కేసులకు భయపడే ప్రసక్తే లేదు

ప్రధానాంశాలు

కేసులకు భయపడే ప్రసక్తే లేదు

మాజీ ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

సంగారెడ్డి అర్బన్‌, న్యూస్‌టుడే: బడుగు బలహీనవర్గాల గొంతుక అయ్యేందుకే తాను ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు మాజీ ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా మల్కాపూర్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో స్వేరోస్‌ ప్రతినిధులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఉద్యోగానికి రాజీనామా చేసిన వెంటనే తనపై కేసులు నమోదు చేశారని.. లక్ష్యం కోసం చావడానికైనా సిద్ధపడే తనకు కేసులంటే భయం లేదన్నారు. తనపై కేసు పెడితే కోటి మంది ప్రవీణ్‌కుమార్‌లు పుట్టుకొస్తారని హెచ్చరించారు. రాష్ట్రంలో సగం గురుకులాలకు భవనాలు లేవని, నిధులు విడుదల కావడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్ని అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నా.. ప్రశ్నించేందుకు ఆ ఎమ్మెల్యేలకు ధైర్యం లేదని రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ శాసనసభ్యులను ఉద్దేశించి పరోక్షంగా విమర్శించారు. హుజూరాబాద్‌లో సీఎం రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేయబోతున్నారని, ఆ డబ్బును దళిత బిడ్డల కోసం వినియోగిస్తే.. ప్రతి ఇంటి నుంచి ఓ సుందర్‌ పిచాయ్‌, సత్య నాదెళ్ల వంటి వారు పుట్టుకొస్తారన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న దాడులు, అన్యాయాలు పోవాలంటే బహుజన వాదం అధికారంలోకి రావాలని చెప్పారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని