హోంమంత్రి కోసం అంబులెన్స్‌ ఆపారు

ప్రధానాంశాలు

హోంమంత్రి కోసం అంబులెన్స్‌ ఆపారు

ఈనాడు, హైదరాబాద్‌; న్యూస్‌టుడే, మెహిదీపట్నం: హోంమంత్రి మహమూద్‌ అలీ కాన్వాయ్‌ ప్రయాణం నేపథ్యంలో హైదరాబాద్‌ మాసాబ్‌ట్యాంక్‌ కూడలి వద్ద శనివారం మధ్యాహ్నం పోలీసులు ట్రాఫిక్‌ నిలిపివేశారు. అదే సమయంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిని బంజారాహిల్స్‌లోని ఆసుపత్రికి తీసుకెళుతున్న అంబులెన్స్‌ ఆ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయింది. రోగి పరిస్థితి విషమిస్తోందని వైద్యుడు, ఆయన సహాయకుడు, రోగి బంధువు వాహనం దిగి.. అక్కడ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ వద్దకు వెళ్లి విన్నవించారు. ట్రాఫిక్‌ క్లియర్‌ చేయాలని కోరారు. పోలీసు కుదరదనడంతో.. అక్కడి వాహనదారులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వెనుకనుంచి దారి చేసుకుని వెళ్లమంటూ కానిస్టేబుల్‌ పంపించాడు. ఈ ఘటనల్ని కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌చేశారు. ఈ వీడియో వైరల్‌ కావడంతో హోంమంత్రి మహమూద్‌ అలీ స్పందించి నగరంలో తాను ఎక్కడికి వెళ్లినా సాధారణ ట్రాఫిక్‌ను ఆపొద్దని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ను ఆదేశించారు. అయితే అంబులెన్స్‌ను చూడగానే కానిస్టేబుల్‌ అప్రమత్తమయ్యారని, పక్క నుంచి దారిచ్చి పంపించారని అదనపు సీపీ(ట్రాఫిక్‌) ఎస్‌.అనిల్‌కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని