close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
స్వాతంత్య్ర సమరయోధులు పావులూరి శివరామకృష్ణయ్య కన్నుమూత

పట్టాభిపురం(గుంటూరు), న్యూస్‌టుడే: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, గాంధేయవాది పావులూరి శివరామకృష్ణయ్య (98) కన్నుమూశారు. అయిదు రోజుల క్రితం కరోనా బారినపడిన ఆయన గుంటూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకున్నారు. మంగళవారం డిశ్ఛార్జి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా గుండెపోటు రావటంతో మృతిచెందారు. గుంటూరు జిల్లా అమృతలూరు మండలం గోవాడలో 1923లో శివరామకృష్ణయ్య జన్మించారు. ప్రాథమిక విద్య గోవాడ, ఉన్నత విద్య తిరుమెళ్లలో సాగింది. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మెట్రిక్యులేషన్‌ చదివారు. మహాత్మాగాంధీ సేవాగ్రామ్‌లో ఆయన ఏడాదిపాటు ఉన్నారు. సహాయనిరాకరణ, క్విట్ ఇండియా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొని పలుమార్లు జైలుకు వెళ్లారు. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌తో కలిసి వారం రోజులు ఒకే సెల్‌లో ఉన్నారు. వృత్తిరీత్యా హిందీ ఉపాధ్యాయునిగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్‌ స్వాతంత్య్ర సమరయోధుల సంఘానికి ప్రధాన కార్యదర్శిగా, కొవ్వూరు వినయాశ్రమ ధర్మకర్తల మండలి సభ్యునిగా, ఆంధ్రప్రదేశ్‌ హిందీ అకాడమీ సభ్యులుగా, పట్టు పరిశ్రమ సలహా సంఘ సభ్యులుగా శివరామకృష్ణయ్య బాధ్యతలు నిర్వర్తించారు. దిల్లీలో జరిగిన విశ్వహిందీ సమ్మేళనంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, అప్పటి విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ చేతుల మీదుగా విశిష్ట సన్మానం అందుకున్నారు. శివరామకృష్ణయ్య మృతిపై ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు