close
విద్యా కుసుమాలకు కేటీఆర్‌ అండ

ఇద్దరు పేద విద్యార్థినుల ఉన్నత చదువులకు ఆర్థికసాయం
ఇంటికి పిలిపించుకొని అందజేత

ఈనాడు, హైదరాబాద్‌: ప్రతిభావంతులైన ఇద్దరు విద్యార్థినులు ఆర్థిక సమస్యలతో ఉన్నత చదువులు అభ్యసించలేని పరిస్థితి ఏర్పడగా... తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ వారికి అండగా నిలిచారు. వారి దీన స్థితిని తెలుసుకుని ఆర్థిక సాయం అందించారు. జగిత్యాల జిల్లా కథలాపూర్‌ మండలం తాండ్రియాలకు చెందిన రుద్ర రచనకి చిన్నపుడే తల్లిదండ్రులు చనిపోయారు. పదోతరగతి వరకు బాలసదనంలో ఉంటూ, జగిత్యాల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసాన్ని పూర్తి చేసింది. తర్వాత హైదరాబాద్‌ యూసుఫ్‌గూడలోని స్టేట్‌హోంలో ఉంటూ పాలిటెక్నిక్‌ డిప్లొమా పూర్తి చేసి, ప్రస్తుతం చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో(సీబీఐటీ) కంప్యూటర్‌ సైన్స్‌ సీటు సాధించింది. రుసుం చెల్లించలేని దుస్థితిలో ఆమె చదువు ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఆమె దీనగాథను తెలుసుకుని కేటీఆర్‌ ఆమెకు అండగా నిలవాలని నిర్ణయించారు. గురువారం రచనను బేగంపేటలోని తన నివాసానికి పిలిపించుకుని విద్యాభ్యాసానికి అవసరమైన రుసుముల్ని చెల్లిస్తానని, అవసరమైన ఇతర ఖర్చులను భరిస్తానని హామీ ఇచ్చారు. ఉన్నత చదువులపైనే దృష్టిసారించాలని సూచించి, రుద్రరచనకు అర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రచన తనలాగే అనేకమంది విద్యావంతులైన అనాథలు రాష్ట్రంలో ఉన్నారని, వారి కోసం ప్రత్యేక రిజర్వేషన్‌ కేటగిరీ ఏర్పాటు చేయాలని కోరగా కేటీఆర్‌ స్పందించి దీనిని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. రచనను పోషిస్తున్న ఆమె అక్కాబావలకు ఉపాధిని కల్పించాలని కేటీఆర్‌ జగిత్యాల జిల్లా కలెక్టర్‌కు ఫోన్‌ చేసి సూచించారు.
వరంగల్‌ జిల్లా హసన్‌పర్తికి చెందిన ఆటోడ్రైవర్‌ మేకల రమేశ్‌ చిన్న కుమార్తె అంజలి ఇండోర్‌ ఐఐటీలో సీటు సాధించింది. గతేడాది రమేశ్‌ పెద్ద కుమార్తె ఎంబీబీఎస్‌లో ర్యాంకు సాధించి ఉస్మానియా వైద్య కళాశాలలో సీటుపొందగా తనకున్న భూమిని అమ్మి ఆయన రుసుములు చెల్లించారు. దీంతో ప్రస్తుతం అంజలికి అవసరమైన రుసుములను చెల్లించలేనని చేతులెత్తేశారు. దీంతో అంజలి తన తండ్రి బాధల్ని, ఐఐటిలో సీటు పొందినా ఆర్థికసమస్యల వల్ల ముందుకెళ్లలేని దుస్థితిని కేటీఆర్‌కు ట్విటర్‌ ద్వారా తెలియజేసింది. కేటీఆర్‌ స్పందించి అంజలిని తన నివాసానికి పిలిపించి ఐఐటీ చదువుకు అవసరమైన ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ సందర్భంగా అంజలి, ఆమె తండ్రి రమేశ్‌ కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో తాను సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలు రాస్తానని అంజలి చెప్పగా, దానికి అన్ని విధాలా ప్రోత్సహిస్తానంటూ కేటీఆర్‌ హామీ ఇచ్చారు.

 

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.