ప్రాణాలు తీసిన భయం
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రాణాలు తీసిన భయం

ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య

కరోనా కన్నా భయమే ప్రాణాలు తీస్తోంది. ఇంటిపెద్దకు టైఫాయిడ్‌ వచ్చిందని.. మందులు వాడాలని డాక్టర్లు చెప్పారు. అతని భార్యకూ జ్వరం రావడంతో కరోనా అనుకుని భయపడ్డారు. అత్త, భార్యను వెంట పెట్టుకొని ఇంటి పెద్ద స్వగ్రామం చేరుకున్నారు.పురుగు మందు తాగి ఒకరి తర్వాత ఒకరు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాదకర సంఘటన విజయనగరం జిల్లా వేపాడ మండలం నల్లబిల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది.
వేపాడ, న్యూస్‌టుడే: వేపాడ మండలం నల్లబిల్లి గ్రామానికి చెందిన ఉడత సత్యన్నారాయణ గుప్తా (62) రెండేళ్లుగా విశాఖ జిల్లా చోడవరంలో కుటుంబంతో ఉంటున్నారు. ఇతనికి భార్య సత్యవతి (57), అత్త వెంకటసుబ్బమ్మ, కుమారుడు సంతోష్‌, కుమార్తె పూర్ణ ఉన్నారు. కుమారుడు నిజామాబాద్‌లో స్థిరాస్తి వ్యాపార సంస్థలో పనిచేస్తున్నాడు. కుమార్తెకు వివాహమైంది. గుప్తా మొదటి భార్య 2002లో మరణించారు.  గుంటూరుకు చెందిన సత్యవతిని 2009లో రెండో వివాహం చేసుకున్నారు.
సొంతూర్లోనే... ఇటీవల సత్యన్నారాయణ గుప్తా అనారోగ్యానికి గురయ్యాడు. చోడవరం పక్కనే చుక్కపల్లిలో ఉంటున్న అల్లుడు, కుమార్తె  అతడిని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వైద్యులు పరీక్షించి టైఫాయిడ్‌ అని చెప్పి మందులు వాడాలని సూచించారు. రెండు రోజుల క్రితం భార్య సత్యవతికి కూడా జ్వరం రావడంతో సపర్యలు చేసేందుకు కుమార్తె వచ్చింది. ఆమెను గురువారం వెళ్లిపోమ్మని చెప్పిన గుప్తా శుక్రవారం ఉదయం భార్య, అత్తలను తీసుకొని ఆటోలో తన సొంతూరైన నల్లబల్లికి వచ్చాడు. శివాలయం వద్ద వీరిని చూసిన బంధువులు పలకరించడంతో గుడికి వచ్చామని చెప్పారు. ఆలయ వెనుక భాగంలోకి వెళ్లి వెంట తెచ్చుకున్న పురుగు మందును ఓఆర్‌ఎస్‌లో కలుపుకొని  తాగారు. అనంతరం సమీపంలోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో బావిలో రెండు మృతదేహాలు తేలడంతో స్థానికులు మృతుల కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు వల్లంపూడి ఎస్సై జి.లోవరాజు కేసు నమోదు చేశారు. ఎస్‌కోట సీఐ సింహాద్రినాయుడు, వేపాడ తహసీల్దారు కృష్ణంరాజు ఆధ్వర్యంలో మృతదేహాలను బావిలో నుంచి బయటకు తీశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు