close

తాజావార్తలు

దశాబ్దపు ఫీల్డింగ్‌ రారాజు

మైదానంలో రాజపుత్ర చిరుత

అన్ని విభాగాల్లో ఆరితేరిన ఆటగాడు జట్టులో ఉండాలని ప్రతిసారథి ఆశిస్తాడు. బంతితో మాయచేస్తూ, బ్యాటుతో సత్తా చాటుతూ, మైదానంలో చిరుతలా కదులుతూ మొత్తంగా ప్రత్యర్థిపై ఒత్తిడి తీసుకువచ్చే ప్లేయర్‌ కావాలని భావిస్తాడు. వీటికి సరితూగే ఆల్‌రౌండర్లు క్రికెట్‌ ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. కానీ నిఖార్సయిన రవీంద్ర జడేజా లాంటి ఆల్‌రౌండర్‌ మరొకరు ఉండరు అంటే అతియోశక్తి కాదు! మైదానంలో ఎన్ని గంటలు పోరాడుతున్నా అలసట అనేది అతడిలో కనిపించదు. ఫీల్డింగ్‌లో తడబాటు ఉండదు. అతడి వైపు షాట్‌ కొట్టి పరుగు కోసం ప్రయత్నించాలంటే బ్యాట్స్‌మన్‌ కాస్త ఆలోచించాల్సిందే. మెరుపు వేగంతో బంతితో వికెట్లకు సందిస్తాడు. ఫీల్డింగ్‌లో, ఫిట్‌నెస్‌లో చిరుతగా గుర్తింపు తెచ్చుకున్న సర్‌ జడేజా జన్మదినం నేడే! 

యువకులకు స్ఫూర్తి

మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన జడేజా యువ క్రికెటర్లకు స్ఫూర్తి. కష్టపడితే విజయం దరి చేరుతుందనడానికి అతడే ఉదాహరణ. అతడి తండ్రి అనిరుధ్‌ వాచ్‌మెన్‌గా పనిచేసేవారు. జడేజాను ఆర్మీ ఉద్యోగిగా చూడాలనుకున్నాడు. కానీ చిన్ననాటి నుంచి జడేజా క్రికెట్‌పై మక్కువ పెంచుకున్నాడు. భారత జట్టులో చోటు సంపాదించాలని తీవ్రంగా శ్రమించాడు. 2005లో అతడి తల్లి లత ప్రమాదంలో అకస్మాతుగా మరణించింది. దీంతో అతడి జీవితంలో సమస్యలు మరింత జఠిలమయ్యాయి. అయినా తన సోదరి నైనా సాయంతో తిరిగి క్రికెట్‌పై దృష్టి సారించాడు. 2006 భారత అండర్‌-19 ప్రపంచకప్‌ జట్టులో చోటుసంపాదించాడు. ఫైనల్లో పాక్‌ చేతిలో భారత్‌ ఓటమిపాలైంది. ఈ టోర్నీలో సత్తా చాటిన జడేజా ప్రశంసలు పొందాడు. ఆ తర్వాత కోహ్లీ సారథ్యంలో 2008, మలేషియాలో జరిగిన అండర్‌-19 ప్రపంచకప్‌ జట్టుకు వైస్‌కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ టోర్నీలో కోహ్లీసేన విజేతగా నిలిచింది. టైటిల్‌ను గెలవడంలో జడ్డూది కీలకపాత్ర.  

కెరీర్‌లో ఎత్తు పల్లాలు

ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో నిలకడగా ఆడుతూ భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో అజేయ అర్ధ శతకంతో రాణించాడు. ఆ తర్వాత 2009 టీ20 ప్రపంచకప్‌కు ఎంపికయ్యాడు. బంతితో ఫర్వాలేదనిపించినా బ్యాటుతో ఆకట్టుకోలేకపోయాడు. అనంతరం అంతగా పోరాడుతున్నా పెద్దగా పేరు సంపాదించలేకపోయాడు. కానీ 2013 ఛాంపియన్స్‌ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన చేశాడు. టోర్నీలో అత్యధిక వికెట్లు సాధించి భారత్‌ టైటిల్‌ గెలవడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఆ తర్వాత అతడు మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. సుదీర్ఘ ఫార్మాట్‌లో భారత్‌ను నంబర్‌ వన్‌ స్థానంలో నిలబెట్టడంతో జడేజా తనదైన పాత్ర పోషించాడు. రవిచంద్రన్‌ అశ్విన్‌తో కలిసి ప్రత్యర్థులను ముప్పతిప్పలు పెట్టాడు. కానీ 2015 ప్రపంచకప్, 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో జట్టులో స్థానం కోసం ఎదురు చూశాడు. కొన్ని సిరీస్‌లకు ఎంపికవుతున్నా తుది జట్టులో చోటు సంపాదించలేకపోయాడు. 

అసాధారణ పోరాటం

2019 ప్రపంచకప్‌ సెమీస్‌లో జడేజా పోరాటం క్రికెట్‌ అభిమానులు ఎన్నటికీ మరవలేరు. కఠిన పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చి అద్వితీయంగా పోరాడాడు. సహచరులంతా సింగిల్స్‌, డబుల్స్‌ కోసం తంటాలు పడుతుంటే అతడు మాత్రం బౌండరీలు, సిక్సర్లతో చెలరేగాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ 239 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌కు భారీ షాక్ తగిలింది‌. 5 పరుగులకే టాప్‌ ఆర్డర్ పెవిలియన్‌కు చేరింది. కార్తీక్‌, పంత్‌, హార్దిక్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. దీంతో 92 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన జడేజా, ధోనీతో కలిసి మ్యాచ్‌ రూపురేఖలనే మార్చాడు. కివీస్‌ బౌలర్లపై విరుచుకుపడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. దీంతో టీమ్‌ ఇండియా ఫైనల్‌కు చేరుతుందని భావించారంతా. కానీ ఆఖర్లో జడేజా, ధోనీ ఔటవ్వడంతో ప్రపంచకప్‌లో టీమ్‌ ఇండియా పోరాటం ముగిసింది. 59 బంతుల్లో 77 పరుగులు బాదిన జడేజా ఇన్నింగ్స్‌ క్రికెట్ చరిత్రలో నిలిచిపోయింది.

తుది జట్టులో లేకపోయినా.. జట్టుకు బలమే

జడేజా సహజసిద్ధమైన అథ్లెట్‌. క్రీడాకారుడికి ఉండాల్సిన శరీరాకృతి అతడి సొంతం. ఫిటెనెస్‌లో అతడిని అందుకోవడానికి జట్టు సభ్యులు పోటీపడుతుంటారు. కోహ్లీ సైతం పరుగులో జడ్డూని అధిగమించడం అంత సులువు కాదని చెబుతుంటాడు. తుదిజట్టులో అతడు లేకపోయినా జడ్డూ టీమ్‌ఇండియా విజయంలో కీలకపాత్ర పోషిస్తాడు. సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగుతూ ప్రత్యర్థి పరుగులను అడ్డుకుంటాడు. బౌండరీ లైన్‌లో నిలబడి అతడు గురిచూసి విసిరితే వికెట్‌ ఎగిరి పడాల్సిందే. అతడు ఫీల్డింగ్‌ చేస్తున్న స్థానం వైపు షాట్‌ కొట్టి పరుగు ప్రయత్నించాలనుకుంటే ప్రత్యర్థులకు సవాలే. అబ్బురపరిచే విన్యాసాలతో అతడు ఎన్నో క్యాచ్‌లను ఒడిసిపట్టాడు. అంతలా ఫీల్డింగ్‌లో విజృంభిస్తాడు సర్‌ జడేజా. చిరుతులా దూకుతూ అద్భుత క్యాచ్‌లను అందుకుంటూ భారత ఫీల్డింగ్‌కు మరింత వన్నె తెచ్చాడు. 2019 ప్రపంచకప్‌లో అతడు ఆడింది రెండు మ్యాచులే, కానీ అద్భుత ఫీల్డింగ్‌తో ఏకంగా 41 పరుగులను నిలువరించాడు. రాజ్‌పుత్‌ అయిన ఈ ఫీల్డింగ్‌ రారాజు తన కత్తి సాముని మైదానంలోనూ ప్రదర్శిస్తాడు. కానీ ఖడ్గంతో కాదు.. బ్యాటుతో. అర్ధశతకాలు, శతకాలు సాధించినప్పుడు బ్యాటుని తిప్పుతూ అతడు చేసే బ్యాటుసాముని ఎవరైనా ఆస్వాదించాల్సిందే!!

- ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.