మందకొడిగా టీకాల ప్రక్రియ
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మందకొడిగా టీకాల ప్రక్రియ

రోజుకు 30 వేల నుంచి 50 వేల మధ్యలోనే

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొవిడ్‌ టీకాల ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. వ్యాక్సిన్‌ కొరతే ప్రధాన కారణంగా ఉంది. 4 వారాల కిందట రోజుకు 1.50 లక్షల వరకూ వేశారు. ఇప్పుడు రోజుకు 30 వేల నుంచి 50 వేల మధ్యలోనే ఇస్తున్నారు. ఇదే రీతిలో కొనసాగితే మరో ఆర్నెల్లు గడిచినా కూడా అర్హులైన వారికి రెండో డోసు అందించడం పూర్తి కాదని వైద్య వర్గాలే చెబుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 39.58 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేశారు. మొత్తం 45.37 లక్షల డోసులను పంపిణీ చేశారు. ముఖ్యంగా రెండో డోసు పొందడానికి జనం నానా అగచాట్లు పడుతున్నారు. వారం రోజులుగా 45 ఏళ్ల పైబడిన వారికి కూడా తొలి డోసు టీకాలను ప్రభుత్వమే నిలిపివేసింది. ఇక 18-44 ఏళ్ల మధ్య వయస్కుల పరిస్థితి ఏమిటో వైద్య శాఖలోనే స్పష్టత లేదు. టీకాలు పూర్తిస్థాయిలో ఉంటే.. సాధ్యమైనంత వేగంగా అర్హులందరికీ వేయడానికి వైద్య ఆరోగ్యశాఖ ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసింది. 7,200 మంది ఏఎన్‌ఎంలు ఒక్కొక్కరు రోజుకు 100 మందికి చొప్పున ఒక్క రోజులోనే 7.2 లక్షల మందికి టీకాలను వేయడానికి ఏర్పాట్లు చేసింది. ప్రైవేటు ఆసుపత్రుల ద్వారా మరో 1.8 లక్షల డోసులు ఇస్తారు. మొత్తంగా ప్రభుత్వ, ప్రైవేటు వైద్యంలో రోజుకు 9 లక్షల డోసులను పంపిణీ చేయవచ్చని వైద్య వర్గాలు తెలిపాయి. టీకాల లభ్యత ఎప్పుడు పెరుగుతుందనే అంశంపైనే అర్హులందరికీ ఎంత వేగంగా టీకాలు అందుబాటులోకి వస్తాయనేది ఆధారపడి ఉంటుందని వైద్యవర్గాలు పేర్కొన్నాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని