రాష్ట్రంలో కొవాగ్జిన్‌ టీకా పంపిణీ షురూ

ప్రధానాంశాలు

రాష్ట్రంలో కొవాగ్జిన్‌ టీకా పంపిణీ షురూ

ప్రజారోగ్య సంచాలకుడికి తొలి డోసు

ఈనాడు, హైదరాబాద్‌, జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: భారత్‌ బయోటెక్‌ సంస్థ ఉత్పత్తి చేసిన కొవిడ్‌ టీకా ‘కొవాగ్జిన్‌’ పంపిణీ కార్యక్రమం రాష్ట్రంలో సోమవారం నుంచి ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా గత నెల 16 నుంచే కొవాగ్జిన్‌ పంపిణీ ప్రారంభమవగా.. తెలంగాణలో ఇప్పుడు ప్రారంభించారు. జూబ్లీహిల్స్‌లోని సీఆర్‌పీఎఫ్‌ దక్షిణ విభాగ బెటాలియన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కొవాగ్జిన్‌ టీకాలను మొదట రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు, తర్వాత సీఆర్‌పీఎఫ్‌ దక్షిణ విభాగ ఐజీ మహేష్‌ లద్దా స్వీకరించారు. రాష్ట్రానికి 2.7 లక్షల కొవాగ్జిన్‌ టీకాలను కేంద్రం సరఫరా చేసింది.. వ్యాక్సిన్ల విషయంలో ఎటువంటి ఆందోళనలు, అపోహలు అవసరం లేదని.. ఈ విషయాన్ని స్పష్టం చేయడానికే తాను కూడా టీకా తీసుకున్నానని శ్రీనివాసరావు తెలిపారు. ఏ టీకా వేయించుకున్నా జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పులు రావడం సాధారణమేననీ, రోగనిరోధక శక్తి స్పందిస్తుందనడానికి అవి సంకేతాలని చెప్పారు. తద్వారా శరీరంలో ప్రతిరక్షకాలు (యాంటీబాడీలు) తయారై వైరస్‌ నుంచి మనల్ని రక్షిస్తాయని వివరించారు. పలువురు సీఆర్‌పీఎఫ్‌ పోలీసులు టీకాలను తీసుకున్నారు.
19,923 మందికి టీకాలు
సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 584 కేంద్రాల్లో 51,500 మందికి కొవిడ్‌ టీకాలను అందజేయాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా.. వారిలో 41 శాతం మంది (19,923 మంది) టీకాలు పొందారని ప్రజారోగ్య సంచాలకులు జి.శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 2,28,845 మంది టీకాలను స్వీకరించినట్లయింది. ఈ నెల 12 వరకు కొవిడ్‌పై పోరులో ముందువరసలో నిలిచే సిబ్బందికి టీకాలను అందజేస్తామని, ప్రభుత్వ, ప్రైవేటు వైద్యసిబ్బందికి ఈ నెల 13 నుంచి రెండో డోసు వేస్తామని పేర్కొన్నారు.
50 ఏళ్ల పైబడినవారికి మార్చిలో..
రాష్ట్రంలో 50 ఏళ్లు పైబడినవారు, ఆ వయసు లోపు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు కలిపి సుమారు 73 లక్షల వరకూ ఉంటారని అంచనా. కొవిడ్‌ టీకాలకు అర్హుల్లో వీరి సంఖ్యే ఎక్కువ. వీరికి మార్చి రెండోవారంలో టీకాలు వేసే అవకాశాలున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని