
ప్రజాసంఘాల డిమాండ్
ఖైరతాబాద్, న్యూస్‌టుడే: ప్రజాసంఘాల నాయకులపై తప్పుడు కేసులు బనాయిస్తూ అక్రమంగా అరెస్టు చేస్తున్నారని పలు ప్రజాసంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజా ఫ్రంట్ (టీపీఎఫ్) నేత నలమాస కృష్ణ, తెలంగాణ విద్యార్థి వేదిక (టీవీవీ) అధ్యక్షుడు మద్దిలేటిలను మంగళవారం ఉదయం బాగ్‌లింగంపల్లిలో మఫ్టీలో ఉన్న పోలీసులు తీసుకెళ్లారన్నారు. వారిద్దరినీ వెంటనే కోర్టులో హాజరుపర్చాలని, గద్వాల కుట్ర కేసు ఎత్తివేసి అరెస్టుచేసిన అందరినీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నలమాస కృష్ణ సతీమణి సంధ్య, మద్దిలేటి సతీమణి చంద్రకళలతో కలిసి టీపీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు రవిచంద్ర, ఉపాధ్యక్షులు ప్రొ.అన్వర్‌ఖాన్, పౌరహక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి నారాయణరావు, టీవీవీ రాష్ట్ర కార్యదర్శి సందీప్ తదితరులు మంగళవారం సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడారు. విద్యార్థులను ఏకం చేసి కేసులు, లాఠీదెబ్బలు సహిస్తూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న టీపీఎఫ్, టీవీవీ సంఘాల నాయకులపై ప్రభుత్వం మావోయిస్టు సంఘాలుగా ముద్ర వేసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని పేర్కొన్నారు. ఈ నెల మొదటి వారంలో నాగన్న, బలరాం, జగన్‌లను అక్రమంగా అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేశారని, రెండు రోజుల తర్వాత అరెస్టు చేసినట్లు చూపారని ఆరోపించారు.