5 రోజుల ముందే వరదలపై సమాచారమిస్తాం
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

5 రోజుల ముందే వరదలపై సమాచారమిస్తాం

ఎలాంటి నష్టాలు లేకుండా చూడండి
రాష్ట్రాలకు కేంద్ర జలసంఘం లేఖలు

ఈనాడు హైదరాబాద్‌: ముందుగా నిర్ణయించుకున్న మార్గదర్శకాల ప్రకారం వర్షాకాలంలో రిజర్వాయర్ల నిర్వహణ కచ్చితంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర జలసంఘం రాష్ట్రాలకు సూచించింది. ప్రతి ప్రాజెక్టుకు నిర్వహణ కరదీపిక ఉందని, దాని ప్రకారం వర్షాకాలంలో ఎంత మట్టం వరకు నీటిని నిల్వ చేయాలి, ఎంత వదలాలి, వరద ప్రవాహానికి తగ్గట్లుగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేస్తే వరదల వల్ల ఎలాంటి నష్టం జరగకుండా చూడవచ్చని పేర్కొంది. ప్రస్తుతం మూడురోజుల ముందు ఏ ప్రాజెక్టుకు ఎంత వరద వస్తుందో కేంద్ర జలసంఘం అంచనా వేసి చెబుతోందని, ఇకమీదట ఐదు రోజుల ముందుగానే సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించింది. కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టుల విషయంలో తీసుకోవాల్సిన చర్యల గురించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాలకు జలసంఘం లేఖలు రాసింది. జూన్‌ నుంచి వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రాజెక్టుల నిర్వహణ, వరద నియంత్రణపై రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేస్తోంది. దేశంలోని 20 ప్రధాన నదులపై 328 వరద అంచనా స్టేషన్లున్నాయి. దేశంలోని 130 డ్యాములు/రిజర్వాయర్లకు సంబంధించిన వరద ప్రవాహాన్ని అంచనా వేస్తుంది. టెలిమెట్రీ నెట్‌వర్క్‌, ఆటోమేటిక్‌ వెదర్‌ నెట్‌వర్క్‌ స్టేషన్ల ద్వారా జలసంఘం వరద ప్రవాహాన్ని అంచనా వేస్తుంది. వీటిలో ఆంధ్రప్రదేశ్‌లో 20, తెలంగాణలో 13 అంచనా స్టేషన్లు ఉన్నాయి. ఐ.ఎం.డి. డేటా ఆధారంగా 3 రోజుల ముందే సమాచారం ఇవ్వడంతోపాటు 24 నుంచి 6 గంటలలోపు కచ్చితమైన సమాచారాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇకమీదట 5 రోజులు ముందుగానే వరదలపై సమాచారం ఇస్తే డ్యాముల నిర్వహణ మరింత సులభమవుతుందని కేంద్ర జలసంఘం భావిస్తోంది. ప్రాజెక్టులన్నింటినీ విడివిడిగా కాకుండా సమీకృత నిర్వహణను చేపట్టాలని జలసంఘం పేర్కొంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని