close

అసలు సిసలైన తెలంగాణ కవి ‘అలిశెట్టి’

మల్లారెడ్డికి పురస్కార ప్రదానంలో వక్తలు

కరీంనగర్‌ సాంస్కృతికం, న్యూస్‌టుడే: సమాజంతో సంబంధ బాంధవ్యాలు పెంచుకొని ఎన్నో రచనలు చేసిన అలిశెట్టి ప్రభాకర్‌ అసలు సిసలైన తెలంగాణ కవి అని తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ జయధీర్‌ తిరుమల్‌రావు అభివర్ణించారు. శనివారం కరీంనగర్‌లో తెరవే ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లాకు చెందిన కవి, రచయిత కొండి మల్లారెడ్డికి అలిశెట్టి ప్రభాకర్‌ రాష్ట్ర స్థాయి పురస్కారాన్ని శాశ్వత పురస్కార ప్రదాత ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు అందించారు. ఈ సందర్భంగా తిరుమల్‌రావు మాట్లాడుతూ.. అలిశెట్టి సామాన్యుల కోసం కవిత్వాన్ని రాసి వారికే అంకితం చేశారన్నారు. సమాజ రుగ్మతలను కవిత్వంగా మలిచి ప్రజలకే అందించే వారు కవులని, ఆ కవితా దృష్టి కొందరికే సాధ్యమన్నారు. తెలంగాణ కవుల్లో అలిశెట్టి.. దాశరథి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారన్నారు. చిన్న చిన్న కవితలతో అలిశెట్టి రాసిన ‘చురకలు’ కవితలతో సమాజానికే చురకలు అంటించారని చెప్పారు. రెండు చరణాలతో కవితలు రాసిన కవి అలిశెట్టి ఒక్కరే అని, ఆయన కవిత్వంలో రెండు చరణాలే కానీ భావం విస్తృతంగా ఉంటుందన్నారు. అలిశెట్టి భావజాలంతోనే దశాబ్దకాలంగా కవిత్వం రాస్తున్న ‘కొండి మల్లారెడ్డి’ అలిశెట్టి పురస్కారానికి నిజంగా అర్హులన్నారు. పురస్కార గ్రహీత కొండి మల్లారెడ్డి మాట్లాడుతూ.. ఈ పురస్కారం తనపై మరింత బాధ్యతను పెంచిందన్నారు. అన్నవరం ప్రభాకర్‌ కొండి మల్లారెడ్డి సాహిత్యాన్ని పరిచయం చేశారు. కార్యక్రమంలో తెరవే జిల్లా అధ్యక్షుడు కందుకూరి అంజయ్య, జూకంటి జగన్నాథం, ప్రసాదరావు, గాజోజు నాగభూషణం, సి.వి.కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

 

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.