close
పగలు నిప్పులు..రాత్రి జల్లులు

 అత్యధికంగా 46.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
 సాయంత్రానికి 115 చోట్ల వర్షాలు
 పిడుగుపాటుకు ఇద్దరి మృతి
 రేకుల షెడ్డు కూలి మరొకరు..

ఈనాడు, హైదరాబాద్‌ , న్యూస్‌టుడే యంత్రాంగం: ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నడినెత్తిన భానుడు నిప్పులు కురిపిస్తుంటే...సాయంత్రానికి పలు ప్రాంతాల్లో అప్పటికప్పుడు కారుమబ్బులు కమ్ముకుని ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు పడుతున్నాయి. రాష్ట్రంలో మంగళవారం సాయంత్రానికి 115 చోట్ల వానలు కురిశాయి. హైదరాబాద్‌ నగరంలో పలుచోట్ల వర్షాలు పడటంతో చల్లదనంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. మధ్యాహ్నం ఎండల తీవ్రతకు ఇబ్బందులు పడుతున్నారు. అత్యధికంగా ఆదిలాబాద్‌ జిల్లా భోరజ్‌లో 46.3, బేలలో 46.2, సోనాల, తాంసీలో 46.1, ఆదిలాబాద్‌లో 45.7, తలమడుగు, అర్లిలో 45.4, నిజామాబాద్‌ జిల్లా మెండోరాలో 45.3, హైదరాబాద్‌లో 42 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత నమోదైంది. బుధవారం నుంచి మూడు రోజుల వరకు వడగాలులతో పాటు అక్కడక్కడ ఇదే రీతిలో ఒక మాదిరి వర్షాలు పడే సూచనలున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. కర్ణాటకపై 1,500 మీటర్ల ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దానివల్లే వర్షాలు కురుస్తున్నట్లు చెప్పారు. పొడిగాలులు వీస్తున్నందున ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మంగళవారం రాత్రి 8 గంటల వరకు ఆసిఫాబాద్‌లో 42.5, బొల్లారంలో 29.8, కాప్రాలో 26.8, మేడ్చల్‌లో 23, దూలపల్లి, కుత్బుల్లాపూర్‌లో 11.3, చందూరులో 8.8, కొత్తపేటలో 8.5 మిల్లీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.

* మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మండలం నారాయణపూర్‌ తండాలో మంగళవారం పిడుగుపాటుకు సునీత (32) అనే అయిదు నెలల గర్భిణి మృతి చెందింది. నాగర్‌కర్నూల్‌ జిల్లా బల్మూర్‌ మండల కేంద్రానికి చెందిన పుట్టా శ్రీను పిడుగుపాటుకు గురై మరణించాడు. జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్‌ మండలం మాల్‌దొడ్డిలో సోమవారం అర్ధరాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. గాలుల తీవ్రతకు నివాసముంటున్న రేకుల షెడ్డు కూలిపోయి మీద పడటంతో అనసూయమ్మ(38) అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది.


 

వేలాది కోళ్ల మృత్యువాత

పిడుగుపాటుకు కోళ్లఫాం కుప్పకూలగా వేలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండలం అబ్బెంద శివారులో సుభాష్‌రావు అనే రైతు తన వ్యవసాయ క్షేత్రంలో కోళ్లఫాంను నిర్మించాడు. మంగళవారం సాయంత్రం ఈదురు గాలులు మొదలై ఉరుములు, మెరుపులతో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో  ఫాం పక్కనే పిడుగు పడింది. అప్పటివరకు అందులోనే ఉన్న సుభాష్‌రావు, మరోవ్యక్తి శివురాయ్‌ భయంతో బయటకు పరుగులు తీశారు. అంతలోనే షెడ్డు కుప్పకూలింది. సుమారు 10 వేల కోళ్లు చనిపోయాయని..బాధితుడు కన్నీటి పర్యంతమయ్యాడు.

- నారాయణఖేడ్‌, న్యూస్‌టుడే

 

 

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.