close
30 రోజుల ప్రణాళికలో మెరిశారు

 గత 15 రోజుల్లో మళ్లీ వెనుకంజ
 పంచాయతీ కార్యదర్శుల పనితీరు ఇలా

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: పంచాయతీ కార్యదర్శుల పనితీరు కొంత మెరుగై మళ్లీ మందగిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన 30 రోజుల ప్రణాళికలో గ్రామాల రూపురేఖలు కొంత మారడంతో పాటు, కార్యదర్శుల పనితీరు కాస్త మెరుగైంది. అంతకుముందు సున్నా మార్కులు వచ్చిన వారు సగటున నెలకు వెయ్యి మంది ఉంటే, సెప్టెంబరులో 229 మంది మాత్రమే సున్నా చుట్టారు. ఈ నెల 5తో 30 రోజుల ప్రణాళిక ముగియడంతో పాత పరిస్థితులే పునరావృతం అవుతున్నాయి. గడిచిన 15 రోజుల్లో కార్యదర్శుల మార్కుల్లో పెద్దగా పురోగతి లేదు. ఇంకా 1726 మంది సున్నా దగ్గరే ఉండిపోయారు. 40 మంది మాత్రమే 75కు పైగా మార్కులు సాధించారు.

32 అంశాల ప్రాతిపదికన మార్కులు
జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల నియామకంతో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో అధికారులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చారు. వీరితో మెరుగ్గా పని చేయించాలనే ఉద్దేశంతో 32 అంశాల ప్రాతిపదికన పనితీరును లెక్కగడుతూ ప్రభుత్వం వారికి మార్కులు కేటాయిస్తోంది. గడిచిన 6 నెలల్లో సగానికిపైగా కార్యదర్శులు 50 లోపు మార్కులే సాధించారు. రాష్ట్రంలో 12,750 పైచిలుకు పంచాయతీల్లో జులై, ఆగస్టు మినహా ఏ నెలలోనూ 76కు పైన మార్కులు సాధించిన వారి సంఖ్య 100 దాటకపోవడం గమనార్హం.

సమస్యలూ ఉన్నాయి..
పంచాయతీ కార్యదర్శులు నిత్యం వారు చేయించిన పనిని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. కొందరికి దీనిపై అవగాహన లేక నమోదు చేయలేకపోతున్నారు. 7, 8 గ్రామాలకు ఒక ఆపరేటర్‌ మాత్రమే ఉండటంతో వారి ద్వారానూ సమయానికి అప్‌లోడ్‌ చేయలేకపోతున్నారు. మొబైల్‌ యాప్‌లో నమోదుకు సిగ్నల్‌ సమస్యలు ఎదురవుతున్నాయని మరికొందరు ఆరోపిస్తున్నారు. కొత్తగా ఏదైనా పనిచేసి, నమోదు చేసినప్పుడు మార్కులు పెరగాలి కానీ, తగ్గిపోతున్నాయని సూర్యాపేట జిల్లాకు చెందిన జూనియర్‌ పంచాయతీ కార్యదర్శి ఒకరు తెలిపారు. ఈ ఫిర్యాదులను ఉన్నతాధికారులు కొట్టిపారేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులున్నా మండల, జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని పంచాయతీరాజ్‌ డిప్యూటీ కమిషనర్‌ సుధాకర్‌ సూచించారు. ప్రతి ఒక్కరికి దీనిపై శిక్షణ ఇచ్చామని, అర్థం కాకపోతే నేర్చుకోవాలే తప్ప ప్రత్యామ్నాయాలు ఉండవని స్పష్టం చేశారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.