నోటిఫికేషన్‌ దాటి ఆదేశాలు ఎలా ఇవ్వగలం?

ప్రధానాంశాలు

నోటిఫికేషన్‌ దాటి ఆదేశాలు ఎలా ఇవ్వగలం?

గురుకుల ప్రిన్సిపాళ్ల నియామక వివాదంపై హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్‌: గురుకుల పాఠశాలల ప్రిన్సిపాళ్ల నియామకానికి సంబంధించిన అర్హతల్లో నోటిఫికేషన్‌కు భిన్నంగా ఎలా ఆదేశాలివ్వగలమని పిటిషనర్లను హైకోర్టు ప్రశ్నించింది. నోటిఫికేషన్‌లో అర్హతలు పేర్కొన్నారని, అలాంటప్పుడు యాజమాని స్థానంలోకి తాము వెళ్లి ఆదేశాలు ఇవ్వలేమని వ్యాఖ్యానించింది. అర్హతలు నిర్ణయించడమన్నది యజమానిపై ఆధారపడి ఉంటుందంటూ నియామక వివాదంపై దాఖలైన పిటిషన్‌లపై తీర్పును వాయిదా వేసింది. గురుకుల పాఠశాల ప్రిన్సిపాళ్ల నియామకంలో పార్ట్‌టైంగా నిర్వహించిన విధులను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. వీటిపై విచారించిన సింగిల్‌ జడ్జి టీఎస్‌పీఎస్సీ నిర్ణయాన్ని సమర్థిస్తూ ఉత్తర్వులు వెలువరించగా వాటిని సవాలు చేస్తూ అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ప్రిన్సిపాల్‌ పోస్టులకు లెక్చరర్‌లుగా అనుభవం ఉండాలని నోటిఫికేషన్‌లో షరతు విధించారన్నారు. పిటిషనర్లు కాంట్రాక్ట్‌ పద్ధతిలో పనిచేశారని, ఇదే విషయంపై ప్రభుత్వం అనుభవ ధ్రువీకరణ పత్రం ఇచ్చిందని, దీన్ని టీఎస్‌పీఎస్సీ తిరస్కరించిందన్నారు. పార్ట్‌టైం అన్న కారణంగా వారి దరఖాస్తులను తిరస్కరించారని, వాస్తవానికి పేరుకు పార్ట్‌టైం అన్నప్పటికీ రెగ్యులర్‌ లెక్చరర్‌ల వలేె రోజంతా విధులు నిర్వహించారని చెప్పారు. అందువల్ల వారిని టీఎస్‌పీఎస్సీ నిర్వహించే ఇంటర్వ్యూలకు అనుమతించేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని