మా విధులు ‘అత్యవసరం’ కాదా?
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మా విధులు ‘అత్యవసరం’ కాదా?

రెవెన్యూ సిబ్బందిలో చర్చనీయాంశమైన ఉత్తర్వు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రకృతి విపత్తుల నిర్వహణను నిరంతరం పర్యవేక్షించాల్సిన తహసీల్దారు, రెవెన్యూ యంత్రాంగాన్ని కరోనా వేళ ‘అత్యవసర శాఖల’ జాబితాలో చేర్చకపోవడం ఉద్యోగుల్లో చర్చనీయాంశమైంది. ప్రభుత్వం జారీచేసిన లాక్‌డౌన్‌ ఉత్తర్వుల్లో అత్యవసర విధులున్న శాఖలను పేర్కొంది. వాటిలో రెవెన్యూను చేర్చలేదు. వివిధ శాఖలతో సమన్వయం చేస్తూ ఆసుపత్రులకు ఆక్సిజన్‌ సరఫరాలో కీలక పాత్ర పోషిస్తున్నది రెవెన్యూ ఉద్యోగులే. కొవిడ్‌ నిబంధనల అమలును పర్యవేక్షించాల్సిన బాధ్యత కూడా వీరిపైనే ఉంది. గతేడాది విపత్తుల చట్టం కింద వివాహాలకు తహసీల్దార్లు అనుమతులు జారీ చేసి సిబ్బందితో పర్యవేక్షణ చేపట్టారు. ఇప్పుడు మాత్రం ఎటువంటి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదని వారు పేర్కొంటున్నారు. ప్రభుత్వ ఆదేశాల్లో ఉన్నట్లు 33 శాతంమందే కార్యాలయాలకు హాజరైతే ప్రభుత్వానికి అందించాల్సిన ఒక్క నివేదిక కూడా పూర్తి కాదని హైదరాబాద్‌కు చెందిన ఓ తహసీల్దారు తెలిపారు. మరణాలు ఇతరత్రా పంచనామాలకు కూడా రెవెన్యూ సిబ్బంది హాజరు కావాల్సి వస్తోందని పేర్కొన్నారు. ‘అన్ని శాఖలను సమన్వయం చేసేది రెవెన్యూ అధికారులే. 24 గంటలూ రెవెన్యూ యంత్రాంగం విధుల్లో ఉంటోంది. అయినా ప్రభుత్వం అత్యవసర శాఖల్లో రెవెన్యూను చేర్చలేదు. దీనివల్ల మా సిబ్బందిని పోలీసులు నిలిపివేస్తున్నారు. విధుల్లో ఏదైనా ప్రాణ నష్టం వాటిల్లితే తమకు న్యాయం జరగదని కొందరు సిబ్బంది కూడా వెనకాడుతున్నారు. కరోనాతో ఇప్పటికే 85 మంది అధికారులు, సిబ్బంది ప్రాణాలు విడిచారు. దీనిపై ప్రభుత్వం ఆలోచించాలి’ అని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం (ట్రెసా) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వంగ రవీందర్‌రెడ్డి, కె.గౌతంకుమార్‌ కోరారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని