close
ఆ కంపెనీలపై కఠిన చర్యలొద్దు 

నోటీసులు ఇచ్చాకే తదుపరి చర్యలు 
జీఎస్టీ అధికారులకు హైకోర్టు ఆదేశం 
దర్యాప్తునకు అడ్డంకి అంటూ జీఎస్టీ అధికారుల అభ్యంతరం

ఈనాడు, హైదరాబాద్‌: జీఎస్టీ ఎగవేతతోపాటు సుజనా గ్రూపునకు చెందిన కంపెనీలనే ఆరోపణలు ఎదుర్కొంటున్న భరణి కమోడిటీస్‌, విఎస్‌ ఫెర్రస్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, బీఆర్‌ఎస్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అండ్‌ ట్రేడింగ్‌ లిమిటెడ్‌లపై కఠిన చర్యలు తీసుకోరాదంటూ బుధవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జీఎస్టీ చట్టంలోని సెక్షన్‌ 73(1), సెక్షన్‌ 74(1) కింద నోటీసులు జారీ చేయాలని, కంపెనీలు ఇచ్చే సమాధానాలను పరిశీలించి పరిష్కరించాకే తదుపరి చర్యలు తీసుకోవాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జీఎస్టీ చట్టంలోని సెక్షన్‌ 69(1), సెక్షన్‌ 132లను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ భరణి కమ్మోడీటీస్‌, దాని యజమాని జె.సత్యశ్రీధర్‌రెడ్డి, వీఎస్‌ ఫెర్రస్‌ ఎంటర్‌ప్రైజెస్‌, దాని డైరెక్టర్‌ శేషగిరిరావు, బీఆర్‌ఎస్‌ ఎంటర్‌ప్రైజెస్‌, దాని డైరెక్టర్‌ కె.రాజిరెడ్డిలు బుధవారం అత్యవసరంగా పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌లు విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాది వాదనలు వినిపిస్తూ జీఎస్టీ ఎగవేతకు సంబంధించి ముందుగా మదింపు చేయకుండా సెక్షన్‌ 69(1) కింద జీఎస్టీ అధికారులు అరెస్ట్‌లకు పాల్పడుతున్నారని చెప్పారు. పన్ను ఎగవేతకు సంబంధించి ముందు మదింపు చేసి అవసరమైతేనే అరెస్ట్‌ చేయాల్సి ఉండగా దానికి విరుద్ధంగా అరెస్ట్‌లు చేస్తూ కంపెనీల్లో ఆందోళన రేకెత్తిస్తున్నారని చెప్పారు. వాదనలను విన్న ధర్మాసనం ఈ మూడు కంపెనీల వ్యవహారంలో ముందుగా నోటీసులు జారీ చేసి వారు ఇచ్చే వివరణను పరిశీలించి పరిష్కరించాకే చర్యలు తీసుకోవాలని, అంతవరకు చర్యలు తీసుకోరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ (రెవెన్యూ)శాఖకు, సెంట్రల్‌ ఎక్సైజ్‌ అండ్‌ సర్వీస్‌ టాక్స్‌ కమిషనర్‌, జీఎస్టీ సూపరింటెండెంట్‌లకు నోటీసులు జారీ చేస్తూ విచారణను ఈనెల 29వ తేదీకి వాయిదా వేసింది.

దర్యాప్తు కొనసాగించవచ్చు 
ఈ కంపెనీల వ్యవహారంలో దర్యాప్తును నిలిపివేయలేదని, దర్యాప్తును కొనసాగించవచ్చని ధర్మాసనం జీఎస్టీ అధికారులకు స్పష్టం చేసింది. మధ్యంతర ఉత్తర్వులతోపాటు నోటీసులు జారీ అయిన విషయాన్ని తెలుసుకున్న జీఎస్టీ శాఖ తరఫు న్యాయవాది నరసింహశర్మ ధర్మాసనం ముందు అభ్యంతరం వ్యక్తం చేయగా ఈ మేరకు స్పష్టం చేసింది. ఒకసారి జోక్యం చేసుకోవడానికి నిరాకరించగా మరోసారి మళ్లీ అభ్యర్థిస్తూ మధ్యంతర ఉత్తర్వులను పరిశీలించాలన్నారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇక్కడ ప్రస్తావించి ఉత్తర్వులు పొందారని, తమ వాదనలు వినాలని కోరారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ నోటీసులు జారీ చేశామని, పూర్తిస్థాయిలో తరువాత విచారణ చేపడతామంది.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.