close

తాజావార్తలు

కసితో రగులుతున్న కరీబియన్లు

అనంత పద్మనాభుడి సన్నిధిలో సిరీస్‌ విజయంపై కోహ్లీసేన ధీమా

ఛేదన రారాజు’ కసితో బరిలోకి దిగితే రికార్డులన్నీ తుడిచి పెట్టుకోవడమే. ఆ కళాత్మక విధ్వంసాన్ని వీక్షించిన అభిమానులకు కనుల పండువే. బుల్లెట్‌ తరహా స్ట్రెయిట్‌ డ్రైవ్‌లు, ట్రేడ్‌మార్క్‌ కవర్‌డ్రైవ్‌లు, అందమైన ఫ్లిక్స్‌కు హైదరాబాద్‌ కేరింతలు పెట్టింది. ఇక కేఎల్‌ రాహుల్‌ సొగసైన స్ట్రోక్‌ప్లేకు మరింత మురిసింది. తన చరిత్రలోనే అత్యంత భారీ లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా కేవలం ఒకరోజు అంతరంతో విండీస్‌తో రెండో సమరానికి సిద్ధమైంది. అనంత పద్మనాభుడు కొలువైన తిరువనంతపురంలో సిరీస్‌ గెలవాలని ఉవ్విళ్లూరుతోంది.


బ్యాటింగ్‌ ఫైర్‌

వాహ్‌.. విరాట్‌ కోహ్లీ! క్రికెట్‌ దిగ్గజాల ప్రశంస ఇది. ఇటు టీమిండియా, అటు కరీబియన్‌ మాజీలు అతడి ఆటకు ఫిదా అయ్యారు. ఆదిలో తడబడ్డ కింగ్‌ కోహ్లీ (94*) ఆ తర్వాత సాగించిన విధ్వంసానికి మురవని అభిమాని లేడు. అతడు క్రీజులో కుదురుకొనేంత వరకు ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (62) స్ట్రోక్‌ ప్లే వీక్షకులకు కనువిందు చేసింది. ఫలితంగా విండీస్‌ నిర్దేశించిన 208 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా మరో 8 బంతులు మిగిలుండగానే ఛేదించింది. రెండో టీ20లో బ్యాటింగ్‌ పరంగా భారత్‌కు పెద్దగా ఇబ్బందేమీ ఉండదు! టాప్‌ ఆర్డర్‌లో నిత్యం ఒకరు రాణిస్తూనే ఉన్నారు. రోహిత్‌ ఈ సారి విజృంభించే అవకాశం ఉంది. రెండు కళ్లుచెదిరే సిక్సర్లతో అలరించిన పంత్‌ మరింత నిలకడ సాధించాల్సి ఉంది. శ్రేయస్‌ అయ్యర్‌ సమయోచితంగా ఆడగలడు. ఆల్‌రౌండర్ శివమ్‌దూబెకు ఇదో మంచి అవకాశం.


ఫీల్డింగ్‌ మెరుగవ్వాలి

హైదరాబాద్‌లో పిచ్‌ను ప్రత్యేకంగా బ్యాటింగ్‌కు అనుకూలంగా రూపొందించారు. అందుకే బౌలర్లకు సహకారం లేదు. ఫీల్డింగ్‌ పరంగానూ టీమిండియా పేలవం. నాలుగు క్యాచ్‌లు నేలపాలయ్యాయి. సుందర్‌, రోహిత్‌ క్యాచ్‌లు వదిలేశారు. ఫీల్డింగ్‌ ప్రమాణాలు బాగుంటేనే టీ20 ప్రపంచకప్‌లో విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయి. దక్షిణాఫ్రికా, బంగ్లా సిరీసుల్లో అదరగొట్టిన దీపక్‌ చాహర్‌ ఈ సారి తేలిపోయాడు. ఒక వికెట్‌ తీసి 54 పరుగులిచ్చాడు. అతడికి మరింత కచ్చితత్వం అవసరం. 3 నెలల విశ్రాంతి తర్వాత బౌలింగ్‌ చేసిన భువి వికెట్‌ తీయకుండా 36 పరుగులిచ్చాడు. అతడు త్వరగా లయ అందుకోవాలి. పవర్‌ప్లేలో బౌలింగ్‌ చేస్తున్న సుందర్‌ ఎక్కువ వికెట్లు తీయాలి. గత 6 టీ20ల్లో అతడు తీసింది రెండు వికెట్లే. చాహల్‌ ఎప్పటిలాగే ఆకట్టుకున్నాడు. కుల్‌దీప్‌ జట్టులోకి వస్తే సుందర్‌, జడ్డూలో ఎవరో ఒకరు చోటు వదులుకోవాల్సిందే. మ్యాచ్‌లో గెలుపోటములను బట్టి సంజు శాంసన్‌కు చోటు దక్కొచ్చు.


కసితో కరీబియన్లు

తమపై వరుసగా ఏడో విజయం సాధించిన టీమిండియాపై విండీస్‌ కసితో రగిలిపోతోంది. తిరువనంతపురంలో గెలిచేందుకు తహతహలాడుతోంది. బ్యాటింగ్‌ పరంగా కరీబియన్లకు తిరుగులేదు. లూయిస్‌, హెట్‌మైయిర్‌, పొలార్డ్‌, బ్రాండన్‌ కింగ్‌ విధ్వంసకర ఫామ్‌లో ఉన్నారు. కెప్టెన్‌ కీరన్‌ పొలార్డ్‌, జేసన్‌ హోల్డర్‌ అద్భుతంగా ఆడారు. విండీస్‌లో ఎక్కువ మందికి ఉపఖండంలో మంచి అనుభవం ఉంది. భారత బౌలింగ్‌ దళం వీరిపై ప్రత్యేక దృష్టి సారించాలి. ప్రత్యర్థి బౌలింగ్‌ దాడిమాత్రం బలహీనంగా ఉంది. కోహ్లీ ఎదురుదాడికి దిగిన తర్వాత ఏం చేయాలో వారికి పాలుపోలేదు. ఏకంగా 23 అదనపు పరుగులు ఇచ్చారు. పేసర్‌ కెస్రిక్‌ విలియమ్స్‌ (3.4 ఓవర్లలో 60 పరుగులు)కు చోటు కష్టమే. అనుభవజ్ఞులైన జేసన్ హోల్డర్‌ (46/0), షెల్డన్‌ కాట్రెల్‌ (1/24) నుంచి పొలార్డ్‌ మరింత ఆశిస్తున్నాడు.


అప్పుడేం జరిగింది?

గ్రీన్‌ఫీల్డ్‌ మైదానంలో ఒక వన్డే, ఒక టీ20 జరిగాయి. వన్డేలో మొదట బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ను టీమిండియా 31.5 ఓవర్లకే 104 పరుగులకే కుప్పకూల్చింది. జడేజా (4/31), బుమ్రా (2), ఖలీల్‌ అహ్మద్‌ (2) దుమ్మురేపారు. రోహిత్‌ శర్మ (63*), విరాట్‌ (33*) ఆడటంతో కేవలం 14.5 ఓవర్లలోనే లక్ష్యఛేదన పూర్తైంది. న్యూజిలాండ్‌తో జరిగిన టీ20కి వర్షం పడటంతో కేవలం 8 ఓవర్ల మ్యాచ్‌ సాగింది. తొలుత కోహ్లీసేన 67/5తో నిలవగా కివీస్‌ 61/6 వద్ద ఆగిపోయింది. బుమ్రా, చాహల్‌ ఆ జట్టును వణికించారు. ఇక్కడి పిచ్‌ స్పిన్నర్లు, పేసర్లకు అనుకూలిస్తుంది. ఎప్పుడూ ఇక్కడ పూర్తి స్థాయిలో మ్యాచ్‌ జరగకపోవడం గమనార్హం.

- ఇంటర్నెట్‌డెస్క్‌, హైదరాబాద్‌


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.