close

ప్రధానాంశాలు

అప్పట్లో ఐదుగురు ఉండేవాళ్లు..

అరివీర భయంకర విండీస్‌ను అడ్డుకొనేందుకు...

వెస్టిండీస్‌... ఓ మర్చిపోయిన జగజ్జేత! ఆ దేశం పర్యటనకు వస్తోందటేనే చాలు ప్రత్యర్థి ముందుగానే ఓటమి అంగీకరించేది. ఆ అరివీర భయంకర జట్టంటే అంత భయం. రోజుల తరబడి బ్యాటింగ్‌ చేసే బ్యాట్స్‌మెన్‌ విండీస్‌ సొంతం. ఆరున్నర అడుగుల పేసర్లు విసిరేది బంతులు కాదు బుల్లెట్లా అన్నట్టు ఉండేది పరిస్థితి. పరుగులు చేయడం సంగతేమో గానీ వికెట్‌ నిలిస్తే చాలు అనుకునేవారు ప్రత్యర్థులు.
ఆండీ రాబర్ట్స్‌, మైకేల్‌ హోల్డింగ్‌, జోయెల్‌ గార్నర్‌, మాల్కమ్‌ మార్షల్‌, కోర్ట్నీ వాల్ష్‌, కోర్ట్‌లీ ఆంబ్రోస్‌ రన్నప్‌ చేస్తుంటేనే ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ వెన్నులో వణుకు పుట్టేది. వారు విసిరిన బంతులు తగిలి విలవిల్లాడిన ఆటగాళ్లకు ఇప్పటికీ భయం పోలేదంటే అతిశయోక్తికాదు! వివ్‌ రిచర్డ్స్‌, గార్డన్‌ గ్రీనిడ్జ్‌, గ్యారీఫీల్డ్‌ సోబర్స్‌, జార్జ్‌ హెడ్లీ, ఎవర్టన్‌ వీక్స్‌, క్లైవ్‌ లాయిడ్‌ దిగ్గజాల సంగతి సరేసరి. 1970-1990 నాటి భీకర వెస్టిండీస్‌పై కొందరు భారత ఆటగాళ్లు ఆణిముత్యాల్లాంటి ఇన్నింగ్స్‌లు ఆడారు. దెబ్బలు తగిలితే మొక్కవోని పట్టుదల చూపించారు. ప్రస్తుతం కోహ్లీసేన కరీబియన్‌ దీవుల్లో పర్యటిస్తున్న సందర్భంగా అలనాటి సంగతులు మీకోసం...

విండీస్‌పై ‘సన్నీ’ డేస్‌

వెస్టిండీస్‌పై మెరుగైన రికార్డున్న ఆటగాళ్లలో లిటిల్‌ మాస్టర్‌ సునిల్‌ గావస్కర్‌ ముందు వరుసలో ఉంటారు. ఎత్తు తక్కువే ఐనా అలనాటి విండీస్‌ బౌలింగ్‌ను ఊచకోత కోసేవాడు. 17 ఏళ్ల తన కెరీర్‌లో కరీబియన్లపైనే ఎక్కువ ఆడాడు. 1971లో వారిపైనే అరంగేట్రం చేసిన సన్నీ తొలి టెస్టులో రెండు 50+ స్కోర్లు చేశాడు. ఆ తర్వాత రెండు టెస్టుల్లో వరుసగా శతకాలు బాది సంచలనం సృష్టించాడు. ఇక చివరి టెస్టులో ఏకంగా 124, 220తో అభిమానుల్ని మంత్రముగ్ధుల్ని చేశాడు. అరంగేట్రం సిరీస్‌లోనే 774 స్కోరుతో ఎవరూ బద్దలు కొట్టలేని ఘనత అందుకున్నాడు. ఇక 1975-76 సిరీస్‌లో మైకెల్‌ హోల్డింగ్‌, ఆండీ రాబర్ట్స్‌ను ఎదుర్కొని రెండు సెంచరీలతో 390 స్కోరు సాధించాడు. తన అత్యధిక టెస్టు స్కోరు 236*ను సన్నీ విండీస్‌ పైనే అందుకోవడం గమనార్హం. కరీబియన్‌ జట్టుపై 27 టెస్టులాడి 65.45 సగటుతో ఏకంగా 2,749 పరుగులు చేశాడు. 13 శతకాలు ఉండటం విశేషం.

ఆల్‌టైం గ్రేట్‌ ‘గుండప్ప’ 97*

కరీబియన్‌ బౌలర్లను అడ్డుకోవడంలో మిడిలార్డర్‌ ఆటగాడు గుండప్ప విశ్వనాథ్‌ది అందెవేసిన చేయి. ఆయన ఆటను మాటల్లో వర్ణించలేం. అప్పట్లో గావస్కర్‌, గుండప్పలో ఎవరు అత్యుత్తమం? అన్న చర్చ దేశాన్ని ఊపేసింది. ఒక బంతికి ఒకటి కన్నా ఎక్కువ షాట్లు ఆడగలిగిన నేర్పరి గుండప్ప అని సన్నీ అంగీకరించి చర్చకు తెరదించాడు. విండీస్‌పై ఆయన 18 టెస్టుల్లో 1,455 స్కోరు చేశాడు. సగటు 53.88. శతకాలు 4. తన 14 ఏళ్ల కెరీర్‌లో ఎక్కువగా నాలుగో స్థానంలోనే ఆడాడు. అప్పట్లో క్వీన్స్‌పార్క్‌లో గుండప్ప సెంచరీతోనే భారత్‌ 400 పైగా లక్ష్యాన్ని ఛేదించింది. కాళీచరణ్‌ సేనతో జరిగిన పోరులో కెర్రీ ప్యాకర్‌ నిప్పులు కురిపించాడు. అస్థిర బౌన్స్‌ ఇబ్బంది పెట్టింది. నోబర్ట్‌ ఫిలిఫ్‌, సిల్వెస్టర్‌ క్లార్క్‌ వేసిన బంతులకు దెబ్బలు తగిలాయి. దానికి తోడు అస్థిర బౌన్స్‌. ఐనా గుండప్ప 123 చేశాడు. 

గుండప్ప 1975లో విండీస్‌పై ఆడిన ఇన్నింగ్స్‌ను ఆల్‌టైం గ్రేట్‌గా భావిస్తారు. అప్పటికే క్లైవ్‌లాయిడ్‌ సేన రెండు టెస్టులు గెలిచింది. మూడో మ్యాచ్‌లో గుండప్ప సెంచరీ కొట్టాడు. ఆ తర్వాత మద్రాస్‌లో నాలుగో టెస్టు జరిగింది. ఆండీ రాబర్ట్స్‌, హోల్డర్‌, కీత్‌ బాయ్‌సీ నిప్పులు కురిపించారు. చురకత్తుల్లాంటి బంతులు సంధించారు. టెస్టుల్లో 300 వికెట్లు తీసిన తొలి స్పిన్నర్‌ లాన్స్‌ గిబ్స్‌ వారికి తోడయ్యాడు. అంతే..! టీమిండియా వరుసగా వికెట్లు చేజార్చుకుంటోంది. కానీ గుండప్ప మాత్రం లొంగలేదు. బేడీతో కలిసి 8వ వికెట్‌ 117, సర్దార్‌తో 9వ వికెట్‌కు 52, చివరి వికెట్‌కు చంద్రశేఖర్‌తో 21 భాగస్వామ్యాలు నెలకొల్పాడు. చూడచక్కని ఆఫ్‌డ్రైవల్‌లు, స్క్వేర్‌ కట్‌లతో 97తో గుండప్ప అజేయంగా నిలిచాడు. ఆ తర్వాత అలాంటి ఇన్నింగ్స్‌ను వీవీఎస్‌ లక్ష్మణ్‌ (281) ఆసీస్‌పై ఆడాడని విశ్లేషకులు అంటున్నారు.

రక్తం చిందించిన ‘జిమ్మీ’

అరివీర భయంకరులైన విండీస్‌ బౌలర్ల బంతి తగిలితే ఎలాగుంటుందో మొహిందర్‌ అమర్‌నాథ్‌ను అడిగితే చెబుతారు. ఐతే తెగువ మాత్రం ఎవరికీ ఉండదు! బంతి తగిలి దవడకు ఆరు కుట్లు పడ్డా ఆయన మైదానంలోకి వెళ్లి వారిని ఎదుర్కొనేందుకు భయపడలేదు. 1983 సంగతిది. అప్పటికే 18 పరుగులు చేసిన అమర్‌నాథ్‌ దవడకు ఆండీ రాబర్ట్స్‌ విసిరిన బంతి తగిలి రక్తం చిందింది. తెల్లటి అతడి జెర్సీ ఎరుపెక్కింది. రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఆస్పత్రికి వెళ్లి ఆరు కుట్లు వేయించుకొని మళ్లీ.. రాబర్ట్స్‌, మార్షల్‌, హోల్డింగ్‌, గార్నర్‌ను ఎదుర్కొనేందుకు వెళ్లారు. దాదాపు మూడున్నర గంటలు క్రీజులో నిలిచారు. 30 పరుగులు చేశారు. ఆ ఇన్నింగ్స్‌లో ఆయనదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం.

అమర్‌నాథ్‌ కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూశారు. పునరాగమనం చేసిన ప్రతిసారీ సత్తాచాటారు. మొత్తం 69 టెస్టుల్లో 4,378 పరుగులు సాధించారు. దాదాపు 25% పరుగులు విండీస్‌పై చేసినవే. ఆ జట్టుపై 17 టెస్టుల్లో 38.42 సగటుతో 1,076 స్కోరు సాధించారు. మూడు శతకాలు బాదారు. ఇక 23 వన్డేల్లో 694 చేశారు. పేలవ ప్రదర్శనతో మూడేళ్లు జట్టుకు దరూరమైన అమర్‌నాథ్‌ 1982-83లో పునరాగమనం చేసి 1,182 రన్స్‌ కొట్టాడు. విండీస్‌, పాక్‌పైనే 11 టెస్టులు ఆడారు. విదేశాల్లో 5 శతకాలు బాదేశారు. 1983 ప్రపంచకప్‌ తర్వాత అదే విండీస్‌పై 6 ఇన్నింగ్స్‌లో కేవలం 1 పరుగుకు పరిమితమై జట్టులో చోటు కోల్పోయారు. మళ్లీ కరీబియన్లపై పునరాగమనం చేసి అదరగొట్టారు.

కుర్ర ‘డెవిల్‌’ కపిల్‌ 

విండీస్‌తో కపిల్‌దేవ్‌ది ప్రత్యేక శత్రుత్వం. సాధారణ ఆటగాడిగా, సారథిగా దానిపై భీకరంగా పోరాడారు. కరీబియన్‌ జట్టుపై 25 టెస్టుల్లో 1,079 పరుగులు చేశారు. సగటు 30.82. సెంచరీలు 3. తీసిన వికెట్లు 89. వన్డేల్లోనూ అతడిది మంచి ఘనతే. 24.05 సగటుతో 42 మ్యాచుల్లో 8,43 చేశాడు. 43 వికెట్లు తీశారు. నాయకత్వానికి ముందే 19 ఏళ్ల వయసులో హరియాణా హరికేన్‌ విండీస్‌పై చెలరేగారు. 1978/79 టెస్టు సిరీస్‌లో 7 ఇన్నింగ్సుల్లో 329 పరుగులు చేశారు. 17 వికెట్లు తీశారు. ఐదో టెస్టులో అజేయ శతకం (126*) ప్రత్యేకం. ఆ తర్వాత నాలుగేళ్లకు జట్టు పగ్గాలు అందుకున్నారు. 1983 పర్యటనలో 8 ఇన్నింగ్స్‌లో 254 సాధించారు. రెండు సార్లు అజేయంగా నిలిచారు. పోర్ట్‌ ఆఫ్ స్పెయిన్‌లో (100* ; 95 బంతుల్లో 13×4, 3×6)తో చెలరేగారు. సిరీస్‌లో 17 వికెట్లు పడగొట్టారు.

అనూహ్యంగా విండీస్‌ బౌలర్లు ఫామ్‌లోకి రావడంతో తర్వాతి టెస్టులో 5, 12కు పరిమితం అయ్యాడు. 1983 ప్రపంచకప్‌ తర్వాత లాయిడ్‌ సేన కపిల్‌ డెవిల్స్‌కు చుక్కలు చూపించింది. ప్రతీకారం ఇలా తీర్చుకోవాలని ప్రపంచానికి చాటింది. గ్రీనిడ్జ్‌, మార్షల్‌ పరుగుల వరద పారించారు. మార్షల్‌ హోల్డింగ్‌ బంతుల్ని ఎదుర్కోవడం భారత్‌ వల్ల కాలేదు. సిరీస్‌ సాంతం లాయిడ్‌ కళ్లల్లో అగ్ని జ్వలించింది. ఈ సిరీస్‌లో కపిల్‌ 11 ఇన్నింగ్స్‌లో 184 మాత్రమే చేశారు. ఐతే బంతితో రాణించి 29 వికెట్లు పడగొట్టారు. 1987/88 సిరీస్‌ 1-1తో డ్రా అయింది. తొలి మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో కపిల్‌ శతకం (109) చేశారు. 1988/89లో విండీస్‌తో చివరి టెస్టు సిరీస్‌ ఆడారు. సిరీస్‌లో 18 వికెట్లు సాధించారు. మొత్తానికి కరీబియన్లకు కఠిన సవాల్‌ విసిరిన సారథిగా కపిల్‌ నిలిచిపోతారు.

‘వెంగీ’ సొగసరి స్ట్రోక్‌

భారత జట్టుకు దొరికిన అరుదైన స్ట్రోక్‌ ప్లేయర్లలో వెంగ్‌సర్కార్‌ ఒకరు. ఆసక్తీ కొద్దీ క్రికెట్‌లో అరంగేట్రం చేశారు. తనదైన ట్రేడ్‌మార్క్‌ షాట్లతో రాణించారు. ఆటకు వీడ్కోలు పలికినప్పుడు గావస్కర్‌ తర్వాత టీమిండియాలో అత్యధిక పరుగులు, శతకాలు చేసింది ఆయనే కావడం గమనార్హం విండీస్‌పై వెంగీకి మెరుగైన రికార్డు ఉంది. మార్షల్‌, హోల్డింగ్‌ చురకత్తుల్లాంటి బంతుల్ని ఆయన అలవోకగా ఎదుర్కొన్నారు. ఇక ఆంబ్రోస్‌ బౌలింగ్‌లో వెంగీ చూపిన తెగువ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన విండీస్‌పై 25 టెస్టులో 44.33 సగటుతో 1,596 పరుగులు సాధించారు. శతకాల సంఖ్య 6. ఇక 21 వన్డేల్లో 27.38 సగటుతో 493 మాత్రమే చేశారు. సారథిగానూ వెంగీ అదరగొట్టారు. కరీబియన్‌ జట్టుపై 2 శతకాలతో 7 టెస్టుల్లో 4,15 పరుగులు చేశారు. ఎక్కువగా మూడో స్థానంలో ఆడి తిరుగులేని విజయాలు అందించారు. అవసరమైనప్పుడు సన్నీతో కలిసి ఓపెనింగ్‌ సైతం చేశారు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

 

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.