close
పాత సంస్థకే పోలవరం 65వ ప్యాకేజీ పనులు

15.6 శాతం తక్కువకే చేస్తామని మ్యాక్స్‌ ఇన్‌ఫ్రా టెండరు
గతంలోనూ ఆ సంస్థకే పని

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ జలవనరులశాఖ పోలవరం ప్రాజెక్టు పనుల కోసం నిర్వహించిన రివర్స్‌ టెండర్లలో 65వ ప్యాకేజీ పనిని మ్యాక్స్‌ ఇన్‌ఫ్రా సంస్థ చేజిక్కించుకుంది. 2019 మార్చిలో నిర్వహించిన టెండర్లలోనూ ఈ సంస్థే సదరు పనిని దక్కించుకోవడం గమనార్హం. తిరిగి ఇప్పుడు అదే సంస్థ రూ.58.53 కోట్ల తక్కువకే ఆ పనులు చేస్తానంటూ రివర్స్‌ టెండర్లలో ఎల్‌1గా అర్హత సాధించింది. 2019 మార్చిలో ఈ పనులకు నాడు 276.80 కోట్ల అంచనా విలువతో టెండర్లు పిలవగా మ్యాక్స్‌ ఇన్‌ఫ్రా ఎల్‌1గా నిలిచింది. నాడు ఈసీవీ విలువ కన్నా 4.77శాతం అదనానికి టెండర్లు దాఖలు చేసిన ఆ సంస్థే ఇప్పుడు 15.60 శాతం తక్కువకే పనులు చేసేందుకు ముందుకురావడం గమనార్హం.

పని: పోలవరం ప్రాజెక్టులో ప్రధాన డ్యామ్‌ను ఎడమ కాలువతో అనుసంధానించే పనులు
ఏమేం చేయాలి: 919 మీటర్ల పొడవున టన్నెల్‌ నిర్మాణం, నేవిగేషన్‌ ల్యాక్‌, అప్రోచ్‌ ఛానల్‌ తదితరాలు
గతంలో ఏం జరిగింది: 2005లోనే ఈ ప్యాకేజికి టెండర్లు పిలిచి ఎంఎస్‌ యూనిటీ ఇన్‌ఫ్రాకు అప్పగించారు. 2018లో ఆ సంస్థ ఆర్థిక సమస్యల వల్ల టెండర్లు రద్దు చేశారు. తాజా ధరల ప్రకారం ఆ పనులకు ఎంత ఖర్చవుతుందో అంచనా వేసి రూ.358.51 కోట్లుగా లెక్కించారు. అప్పటికే చేసిన పనుల విలువను తొలగించి మిగిలిన పనుల విలువను రూ.343.490 కోట్లుగా లెక్కించారు. రూ.318.84 కోట్లకు సాంకేతిక అనుమతి ఇచ్చారు.
పాత టెండరు ఇలా: 2019 మార్చిలో ఈ పనులకు ఎల్‌ఎస్‌ పద్ధతిలో టెండర్లు పిలిచారు. మ్యాక్స్‌ ఇన్‌ఫ్రా, శంకర్‌నారాయణ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలు టెండర్లు దాఖలు చేశాయి. ఈసీవీ విలువ కన్నా 4.66 శాతం అదనానికి మ్యాక్స్‌ ఇన్‌ఫ్రా టెండర్లు దక్కించుకుంది. రూ.290 కోట్ల విలువతో ఒప్పందం కుదుర్చుకున్నా ఇప్పటివరకు 0.92 శాతం పనులు మాత్రమే చేసింది.

రివర్స్‌ టెండర్లలోనూ..
ఈ పనులు 25 శాతం కన్నా తక్కువ జరగడం వల్ల ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జలవనరులశాఖ టెండర్లు రద్దు చేసి కొత్తగా మళ్లీ టెండర్లు పిలిచింది. ఇందులో మిగిలి ఉన్న పనులకు రూ.274.25 కోట్ల విలువగా లెక్కించి ఆగస్టు 17న రివర్స్‌ టెండర్లు ఆహ్వానించింది. ఆరు సంస్థలు బిడ్డింగులో పాల్గొన్నాయి. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఈ పనులకు సంబంధించి ఆర్థిక బిడ్‌ తెరిచారు. ఎల్‌1గా నిలిచిన గుత్తేదారు సంస్థ రూ.260.26 కోట్లకే (అంచనా విలువ కన్నా 6.1 శాతం తక్కువకు) పని చేసేందుకు ముందుకొచ్చింది. ఆ సంస్థ పేరును అధికారులు వెల్లడించలేదు.

* అంతకన్నా తక్కువకు ఈ పనినిమరెవరైనా చేస్తారా అని రివర్స్‌ టెండరు ప్రక్రియ ప్రారంభించారు. రూ.231.47 కోట్లకు చేస్తామంటూ మ్యాక్స్‌ ఇన్‌ఫ్రా ముందుకు వచ్చింది. ఇది అంచనా విలువ కన్నా 15.66 శాతం (రూ.42.78 కోట్లు) తక్కువ. గతంలో అంచనా విలువ కన్నా 4.77 శాతం అదనానికి ఈ టెండర్లు ఖరారైనందున ఆ మొత్తం కూడా కలిపితే ప్రస్తుతం రూ.58,53,82,720 ఆదా చేయగలిగినట్లు జలవనరులశాఖ అధికారులు పేర్కొంటున్నారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.