close
కన్నులపండువగా శోభాయాత్ర

వివిధ రాష్ట్రాల నుంచి భారీగా తరలి వచ్చిన భక్తులు

ధూల్‌పేట,న్యూస్‌టుడే :  శ్రీరామ నవమి సందర్భంగా హైదరాబాద్‌లో శోభాయాత్రను కనుల పండువగా నిర్వహించారు. అప్పర్‌ ధూల్‌పేటలోని ఆకాశపురి హనుమాన్‌ ఆలయం నుంచి ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు శోభాయాత్ర ప్రారంభమైంది. భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఈ ఊరేగింపును ప్రారంభించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన ఈ యాత్ర రెండు గంటల ఆలస్యంగా మొదలైంది. తొలుత వేలాదిగా పాల్గొన్న భక్తులకు దారి పొడవునా లక్షల మంది జతకలిశారు. వివిధ రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు పాల్గొన్నారు. యాత్ర మంగళ్‌హాట్‌ ప్రధాన రోడ్డు నుంచి బేగంబజార్‌ ఛత్రికి చేరుకునే వరకు సాయంత్రం ఆరు గంటలు దాటింది.  శ్రీరామ నవమి శోభాయాత్రను 2010 నుంచి రాజాసింగ్‌ నేతృత్వంలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా భాగ్యనగర్‌ శ్రీరామ ఉత్సవ సమితి అధ్యక్షుడు డాక్టర్‌ భగవంతరావు ఆధ్వర్యంలో సీతారాంబాగ్‌ ఆలయం నుంచి మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన శ్రీరామ నవమి శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో కొనసాగింది. అప్పర్‌ ధూల్‌పేటలోని మగ్రా ప్రాంతం నుంచి తెరాస సీనియర్‌ నేత ఆనంద్‌సింగ్‌ లోథ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీరాముని పల్లకీ యాత్రలో వేల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ధూల్‌పేట నుంచి హనుమాన్‌ వ్యాయామశాల వరకు జరిగిన ఈ ఊరేగింపునకు రెండున్నర వేల మంది పోలీసు సిబ్బందితో ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు. హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిషోర్‌ ఈ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

రాజాసింగ్‌ మా గీతాన్ని కాపీ కొట్టారు: పాక్‌
ఇస్లామాబాద్‌: భారత్‌కు చెందిన ఓ శాసనసభ్యుడు తమ సంఘీభావ గీతాన్ని అనుకరించి విడుదల చేసి దానిని భారత సాయుధ దళాలకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించుకుంటున్నారంటూ పాక్‌ సైన్యం ఆరోపించింది. ‘‘ గీతాన్ని కాపీ కొట్టడంలో కాదు....నిజాన్ని మాట్లాడే విషయంలో పాకిస్థాన్‌ను భారత్‌ అనుకరించాలంటూ’ పాక్‌సైన్యం సూచించింది. ఈ మేరకు పాక్‌ సైనికప్రతినిధి  జనరల్‌ ఆసిఫ్‌ గఫూర్‌ ట్వీట్‌ చేశారు. తెలంగాణలోని గోషామహల్‌ నియోజకవర్గం శాసనసభ్యుడైన ఠాకూర్‌ రాజా సింగ్‌ లోథ్‌(భాజపా) చేసిన ఓ ట్వీట్‌ను పాక్‌సైన్యం ఈ సందర్భంగా ఉటంకించింది.

 

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.