close
అన్నీ నిబంధనల మేరకే..

మందుల కొనుగోళ్లలో అక్రమాలపై ఈఎస్‌ఐ డైరెక్టర్‌ వివరణ

ఈనాడు, హైదరాబాద్‌: ఔషధాల కొనుగోళ్లలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయని తెలంగాణ ప్రభుత్వానికి నిఘా వర్గాలు నివేదిక సమర్పించగా.. అలాంటదేమీ లేదని, నిబంధనల మేరకే ఔషధాలను కొన్నామని ఈఎస్‌ఐ డైరెక్టర్‌ దేవికారాణి ఒక ప్రకటనలో తెలిపారు. ‘ఈఎస్‌ఐలో గోలీమాల్‌’ శీర్షికన ‘ఈనాడు’లో మంగళవారం ప్రచురితమైన కథనంపై ఆమె వివరణ ఇచ్చారు. ‘ఔషధాల అవసర పత్రాలను ప్రతిసారి డైరెక్టర్‌ క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం లేదు. సంయుక్త సంచాలకులు పరిశీలించి పంపించిన వాటిని ఆమోదిస్తాం. అలాగే మందుల నిల్వను కొనసాగించకుండా.. మొత్తం అయిపోయాక ఆఖరి దశలో అవసర పత్రాన్ని డిస్పెన్సరీలు సమర్పించడం వల్ల.. టెండర్లలో ముందే ఒప్పందం కుదుర్చుకున్న ఔషధ సంస్థలు సమయానికి మందులను సరఫరా చేయలేకపోతున్నాయి. ఇలాంటి అత్యవసర కొనుగోలు పరిస్థితుల దృష్ట్యా 2016-17, 2017-18 సంవత్సరాలకు పరిశీలన కమిటీని నియమించకుండానే కొనాల్సి వచ్చింది’ అని తెలిపారు. అయితే ప్రభుత్వానికి నిఘా వర్గాలు ఇచ్చిన నివేదిక.. కొనుగోళ్లలో పలు అంశాలను తప్పుబట్టింది. ‘ఈఎస్‌ఐ డైరెక్టర్‌ ఎలాంటి పరిశీలన లేకుండా ఔషధాల అవసర పత్రాలను ఆమోదిస్తున్నారు. అసలు ఔషధాలున్నాయా? ఎప్పుడెప్పుడు ఎంత అవసరం అనే కనీస ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు. ఎలాంటి సమీక్షలు నిర్వహించలేదు’ అంటూ లోపభూయిష్ట విధానాలను నివేదికలో ఎత్తిచూపింది. మరోవైపు ఈఎస్‌ఐ ఆసుపత్రుల్లో ఔషధ కొనుగోళ్లలో అక్రమాలు వాస్తవమేనని ఈఎస్‌ఐ ఉద్యోగుల సంఘం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈఎస్‌ఐ ఉన్నతాధికారులు నేరుగా ముడుపులు తీసుకుంటూ అక్రమాలను ప్రోత్సహిస్తున్నారనీ, దీనిపై సమగ్ర విచారణ చేయించాలని డిమాండ్‌ చేసింది.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.