close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆదివాసీల మృతికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం

సీఎల్‌సీ, బాధిత కుటుంబీకుల ఆరోపణ

నాంపల్లి, న్యూస్‌టుడే: నల్లమల అడవిలో చెలరేగిన మంటల్లో ముగ్గురు చెంచు ఆదివాసీలు మృతి చెందడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని పౌరహక్కుల సంఘం(సీఎల్‌సీ), బాధిత కుటుంబీకులు ఆరోపించారు. శుక్రవారం హైదర్‌గూడలో విలేకరుల సమావేశంలో కార్చిచ్చులో గాయపడ్డ కాట్రాజు మహేష్‌, నిమ్మల బాలయ్య, లింగమ్మ, లక్ష్మమ్మతో కలిసి సీఎల్‌సీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొ.లక్ష్మణ్‌ గడ్డం మాట్లాడారు. ఇప్పటికీ మంటలార్పే చర్యలు చేపట్టకపోవడాన్ని గమనిస్తే ఆదివాసీలను అడవికి దూరం చేసి, యురేనియం నిల్వలను విదేశీ బహుళజాతి సంస్థలకు అప్పగించాలనే ప్రభుత్వ కుట్ర స్పష్టమవుతోందని ఆరోపించారు. మార్చి 7న నాగర్‌కర్నూల్‌ జిల్లా మల్లాపూర్‌పెంట, ఈర్లపెంటకు చెందిన 11 మంది చెంచులు కందగడ్డలు తవ్వేందుకు అడవికి వెళ్లి మంటల్లో చిక్కుకున్నట్లు తెలిపారు. గాయపడ్డ వారిని ఉస్మానియా ఆసుపత్రిలో చేర్పించగా నిమ్మల లింగయ్య(36), మామిళ్ల లింగయ్య(40), కాట్రాజు ఎల్లయ్య(50) మృతిచెందారన్నారు. మృతుల కుటుంబాలకు రూ.50లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.25లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని లక్ష్మణ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు