సెప్టెంబరు నాటికి మూడు డీజీ పోస్టుల ఖాళీ

ప్రధానాంశాలు

సెప్టెంబరు నాటికి మూడు డీజీ పోస్టుల ఖాళీ

ఈనాడు, హైదరాబాద్‌: పోలీస్‌శాఖలో ఉన్నతాధికారులు వరుసగా పదవీ విరమణ పొందనున్నారు. సెప్టెంబరు నాటికి మూడు డైరక్టర్‌ జనరల్‌ స్థాయి పోస్టులు ఖాళీ కానున్నాయి. ప్రింటింగ్‌, స్టేషనరీ అండ్‌ స్టోర్స్‌ పర్చేజ్‌ కమిషనర్‌గా ఉన్న ఎం.గోపీకృష్ణ ఈ నెలాఖరున పదవీ విరమణ పొందనున్నారు. స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఎస్పీఎఫ్‌) డీజీగా పూర్తి అదనపు బాధ్యతల్ని సైతం ఆయనే నిర్వర్తిస్తున్నారు. అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్‌ జనరల్‌ పూర్ణచందర్‌రావు పదవీ కాలం ఆగస్టు నెలాఖరుతో ముగియనుంది. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగానూ ఆయనే పూర్తి అదనపు బాధ్యతల్లో ఉన్నారు. జైళ్ల శాఖ డైరెక్టర్‌ జనరల్‌ రాజీవ్‌ త్రివేది సెప్టెంబరు ఆఖరులో పదవీ విరమణ పొందబోతున్నారు. ప్రస్తుతం డీజీపీగా ఉన్న మహేందర్‌రెడ్డి కాకుండా రాష్ట్రంలో ఆ స్థాయిలో ఉన్న అధికారులు ఈ ముగ్గురే. వీరు పదవీ విరమణ పొందితే అయిదు ఉన్నత స్థానాలు ఖాళీ అవుతాయి. ఈ ముగ్గురి పదవీ విరమణ అనంతరం మహేందర్‌రెడ్డి మినహా రాష్ట్రంలో డైరెక్టర్‌ జనరల్‌ హోదా కలిగిన ఉన్నతాధికారులు ఎవరూ ఉండరు. ప్రస్తుతం తెలంగాణ కేడర్‌లో సంతోష్‌మెహ్రా కూడా డీజీ స్థాయి అధికారి అయినా ఆయన కేంద్ర సర్వీసులో ఉన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని