మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలి
close

ప్రధానాంశాలు

మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలి

కేంద్ర సహాయ మంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌కు రాష్ట్ర మంత్రుల వినతి

ఈనాడు, హైదరాబాద్‌,  దిల్లీ: ములుగు జిల్లా పాలంపేటలోని రామప్ప దేవాలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించేందుకు కేంద్రం చొరవ చూపాలని, ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలని కేంద్ర పర్యాటక శాఖ సహాయమంత్రి ప్రహ్లాద్‌సింగ్‌ను తెలంగాణ మంత్రులు కోరారు. రాష్ట్ర పర్యాటక, పంచాయతీరాజ్‌, గిరిజన సంక్షేమ శాఖల మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, ఎంపీలు కవిత, బండా ప్రకాశ్‌, పసునూరి దయాకర్‌, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి బుధవారం దిల్లీకి వెళ్లి కేంద్రమంత్రితో భేటీ అయి వినతిపత్రం సమర్పించారు. ఎంతో ప్రాశస్త్యం గల మేడారం జాతర రెండేళ్లకోసారి జరుగుతుందని, కాకతీయుల కాలం నాటి నిర్మాణ సౌధం, తెలంగాణ వారసత్వ, చారిత్రక సంపదను చాటే రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చేందుకు అవసరమైన పూర్తి సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందజేసిందని వివరించారు.  మేడారం జాతరకు ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వం రూ. 200 కోట్లు వెచ్చిస్తోందని, కేంద్రం నుంచి సైతం నిధులివ్వాలని కోరారు.  

దృష్టిసారించాం...

-ప్రహ్లాద్‌ పటేల్‌, కేంద్ర మంత్రి
రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ స్థలంగా ప్రకటించే అంశంపై దృష్టి సారించామని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ తెలిపారు. అందుకు అవసరమైన అంశాలపై ఇప్పటికే ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా, కేంద్ర పర్యాటకశాఖ పనిచేస్తున్నాయన్నారు. రాష్ట్ర మంత్రులు కలిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ అంశంపై చర్చించేందుకు గురువారం పర్యాటక శాఖ ఉన్నతాధికారులతో రాష్ట్ర మంత్రుల బృందం భేటీ అవుతుందని ఆయన తెలిపారు. Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని