close
కచ్చితత్వంతో తుపాను ముందస్తు సూచనలు

  వర్షపాతం తీవ్రతను అంచనా వేయడంపై దృష్టి
  ఫిగా సదస్సులో ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ మహాపాత్ర

ఈనాడు, హైదరాబాద్‌: తుపాను తీవ్రతను ముందస్తుగా గుర్తించి కచ్చితత్వంతో సూచించడంలో ప్రపంచంలోని ప్రముఖ వాతావరణ కేంద్రాలకు దీటుగా భారత వాతావరణ శాఖ (ఐఎండీ) పనిచేస్తోందని సైక్లోన్‌ మ్యాన్‌, భారత వాతావరణశాఖ(ఐఎండీ) డైరెక్టర్‌ జనరల్‌ మృత్యంజయ్‌ మహాపాత్ర అన్నారు. కచ్చితత్వంతో ఇస్తున్న హెచ్చరికలతో తుపాను సమయంలో ప్రాణ నష్టం వేల నుంచి వందలకు తగ్గిందని తెలిపారు. తుపాను తీరం దాటే సమయంలో వర్షం పడుతుందని సూచిస్తున్పటికీ ఆ ప్రాంతంలో ఎంత తీవ్రతతో కురుస్తుందనే సూచనలో ఇప్పటికీ అంత కచ్చితత్వం లేదని అంగీకరించారు. 2030 నాటికి 24 గంటల ముందు ఇచ్చే తుపాను హెచ్చరికల్లో వర్షపాతం తీవ్రత తెలిపే సూచనల్లో లోపాలను 30 కి.మీ.తగ్గించగలుగుతామనే ధీమా వ్యక్తం చేశారు. ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ జియో సైన్సెస్‌ అసోసియేషన్స్‌(ఫిగా) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరుగుతున్న సదస్సులో మంగళవారం ఆయన ‘సహజ విపత్తులను అర్థం చేసుకోవడం, ఎదుర్కోవడం’ అనే అంశంపై మాట్లాడారు. 1999లో ఒడిశాలో వచ్చిన సూపర్‌ సైక్లోన్‌లో ఏకంగా 10 వేల మంది చనిపోవడంతో వాతావరణ శాఖలోని తుపాను హెచ్చరికల వ్యవస్థల్లో చాలా మార్పులు వచ్చాయన్నారు. 24 గంటల ముందు వాతావరణ సూచనలో లోపాలను 2014-18 నాటికి 86 కి.మీ.తగ్గించగలిగామని.. ఇది 2009-13 కాలంలో 124 కి.మీ. ఉండేదని గుర్తు చేశారు. గత ఐదేళ్లలో తుపాను హెచ్చరికల్లో అనిశ్చితి 30 శాతం తగ్గిందన్నారు. ప్రస్తుతం 15 రోజుల ముందే తుపాను ఏర్పడుతున్నట్లు సమాచారం ఇవ్వడం, ఐదు రోజుల ముందు అది ఎక్కడ తీరం దాటే అవకాశం ఉందనే సమాచారం, రోజులు గడిచేకొద్దీ ప్రమాద తీవ్రతను హెచ్చరించడంతో పరిస్థితులు చాలా మారాయన్నారు. దేశంలో ప్రస్తుతం 25 డాప్లార్‌ రాడార్‌ వాతావరణ కేంద్రాలు ఉన్నాయని, రెండేళ్లలో వీటిని 55కి పెంచబోతున్నట్లు ఐఎండీ అదనపు డీజీ దేవేెంద్ర ప్రధాన్‌ తెలిపారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.