వేసవి సెలవులు 20 వరకు
close

ప్రధానాంశాలు

వేసవి సెలవులు 20 వరకు

అన్ని పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలకు వర్తింపు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, డైట్‌ కళాశాలలు, ప్రభుత్వ/ప్రైవేటు జూనియర్‌ కళాశాలలకు వేసవి సెలవులను విద్యాశాఖ మరోసారి పొడిగింది. ఈ నెల 20 వరకు వాటిని తెరవరాదని పేర్కొంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన, కళాశాలల పరంగా ఇంటర్‌బోర్డు కార్యదర్శి జలీల్‌ మంగళవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. గతంలో పాఠశాలలకు మే 31 వరకు వేసవి సెలవులుగా ప్రకటించగా.. లాక్‌డౌన్‌ నేపథ్యంలో దాన్ని ఈ నెల 15 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ఈ నెల 19 వరకు అమల్లో ఉంది, కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం నుంచే అది అమలవుతోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో పనిచేసే దాదాపు 600 మంది ఉపాధ్యాయులు ఏపీలోని కర్నూల్‌ నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. కొన్ని కేజీబీవీలు, ఆదర్శ పాఠశాలల్లో క్వారంటైన్‌ కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈ నెల 16 నుంచి ఉపాధ్యాయులను విధులకు పంపించడం మంచిది కాదని ప్రభుత్వం భావించినట్లు సమాచారం.
ఆన్‌లైన్‌ తరగతులు జులై 1 నుంచే!
వేసవి సెలవులను పొడిగించిన నేపథ్యంలో టీవీల ద్వారా ఆన్‌లైన్‌ తరగతులను జులై 1 నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. ఈ నెల 21 నుంచి ఉపాధ్యాయులు విధులకు హాజరై ఒకటి, ఆరో తరగతిలోకి కొత్తగా ప్రవేశాలు జరిగేలా చర్యలు చేపట్టాలని విద్యాశాఖ ఆదేశించవచ్చని సమాచారం. తర్వాత జులై 1 నుంచి టీవీ పాఠాలను ప్రారంభిస్తారని చెబుతున్నారు. ఇంటర్‌బోర్డు జులై 1 నుంచి ద్వితీయ సంవత్సర విద్యార్థులకు తరగతులను ప్రారంభించాలని ఇప్పటికే నిర్ణయించింది. మరోవంక.. ఆన్‌లైన్‌ ద్వారా ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాలు జరపాలని ఇంటర్‌బోర్డు కార్యదర్శి తాజా ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని