
ఎన్ఓసీ కమిటీపై చర్యల నివేదికివ్వండి
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు ఆదేశం
ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్ గుడిమల్కాపూర్‌లో సర్వే నెం.284/6 భూమికి నకిలీ పత్రాల ఆధారంగా నిరభ్యంతర పత్రం(ఎన్ఓసీ) జారీ చేసిన కమిటీపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంలో ఎందుకు జాప్యం జరుగుతోందని ప్రభుత్వాన్ని సోమవారం హైకోర్టు ప్రశ్నించింది. తహసీల్దార్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదని, అప్పటి ఎన్ఓసీ కమిటీ ఛైర్మన్ నవీన్ మిట్టల్‌పై విచారణలో జాప్యం ఎందుకు జరుగుతుందో చెప్పాలంది. దీనిపై పూర్తి వివరాలతో ఆగస్టు 5 నాటికి నివేదిక సమర్పించాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. గుడిమల్కాపూర్‌లో కొనుగోలు చేసిన 5262 చదరపు గజాల స్థలానికి ఎన్ఓసీ జారీ చేయడాన్ని సవాలు చేస్తూ శాంతి అగర్వాల్ అనే మహిళ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన సింగిల్ జడ్జి.. ఎన్ఓసీ జారీ సక్రమంగా జరగలేదని, అప్పుడు కమిటీ ఛైర్మన్‌గా ఉన్న నవీన్ మిట్టల్, సభ్యులైన అప్పటి జాయింట్ కలెక్టర్ వి.దుర్గాదాస్, మాజీ ప్రత్యేక తహసీల్దార్ వి.వి.వెంకటరెడ్డి, సీనియర్ డ్రాఫ్ట్స్‌మెన్ పి.మధుసూదన్‌రెడ్డిలపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా నకిలీ పత్రాలతో ఎన్ఓసీ పొందిన సయ్యద్ అబ్దుల్ రబ్, మహ్మద్ రుక్ముద్దీన్, మహమ్మద్ అబ్దుల్ వదూద్లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన అప్పీలుపై సోమవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్, జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. ఇప్పటికే సింగిల్ జడ్జి ధర్మాసనం చెప్పినా చర్యల్లో ఎందుకు జాప్యం జరుగుతోందని ప్రశ్నించింది. జాప్యంపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.