ఉద్యాన వర్సిటీకి ప్రత్యేక గుర్తింపు తెస్తా

ప్రధానాంశాలు

ఉద్యాన వర్సిటీకి ప్రత్యేక గుర్తింపు తెస్తా

వీసీగా బాధ్యతలు చేపట్టిన నీరజ

న్యూస్‌టుడే, ములుగు: గురుతర బాధ్యతను సమర్థంగా నిర్వహించి వర్సిటీకి ప్రత్యేక గుర్తింపు తెస్తానని కొండా లక్ష్మణ్‌ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉప కులపతి(వీసీ)గా నియమితులైన ఆచార్య డా.భోగ నీరజ ప్రభాకర్‌ అన్నారు. సిద్దిపేట జిల్లా ములుగులోని ఉద్యాన విశ్వవిద్యాలయం పరిపాలన భవనంలో శుక్రవారం ఆమె బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014-2015లో ములుగులో ఉద్యాన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేయగా పూర్తి స్థాయి వీసీని ప్రభుత్వం నియమించలేదు. ఈ నేపథ్యంలో ఆచార్య జయశంకర్‌ విశ్వవిద్యాలయంలోని వ్యవసాయ కళాశాల ఉద్యాన విభాగంలో సీనియర్‌ ప్రొఫెసర్‌ నీరజను ప్రభుత్వం రెండు రోజుల కిందట వీసీగా నియమించింది. బాధ్యతలు చేపట్టేందుకు విశ్వవిద్యాలయానికి వచ్చిన నీరజకు ఉద్యాన శాస్త్రవేత్తలు, సిబ్బంది స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ ఎంతో నమ్మకంతో తనకీ బాధ్యతను అప్పజెప్పారన్నారు. విద్య, పరిశోధన, విస్తరణ రంగాల్లో వర్సిటీని ముందుకు తీసుకెళతామని ఆమె చెప్పారు. రాష్ట్రంలో సాగునీటి వనరులు పుష్కలంగా అందుబాటులోకి వచ్చిన తరుణంలో ఉద్యాన పంటల ద్వారా రైతుల ఆదాయం పెంచేందుకు కృషిచేస్తామన్నారు. కార్యక్రమంలో ఉద్యాన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ డా.భగవాన్‌, కంట్రోలర్‌ కిరణ్‌కుమార్‌, విద్యార్థి వ్యవహారాల డీన్‌ డా.పద్మ, ఎస్టేట్‌ ఆఫీసర్‌ నాగేశ్వర్‌రెడ్డి, శేషారెడ్డి తదితరులు ఉన్నారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని