close

ప్రధానాంశాలు

కొవ్వూరు ప్రాభవానికి గండి

నిష్ప్రయోజనంగా రూ.86.40 లక్షల స్థలం

ప్రధాన తపాలా కార్యాలయ తరలింపు యోచనపై విమర్శలు

కొవ్వూరు పట్టణం, న్యూస్‌టుడే

తపాలా కార్యాలయానికి చెందిన స్థలం

 

తపాలా శాఖలో నూతన సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. లావాదేవీలను సులభతరం చేసి బ్యాంకుల తరహాలో అంతర్జాల సేవలకు శ్రీకారం చుడుతున్నారు. దశాబ్దాలుగా సేవలందిస్తున్న ప్రధాన కార్యాలయ ప్రాభవాన్ని పెంచేందుకు కృషి చేయకుండా దానిని పూర్తిగా తరలించాలనే అధికారుల యోచన విమర్శలకు తావిస్తోంది.

పురాణ ప్రాశస్థ్యంతో పాటు రెవెన్యూ డివిజన్‌ కేంద్రమైన కొవ్వూరులో ప్రధాన తపాలా కార్యాలయ తరలింపు ప్రతిపాదన సర్వత్రా అసంతృప్తిని కలిగిస్తోంది. మూడు దశాబ్దాల కిందట భవన నిర్మాణానికి స్థలం కొనుగోలు చేసినా ఆ దిశగా అడుగు పడలేదు. అద్దె భవనమనే సాకుతో ప్రధాన కార్యాలయాన్ని నిడదవోలు తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టణంలో కోట్లాది రూపాయల విలువైన స్థలం చిట్టడవిగా మారగా ప్రధాన తపాలా సేవలు ఇంకెన్నాళ్లోనని పలువురు చర్చించుకుంటున్నారు. కార్యాలయ పరిధిలో 3 లక్షల మంది ఖాతాదారులు ఉన్నారు. ప్రతి నెలా సుమారు రూ.33 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. జిల్లా అదనపు న్యాయస్థానంతో పాటు ఆర్డీవో, డీఎస్పీ, మరో 40కి పైగా ప్రభుత్వ కార్యాలయాలున్నాయి. ఈ నేపథ్యంలోనే గతంలో ఇక్కడ ప్రధాన కార్యాలయం ఏర్పాటైంది.

* జిల్లాలో భీమవరం, ఏలూరు, తాడేపల్లిగూడెం తపాలా డివిజన్లు ఉన్నాయి. తాడేపల్లిగూడెం డివిజన్‌ పరిధిలో కొవ్వూరు ప్రధాన కార్యాలయం 1980 సంవత్సరంలో ఏర్పాటైంది. దీని పరిధిలో 18 ఉప తపాలా కార్యాలయాలున్నాయి.

* కొవ్వూరు, తాళ్లపూడి, వేగేశ్వరపురం, పోలవరం, దొండపూడి, గోపాలపురం, దేవరపల్లి, చాగల్లు, నిడదవోలు, తాడిమళ్ల, సమిశ్రగూడెం, కాకరపర్రు, కానూరులలో కార్యాలయాలు సేవలందిస్తున్నాయి. వీటి ఆధ్వర్యంలో సుమారు 100 శాఖలు పనిచేస్తున్నాయి. సేవింగ్స్‌, రికరింగ్‌, కాలపరిమితిలో ఖాతాలు, సుకన్య సమృద్ధి వంటి పథకాలను సుమారు 3 లక్షల మంది సద్వినియోగం చేసుకుంటున్నారు.

నడిబొడ్డున ఖరీదైన స్థలం

ప్రధాన తపాలా కేంద్రానికి సొంత భవనం నిర్మించాలన్న అధికారులు, ప్రజా విజ్ఞప్తుల మేరకు 1980 సంవత్సరంలో పట్టణ నడిబొడ్డున 6500 చదరపు అడుగుల (720 గజాలు) స్థలాన్ని తపాలా శాఖ కొనుగోలు చేసింది. దేవదాయశాఖ నుంచి స్థానిక పుంతలో ముసలమ్మ గుడి వెనుకభాగంలో ఉన్న ఈ స్థలంలో సొంత భవనం నిర్మిస్తారని ప్రజలంతా భావించారు. కానీ 30 ఏళ్లయినా దానికి మోక్షం లభించకపోగా ఆ ప్రదేశం చిట్టడవిగా మారింది.

* ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఈ స్థలం రూ.86.40 లక్షలు ఉండగా అనధికారికంగా సుమారు రూ.2.59 కోట్లకు పైగా ధర పలుకుతుందని సమాచారం.

కొవ్వూరు ప్రధాన తపాలా కార్యాలయం

ఆ యోచనతోనే తొలగిస్తున్నారా!

ప్రధాన తపాలా కేంద్రాన్ని తరలించాలన్న యోచనలో భాగంగా కొవ్వూరు పట్టణంలోని పాత ఊరు ఉప కార్యాలయాన్ని మూసివేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పట్టణ పరిధిలో 7 వార్డుల ప్రజలకు సేవలందిస్తున్న ఆ కార్యాలయాన్ని తొలగించడంపై స్థానికులు ఇప్పటికే అసంతృప్తితో ఉన్నారు. తాడేపల్లిగూడెంలో ఒకటి, నిడదవోలులో మరొక కేంద్రాన్ని ఈ మధ్య కాలంలో తొలగించారని తెలుస్తోంది. స్థలాన్ని సద్వినియోగం చేసుకోకుండా ప్రధాన సేవలను ఇక్కడి నుంచి మార్చాలని చూడటం తగదని పలువురు పేర్కొంటున్నారు.

వినతులు.. ఆపై ఉద్యమం..

తపాలా కేంద్రం కొనుగోలు చేసిన స్థలంలో నూతన భవనాన్ని నిర్మించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ కేంద్ర ఐటీ, సమాచార మంత్రిత్వశాఖకు గతంలో లేఖ రాశారు. పలుసార్లు ఈ అంశంపై ప్రస్తావించినా ఆ పనులు పట్టాలెక్కలేదు. బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో చీఫ్‌ పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ (సీపీఎంజీ) కార్యాలయానికి వినతిని పంపించారు. పురపాలక మాజీ ఛైర్మన్‌, భాజపా నాయకుడు బి.వి.ముత్యాలరావు కొవ్వూరులో కార్యాలయ ఆవశ్యకతను తెలియజేస్తూ వినతిపత్రం పంపించారు. సుదీర్ఘ సేవలందిస్తున్న ప్రధాన తపాలా కేంద్రాన్ని ఇక్కడి నుంచి తరలించాలనే నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. భవిష్యత్తులో ఉద్యమాలు చేసేందుకు సైతం ప్రజలు సిద్ధమవుతున్నారు.

ప్రయోజనాలిలా..

నిరుపయోగంగా ఉన్న ఖరీదైన స్థలంలో భవనాన్ని నిర్మించి డివిజన్‌లోనే ఆధునిక కార్యాలయంగా మార్చాలని తపాలా ఉన్నతాధికారులకు వినతులు పంపిస్తున్నారు.

* కొవ్వూరులో 12 జాతీయ బ్యాంకులు ఉన్నాయి. రాష్ట్రంలోనే పేరున్న అవంతి, ఆంధ్రాషుగర్స్‌ కర్మాగారాలు ఇక్కడున్నాయి. ఆర్టీసీ డిపో, రైల్వేస్టేషన్‌, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ నడుస్తున్నాయి.

* కొవ్వూరుకు 8 కిలోమీటర్ల దూరంలో రాజమహేంద్రవరం ఉండటంతో మెయిల్స్‌, స్పీడ్‌పోస్టు వ్యవస్థకు సులభతరంగా ఉంటుంది.

* ప్రధాన కార్యాలయం నుంచి ఉప కార్యాలయాలకు ఒక్క రోజులోనే నగదు బట్వాడా జరుగుతోంది.

* పోలవరం నుంచి కొవ్వూరు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. నిడదవోలుకు మారిస్తే ఆ దూరాభారంతో నగదు బట్వాడా, ఇతర సౌకర్యాలకు ఆలస్యమవుతుంది.

* దొండపూడి, గోపాలపురం, తాళ్లపూడి, వేగేశ్వరపురానికి కొవ్వూరు చేరువలో ఉంది.

* కొవ్వూరులో సొంత భవనం ఏర్పాటైతే తపాలా ఏటీఎం కేంద్రం సైతం అందుబాటులోకి వస్తుంది.

ఉన్నతాధికారులకు నివేదించాం

కొవ్వూరులో ప్రధాన తపాలా కార్యాలయం అద్దె భవనంలో నడుస్తోంది. వర్షాకాలంలో కారుతూ విధులకు అంతరాయం వాటిల్లుతోంది. వేరే భవనంలోకి మార్చాలంటే అద్దె భారం అవుతుంది. ఈ నేపథ్యంలో నిడదవోలులో ఉన్న సొంత భవనంలోకి కార్యాలయాన్ని మార్చాలని ఉన్నతాధికారులు ప్రతిపాదన చేశారు. తపాలా కార్యాలయ భవనం కోసం సేకరించిన స్థలం అంశాన్ని ఉన్నతాధికారులకు నివేదించాం.

- పి.వెంకటస్వామి, పోస్టల్‌ సూపరింటెండెంట్‌, తాడేపల్లిగూడెం డివిజన్‌

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.