‘గడ్డిఅన్నారం’ కార్యదర్శి, ఛైర్మన్‌పై వేటు
close

ప్రధానాంశాలు

‘గడ్డిఅన్నారం’ కార్యదర్శి, ఛైర్మన్‌పై వేటు

మార్కెట్‌లో అక్రమాలపై సీఎం తీవ్ర ఆగ్రహం
తొలిసారి రాష్ట్రస్థాయి డిప్యూటీ డైరెక్టర్‌,  ఛైర్మన్‌ సస్పెన్షన్‌
‘ఈనాడు’ కథనాలకు ప్రభుత్వ స్పందన

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర రాజధాని నడిబొడ్డున ఉన్న గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్‌ సెలక్షన్‌ గ్రేడ్‌ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌, మార్కెట్‌ కమిటీ పాలకవర్గం ఛైర్మన్‌ వి.రామనర్సింహగౌడ్‌పై వేటు పడింది. మార్కెట్‌లో జరిగిన అక్రమాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం ఆదేశాల మేరకు ఆ ఇద్దరినీ సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీచేసినట్లు మార్కెటింగ్‌శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు బుధవారం ‘ఈనాడు’కు చెప్పారు. ఈ మార్కెట్‌లో రూ.8 కోట్లకు పైగా లంచాలు తీసుకుని 176 మంది వ్యాపారులకు కొత్తగా లైసెన్సులిచ్చారు. ఈ అవినీతి బాగోతాన్ని ‘‘వసూళ్లయ్యాక.. కథ అడ్డం తిరిగింది’’, ‘అవును..గడ్డి కరిచారు’ శీర్షికలతో వెలుగులోకి తెస్తూ ‘ఈనాడు’ గత నెల 31, ఈ నెల 1న వరుస కథనాలు ప్రచురించిన విషయం తెలిసిందే. దీంతో మార్కెటింగ్‌శాఖ విజిలెన్స్‌ విచారణ చేయించింది. మార్కెట్‌ ఛైర్మన్‌, కార్యదర్శి కలిసి అక్రమాలకు పాల్పడ్డారని, ‘ఈనాడు’లో వచ్చిన సమాచారం అంతా నిజమేనని విజిలెన్స్‌ అధికారి నివేదిక ఇచ్చారు. అనంతరం మార్కెటింగ్‌శాఖ సంచాలకుని కార్యాలయం ఈ నెల 2న ప్రభుత్వానికి లేఖ రాసింది. రాష్ట్రస్థాయి అధికారులపై చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికే ఉందని తెలిపింది. స్పందించిన ప్రభుత్వం ఆ ఇద్దరినీ సస్పెండ్‌ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఏటా రూ.కోటికి పైగా ఆదాయం వచ్చే మార్కెట్లకు సెలక్షన్‌ గ్రేడ్‌ హోదా పేరుతో కార్యదర్శిని మార్కెటింగ్‌శాఖ నియమిస్తుంది. రాష్ట్రస్థాయి అధికారి అయిన డిప్యూటీ డైరెక్టర్‌(డీడీ) హోదాకు సమానమైన వారిని మాత్రమే సెలక్షన్‌ గ్రేడ్‌ కార్యదర్శిగా నియమిస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరవాత రాష్ట్రస్థాయి డీడీ హోదా అధికారిని, మార్కెట్‌ పాలకవర్గ ఛైర్మన్‌ను సస్పెండ్‌ చేయడం ఈ శాఖలో ఇదే తొలిసారని ఉన్నతాధికారులు తెలిపారు.  
ఛైర్మన్‌ తీరుపై నిరసన
వ్యవసాయ మార్కెట్లకు ప్రభుత్వం నామినేటెడ్‌ విధానంలో నేరుగా ఛైర్మన్‌ను, పాలకవర్గాన్ని నియమిస్తుంది. వీరి పదవీకాలం తొలుత ఏడాది ఉంటుంది. పనితీరు బాగుంటే మరో ఏడాది పొడిగిస్తుంది. గడ్డిఅన్నారం మార్కెట్‌ ఛైర్మన్‌గా రామనర్సింహగౌడ్‌ పదవీకాలం ఏడాది పూర్తయ్యాక ఆరు నెలల చొప్పున ఇప్పటికి రెండుసార్లు పొడిగించారు. మరో 4 నెలల్లో ఆయన పదవీకాలం రెండేళ్లు పూర్తయి పదవీ విరమణ చేయాల్సి ఉంది. రాజకీయ నేపథ్యంలో ఛైర్మన్‌ పదవులు పొందిన వారు సాధ్యమైనంత వరకూ వేటు పడకుండా చూసుకుంటారు. గడ్డిఅన్నారంలో ఛైర్మన్‌ అక్రమాలపై ‘ఈనాడు’లో కథనాలు వచ్చాక పాలకవర్గం సభ్యులు కూడా నిరసన తెలపడం, ఛైర్మన్‌ పనితీరుపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేయడంతో మార్కెటింగ్‌శాఖ చర్యలు తీసుకుంది. ఈ శాఖ సంచాలకుని కార్యాలయానికి కేవలం కిలోమీటరు దూరంలో ఉన్న ఈ మార్కెట్‌లో ఏళ్ల తరబడి పలు అక్రమాలు జరుగుతున్నా, రైతులు అవస్థలు పడుతున్నా ఇంతకాలం ఉన్నతాధికారులు స్పందించలేదు. ఇప్పుడు లైసెన్సుల పేరుతో జరిగిన అక్రమాలను ‘ఈనాడు’ వెలుగులోకి తేవడంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని