close
ఔషధాల నిర్వహణపై పరిశీలన

తమిళనాడులో  వైద్య అధికారుల పర్యటన
నాంపల్లి ఘటన నేపథ్యంలో ముందస్తు చర్యలపై సమీక్ష

ఈనాడు, హైదరాబాద్‌: నాంపల్లి పట్టణ ఆరోగ్య కేంద్రంలో టీకాలిచ్చిన సందర్భంలో చోటుచేసుకున్న దుర్ఘటన పునరావృతం కాకుండా వైద్యారోగ్యశాఖ ముందస్తు చర్యలపై దృష్టిపెట్టింది. తమిళనాడులో ఔషధాల కొనుగోలులో తీసుకుంటున్న జాగ్రత్తలు, పాటిస్తున్న నిబంధనలు, నిర్వహణ తీరు తదితర అంశాలపై పరిశీలించేందుకు వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారుల బృందం ఇటీవల ఒకరోజు పర్యటనకు చెన్నైకి వెళ్లింది. అక్కడ పరిశీలించిన అంశాలపై గురువారం వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి సమక్షంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఔషధాల కొనుగోలు ఏ విధానంలో జరుగుతోంది? కిందిస్థాయి నుంచి వైద్యులు తమకు అవసరమైన ఔషధాలను కోరుకుంటున్నారా? ఆ విధానం అమల్లో ఉందా? క్షేత్రస్థాయితో సంబంధం లేకుండా ఉన్నతస్థాయిలోనే ఇష్టానుసారంగా ఔషధాలను కొంటున్నారా? తదితరాలపై లోతుగా సమీక్షించారు. టీకాలివ్వడంలో సిబ్బందికి సరైన శిక్షణ ఉందా? సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏమైనా దుష్ఫలితాలు ఎదురైతే తక్షణం ఎటువంటి ఔషధాలను అందించాల్సి ఉంటుంది? అవి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయా? తదితర కోణాల్లోనూ చర్చించారు. టీకాలను కేంద్ర ప్రభుత్వమే నేరుగా ఆసుపత్రులకు సరఫరా చేస్తుండడంతో ఉన్నతస్థాయిలో వాటిపై పర్యవేక్షణ కొరవడుతుందనే అభిప్రాయం వ్యక్తమైంది. టీకాలను అతిచల్లని ప్రదేశాల్లో భద్రపర్చేందుకు అవసరమైన ఏర్పాట్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉన్నాయా? ఒకవేళ లోపాలుంటే వాటిని చక్కదిద్దాలని నిర్ణయించారు. నాంపల్లి పట్టణ ఆరోగ్య కేంద్ర ఘటనలో ఇరువురు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం జాతీయస్థాయిలోనూ చర్చనీయాంశం కావడంతో వైద్యశాఖ అధికారులు ఔషధాల నిర్వహణపై దృష్టి కేంద్రీకరించారు. చిన్నారుల మరణాలకు కారణమైన ట్రమడాల్‌ ఔషధాన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోకి ఎలా అనుమతించారనే అంశంపైనే విచారణ చేపట్టారు. లక్షల కొద్ది ట్రమడాల్‌ మాత్రలు ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చింది? ఈ కొనుగోళ్లలో ఎవరి పాత్ర ఉందనే విషయాన్ని ఆరా తీస్తున్నారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.