close
3 రోజులపాటు నిరంతర పర్యవేక్షణ 

ఆర్వోల నుంచి ఎప్పటికప్పుడు నివేదిక 
నేటి నుంచే రంగంలోకి వార్‌ రూం 
పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి 

ఈనాడు, హైదరాబాద్‌, ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది.. ఇక తదుపరి కీలక ప్రక్రియ పోలింగ్‌. ఈ సమయంలో ఎక్కడా ఏ చిన్న పొరపాటు జరగకుండా పోలింగ్‌కు ఒక్కరోజు ముందు నుంచి పోలింగ్‌ ముగిసిన మరుసటి రోజు వరకు అనుక్షణం ఎన్నికల సంఘం పర్యవేక్షించనుంది. ఇందుకోసం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ డే మానిటరింగ్‌సెల్‌ (వార్‌ రూం) రంగంలోకి దిగనుంది. అదనపు ముఖ్య ఎన్నికల అధికారి రవికిరణ్‌ ఆధ్వర్యంలో 17 మంది నిపుణుల బృందం ఇందుకోసం పనిచేస్తోంది. ఒక్కొక్కరు రెండు జిల్లాల బాధ్యత చూసుకోనున్నారు. రిటర్నింగ్‌ అధికారులు (ఆర్వో), జిల్లా అధికారులు, సీఈవో ఇలా మూడు స్థాయీల్లో సమన్వయం చేసుకుంటూ పోలింగ్‌ ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆర్వోలు పర్యవేక్షణ అధికారులకు చట్టబద్ధమైన, డ్యాష్‌బోర్డు, ఈవీఎం అనే మూడు అంశాలపై నివేదికలను సమర్పించాల్సి ఉంటుంది. గురువారం సాయంత్రం నుంచి 8వ తేదీ సాయంత్రం వరకు వివిధ అంశాలపై ఆర్వోల నుంచి డ్యాష్‌బోర్డు, ఈవీఎం నివేదికలు సేకరిస్తామని, వాటిని సీఈవో కార్యాలయం బయట ఏర్పాటు చేసే టీవీల్లో ప్రసారం చేస్తామని ఉప ముఖ్య ఎన్నికల అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు ఎన్నికల సందర్భంగా అక్రమాలు, ప్రలోభాలపై చర్యలు తీసుకునేందుకు వీలుగా రాష్ట్ర ఎన్నికల సంఘం 446 ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌లను ఏర్పాటు చేసింది. 448 స్ట్రాటిక్‌ సర్వేలెన్స్‌ బృందాలు, 126 సహాయ వ్యయపరిశీలకులు, 224 వీడియో నిఘాబృందాలు, 133 వీడియో పరిశీలక బృందాలు, 123 అకౌంట్‌ టీంలు ఏర్పాటుచేశారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై ఇప్పటివరకు 275 కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైందని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ తెలిపారు. 96,561 మందిని బైండోవర్‌ చేసి, 2,204 ప్రాంతాల్లో నాకాబందీ పెట్టామన్నారు.

అప్రమత్తంగా ఉండాలి: డీజీపీ 
ఎన్నికలకు ఆటంకం కలిగించేందుకు ప్రయత్నించే సంఘ విద్రోహశక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని డీజీపీ మహేందర్‌రెడ్డి పోలీసు సిబ్బందిని హెచ్చరించారు. ఈ శక్తులు కళ్యాణమండపాలు, అతిథి గృహాలు, లాడ్జిలలో ఉండే అవకాశం ఉందని, పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచి వాటన్నింటిలో తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ఎన్నికలు సజావుగా పూర్తయ్యేందుకు 414 ఫ్ల్లైయింగ్‌ స్క్వాడ్‌లను, 404 స్ట్రాటిక్‌ స్పెషల్‌ టీం, 3385 మొబైల్‌ పార్టీలను ఏర్పాటు చేసినట్లు  శాంతి భద్రతల అదనపు డీజీ, నోడల్‌ అధికారి జితేందర్‌ వెల్లడించారు.

 

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.