close

ప్రధానాంశాలు

నిరుపేదల అభ్యున్నతి లక్ష్యంగా పనిచేయాలి

 విద్య, ఆరోగ్యంపై ఇంకా ఉదాసీనతే
 శిక్షణ పొందుతున్న అఖిల భారత సర్వీసు అధికారులతో మంత్రి కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: నిరుపేదల అభ్యున్నతే లక్ష్యంగా అఖిల భారత సర్వీసు అధికారులు పనిచేయాలని రాష్ట్ర పురపాలక, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ సూచించారు. మన దేశంలో విద్య, ఆరోగ్యానికి తగిన ప్రాధాన్యం లభించడం లేదని, వీటిపై ప్రత్యేక దృష్టిసారించాలని కోరారు. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ(ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ)లో వంద రోజుల శిక్షణ పూర్తి చేసుకున్న అఖిల భారత సర్వీసు అధికారులకు మంత్రి కేటీఆర్‌ గురువారం ధ్రువీకరణపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ సలహాదారు, మాజీ ఐఏఎస్‌ అధికారి ఎ.పి.వి.ఎన్‌.శర్మ, ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ డైరెక్టర్‌ జనరల్‌ బి.పి.ఆచార్య, అదనపు డీజీ హర్‌ప్రీత్‌సింగ్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ భవనాలపై ఏర్పాటు చేసిన 350 కిలోవాట్ల సౌరవిద్యుత్‌ విధానాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాలు, సమ్మిళిత అభివృద్ధి ప్రస్తుతం పరిగణనలోకి తీసుకోవాల్సి కీలక అంశాలని అన్నారు. మౌలిక సదుపాయాలంటే రోడ్లు, భవనాలు కాదని మరుగుదొడ్లు, రక్షిత మంచినీరు, గృహవసతి అని గుర్తించాలన్నారు. శిక్షణలో నేర్చుకున్న విషయాలను అధికారులు విధుల నిర్వహణలో సమర్థంగా ఉపయోగించుకోవాలని సూచించారు. ఉద్యోగాల కల్పన ప్రభుత్వాలకు ప్రధాన సవాల్‌గా మారిందంటూ విధుల్లో భాగంగా ఉపాధి అవకాశాలు పెంపొందించేలా దృష్టిసారించాలని అధికారులను కోరారు.

తక్షణం ఉరితీయడం చట్టపరంగా సాధ్యమా?
ఇటీవల జరిగిన దిశ దుర్ఘటనపై మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ప్రజలు తక్షణ ఫలితాలు కావాలని కోరుకుంటారని ఇది చట్టపరంగా సాధ్యమా? అని గుర్తించాలన్నారు. దిశ హత్యాచారంపై దేశం యావత్తు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిందన్నారు. ఈ ఘటనకు కారకులైన నిందితుల్ని ఉరి తీయాలని, కాల్చి చంపాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారన్నారు. ఎంపీలు సైతం పార్లమెంట్‌ వేదికగా దీన్నే ప్రస్తావించారని గుర్తు చేశారు. వారి ఆగ్రహం సరైందే అంటూ చట్టం ప్రకారం తక్షణం కాల్చిచంపడం, ఉరితీయడం  సాధ్యమవుతుందా? అని ప్రశ్నించారు. వెంటనే చర్యలు తీసుకోవడానికి ప్రస్తుత చట్టాలు అనుగుణంగా లేవన్నారు. విధి నిర్వహణలో అధికారులు రాజ్యాంగబద్దంగా, చట్టప్రకారమే వ్యవహరించాల్సి ఉంటుందని మంత్రి సూచించారు.

 

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.