పకడ్బందీగా 5-ఎస్‌ విధానం అమలు

ప్రధానాంశాలు

పకడ్బందీగా 5-ఎస్‌ విధానం అమలు

పోలీస్‌ సిబ్బంది కిట్ల పంపిణీకి యాప్‌
డీజీపీ మహేందర్‌రెడ్డి వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని పోలీస్‌ స్టేషన్లు, కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచి నాణ్యమైన సేవలందించే వాతావరణం కల్పించేందుకు 5-ఎస్‌ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ఆదేశించారు. సార్ట్‌, సెట్‌ ఇన్‌ ఆర్డర్‌, షైన్‌, స్టాండర్డైజ్‌, సస్టెయిన్‌ అంశాలకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. రాష్ట్రంలోని 9 కమిషనరేట్లు, 20 జిల్లాల ఆర్‌ఐలతో బుధవారం తన కార్యాలయంలో డీజీపీ సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. అన్ని ఠాణాల్లో 15 ఏళ్లుగా వృథాగా ఉన్న పాత, వ్యర్థ పరికరాలను నిబంధనలను అనుసరించి వేలం వేయగా రూ.50.35లక్షలు సమకూరాయని వెల్లడించారు. విధి నిర్వహణలో ఉండే పోలీస్‌ సిబ్బందికి రెయిన్‌కోట్‌, గ్రౌండ్‌షీట్‌, బ్లాంకెట్‌, స్వెటర్‌ తదితర వస్తువులతో కూడిన కిట్‌ను సకాలంలో సమకూర్చేందుకు ప్రత్యేక యాప్‌ను రూపొందించామని వెల్లడించారు. ఈ విధానాన్ని సమర్థంగా అమలు చేయడంలో కీలకపాత్ర పోషిస్తున్న లాజిస్టిక్స్‌ విభాగం ఐజీ సంజయ్‌జైన్‌, డీఎస్పీ వేణుగోపాల్‌ను అభినందించారు. ఠాణాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపిన ఆర్‌ఐలకు ప్రశంసాపత్రాలను అందజేశారు.

విదేశీ విద్యారుణాల్లో వెసులుబాటు

పోలీస్‌ కుటుంబాల్లోని విద్యార్థుల విదేశీ విద్యారుణాల్లో వెసులుబాటు కల్పిస్తూ డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు పోలీస్‌ కుటుంబాలకు చెందిన విద్యార్థులకు విదేశీ విద్యారుణం కింద రూ.15 లక్షల వరకు మంజూరు చేసేవారు. పోలీస్‌ అధికారి హోదాను బట్టి అర్హతను నిర్ణయించేవారు. తాజాగా ఆ పరిమితిని రూ.30 లక్షలకు పెంచారు. పోలీస్‌ అధికారుల సంఘం విజ్ఞప్తి మేరకు డీజీపీ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు భద్రత వైస్‌ఛైర్మన్‌, అదనపు డీజీపీ(సంక్షేమం) ఉమేశ్‌ షరాఫ్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రుణ పరిమితి పెంపు జులై 1 నుంచే అమలవుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గతంలో ట్యూషన్‌ ఫీజుకు మాత్రమే రుణం మంజూరు చేసేవారు. తాజా ఉత్తర్వుల ప్రకారం.. ఇక నుంచి ట్యూషన్‌ ఫీజుతోపాటు ఇతర ఖర్చులకూ రుణం ఇవ్వనున్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని