాను గెలిపించిన అతడు ఇండోర్‌ టెస్టులో కూడా జట్టును ఆదుకున్నాడు. ఇతర బ్యాట్స్‌మెన్‌ అంతా తేలిపోతుంటే అతడు మాత్రం క్రీజులో నిలబడి భారత బౌలర్లతో పోరాడాడు. ఎన్నో ఓటములు అతడిని కలచివేస్తున్నా..  ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదని, మరింత గొప్పగా పోరాడే అవకాశమని తిరిగి బరిలోకి దిగుతున్నాడు ముష్ఫికర్‌!!

- ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.