close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
తెలుగు యువకుడికి రూ.1.50 కోట్ల వేతనం

ప్రాంగణ నియామకాల్లో అమెజాన్‌కు ఎంపిక

ఈనాడు, హైదరాబాద్‌: అమెరికాలోని జార్జియా టెక్‌ విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం ఎంబీఏ చేస్తున్న హైదరాబాద్‌కు చెందిన యువకుడు గిర్రెడ్డి వివేక్‌ అమెరికాలోని అమెజాన్‌ కంపెనీలో అత్యుత్తమ ప్యాకేజీతో కొలువు దక్కించుకున్నారు. గతేడాది జరిగిన ప్రాంగణ నియామకాల్లో రూ.1.50 కోట్ల వార్షిక వేతనంతో ఆ కంపెనీలో సీనియర్‌ ఫైనాన్షియల్‌ ఎనలిస్టుగా ఎంపికయ్యారు. ఈ ఏడాది జూన్‌ 21న సియాటెల్‌లోని ఆ సంస్థ కేంద్ర కార్యాలయంలో చేరనున్నారు. ఆయన తల్లిదండ్రులు భానురెడ్డి, జీఎస్‌ రెడ్డి నగరంలోని శ్రీనగర్‌ కాలనీలో ఉంటున్నారు. వీరి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ. జీఎస్‌ రెడ్డి సెబీలో జనరల్‌ మేనేజర్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్‌ కమిటీ అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జీఎస్‌ రెడ్డి ఉద్యోగరీత్యా ముంబయిలో ఉండటంతో వివేక్‌ విద్యాభ్యాసమంతా అక్కడి డాన్‌బాస్కో స్కూల్‌లో సాగింది. అనంతరం లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో బీఏ ఎకనామిక్స్‌ అండ్‌ ఫైనాన్స్‌ మొదటి సంవత్సరం చదివారు. తర్వాత కెనడాలోని మెక్‌గిల్‌ యూనివర్సిటీకి వెళ్లి మిగిలిన మూడేళ్లు చదివారు. ఆ తర్వాత బెంగళూరులోని గోల్డ్‌మాన్‌శాక్స్‌ కంపెనీలో మూడేళ్లపాటు ఉద్యోగం చేశారు. ఎంబీఏ చేయాలన్న ఉద్దేశంతో జీమాట్‌ రాసి 94 పర్సంటైల్‌ సాధించారు. అంతకుముందు రాసిన శాట్‌లో గణితం విభాగంలో 800కు 800 సాధించారు. అనంతరం పూర్తి ఉపకారవేతనం ద్వారా చదివేలా అమెరికాలోని జార్జియా టెక్‌ విశ్వవిద్యాలయంలో రెండేళ్ల ఎంబీఏ(ఫైనాన్స్‌) కోర్సులో చేరారు. తొలి ఏడాది పూర్తయ్యాక అమెజాన్‌ కంపెనీలో 12 వారాల ఇంటర్న్‌షిప్‌ చేశారు. ఎంబీఏ చదివే ప్రతిభావంతులైన విద్యార్థుల వివరాలు ప్రచురించే అమెరికాలోని ప్రముఖ మేగజైన్‌ ‘పొయట్స్‌ అండ్‌ క్వాంట్స్‌’లో గత ఏడాది వివేక్‌ వివరాలు ప్రచురితమయ్యాయి.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు