close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వెంటనే టారిఫ్‌ ఆర్డర్‌ సమర్పించండి

రాష్ట్రాల విద్యుత్‌ నియంత్రణ మండళ్లకు కేంద్ర సర్కారు ఆదేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రాల విద్యుత్‌ నియత్రణ మండళ్లు (ఎస్‌ఈఆర్‌సీలు) ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన టారిఫ్‌ ఆర్డర్లను సత్వరం సమర్పించాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వశాఖ నోటిఫికేషన్‌ జారీచేసింది. విద్యుత్‌ చట్టం-2003 ప్రకారం టారిఫ్‌ రూపకల్పనలో అప్పిలేట్‌ ట్రైబ్యునళ్ల సూచనలను నియంత్రణ మండళ్లు తప్పక పాటించవలసి ఉంటుందని పేర్కొంది. విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఆర్థికంగా నిలబడటానికిది దోహదం చేస్తుందని అభిప్రాయపడింది. విద్యుత్‌ ధరలు, క్రాస్‌ సబ్సిడీలు, పారిశ్రామిక అవసరాలకు అందించే సర్‌ఛార్జీలను పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది.
‘‘దేశంలోని కొన్ని ఈఆర్‌సీలు ప్రతి ఆర్థిక సంవత్సరంలో టారిఫ్‌ ఆర్డర్‌ను సమర్పిస్తుంటే, మరికొన్ని విస్మరిస్తున్నాయి. అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ దీనికి సంబంధించి 2011, 2019లలో స్పష్టంగా ఆదేశాలిచ్చింది. డిస్కంల ఖర్చులతో పాటు, ఇతర అంశాలకు సంబంధించిన వ్యయాలు (ట్రూయింగ్‌ ఆఫ్‌ టారిఫ్‌), ఆదాయంలో తేడాలు(రెవెన్యూ గ్యాప్‌) పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌, అస్సాం, బిహార్‌, హరియాణా, ఒడిశా, మిజోరం, పాండిచ్చేరిలలో విద్యుత్‌ నియంత్రణ మండళ్లు ఇటీవల టారిఫ్‌ ఆర్డర్‌ను ప్రకటించాయి’’ అని వివరించింది. ఈ అంశాలను ఆధారంగా చేసుకుని త్వరగా మిగతా రాష్ట్రాలూ స్పందించాలని కేంద్ర విద్యుత్‌ నియంత్రణ మండలి కోరింది.

తెలంగాణలోనూ కదలిక!
తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థలు 2018-19, 2019-20, 2020-21 సంవత్సరాల వార్షిక ఆదాయాల అవసరా(యాగ్రిగేట్‌ రెవెన్యూ రిక్వైర్‌మెంటు-ఏఆర్‌ఆర్‌)లు సమర్పించలేదు. 2017లో ప్రకటించిన టారిఫ్‌ ఇక్కడ అమలులో ఉంది. కేంద్రం తాజా ఆదేశాలతో ఏఆర్‌ఆర్‌ల సమర్పణకు అనువుగా రాష్ట్ర డిస్కంలలో కదలిక రావచ్చని భావిస్తున్నారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు