అధికారులు చట్టానికి అతీతమా?
close

ప్రధానాంశాలు

అధికారులు చట్టానికి అతీతమా?

వైద్య విధాన పరిషత్‌ ఉద్యోగుల విభజన తీరుపై హైకోర్టు ఆగ్రహం
తుది సీనియారిటీ జాబితా సమర్పించాలని తెలంగాణకు ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్ట నిబంధనలను అమలు చేయడంలో రెండు రాష్ట్రాల అధికారులు తాము చట్టాలకు అతీతమని అనుకుంటున్నట్లుందని గురువారం హైకోర్టు వ్యాఖ్యానించింది. సీనియారిటీ జాబితాను రూపొందించకుండా వైద్యవిధాన పరిషత్‌ ఉద్యోగుల విభజన ఎలా చేశారని రెండు రాష్ట్రాలనూ ప్రశ్నించింది. దీనికి ఎలాంటి మార్గదర్శకాలున్నాయని నిలదీసింది. చట్టాలు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో అర్థం కావడంలేదని వ్యాఖ్యానించింది. తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో ఉద్యోగుల కేటాయింపు జరిగినా పదోన్నతులను పునస్సమీక్షించకుండా జూనియర్‌కు సెక్షన్‌ అధికారిగా పదోన్నతి కల్పించడాన్ని సవాలు చేస్తూ సీనియర్‌ అసిస్టెంట్‌ ఎం.విజయ్‌కుమార్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై గురువారం జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు, జస్టిస్‌ టి.అమర్‌నాథ్‌గౌడ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ న్యాయవాది కె.లక్ష్మీనరసింహ వాదనలు వినిపించారు. ‘‘సీనియారిటీ జాబితా 2016లో రూపొందించారు. 2019లో ఉద్యోగుల విభజన జరిగింది. అయితే తెలంగాణ వైద్యవిధాన పరిషత్‌ పదోన్నతులను పునస్సమీక్షించలేదు’’ అని తెలిపారు. వాదనలను విన్న ధర్మాసనం.. తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ సీనియారిటీ జాబితాను రూపొందించకుండా ఉద్యోగుల విభజన ఏ విధంగా చేసిందో కౌంటరులో చెప్పకపో వడాన్ని తప్పుబట్టింది. ‘‘సీనియర్‌ అసిస్టెంట్‌లకు చెందిన తుది సీనియారిటీ జాబితాను సమర్పించాలి. ఏ ప్రాతిపదికన తుది కేటాయింపులు చేశారో సంబంధిత రికార్డులు కూడా సమర్పించాలి. పదోన్నతులను ఎందుకు పునస్సమీక్షించలేదో చెప్పాలి’’ అని తెలంగాణ వైద్యవిధాన పరిషత్‌ను ఆదేశిస్తూ విచారణను జులై 9వ తేదీకి వాయిదా వేసింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని