ప్రైవేటు విద్యాసంస్థల్లో వేతనాలపై వివరణ ఇవ్వండి

ప్రధానాంశాలు

ప్రైవేటు విద్యాసంస్థల్లో వేతనాలపై వివరణ ఇవ్వండి

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రైవేటు విద్యాసంస్థల్లోని అధ్యాపకులకు కొవిడ్‌ కారణంగా 11 నెలలుగా వేతనాలు చెల్లించడంలేదన్న అంశంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ కళాశాలల్లో అధ్యాపకుల కొరత, వేతనాలు అందక ప్రైవేటు విద్యాసంస్థల అధ్యాపకుల ఇబ్బందులపై న్యాయవాది కె.శ్రవణ్‌కుమార్‌ రాసిన లేఖను హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కళాశాలల్లో శాశ్వత నియామకాలను ఎందుకు చేపట్టలేదని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది.  తెలంగాణాలోనే ప్రైవేటు కళాశాలల్లోనే ఒప్పంద నియామకాలు ఎక్కువగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. పిటిషన్‌లోని అంశాలపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని సీఎస్‌, విద్యాశాఖ, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శులు, సాంకేతిక విద్యాశాఖ కార్యదర్శి, జెఎన్‌టీయూ, ఉస్మానియా, ఏఐసీటీఈలకు నోటీసులిచ్చింది.  తదుపరి విచారణను సెప్టెంబరు 28కి వాయిదా వేసింది.

రూ.10 వేల చొప్పున చెల్లించాలి

కౌంటర్ల దాఖలులో ప్రభుత్వ అధికారులు చేస్తున్న జాప్యంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. రెండు వేర్వేరు కేసుల్లో కౌంటర్ల దాఖలుకు మరోసారి గడువు కోరడంతో రూ.10 వేల చొప్పున న్యాయవాదుల కొవిడ్‌ సంక్షేమ నిధికి చెల్లించాలని వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి, జీహెచ్‌ఎంసీ కమిషనర్లకు ఆదేశాలు జారీచేసింది. డైటీషియన్‌ పోస్టులకు హెడ్‌ నర్సులు మాత్రమే అర్హులుగా పేర్కొంటూ సవరించిన నిబంధనలను సవాలు చేస్తూ జె.సుజన మరో ముగ్గురు 2019లో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ పోస్టులకు సంబంధించి కొంత గడువిస్తే కౌంటరు దాఖలు చేస్తామన్నారు. గతంలోనూ ఇదే కారణం చెప్పి గడువు కోరారని గుర్తుచేసిన ధర్మాసనం చివరి అవకాశంగా గడువు మంజూరు చేస్తూ రూ.10 వేలు చెల్లించాలని ఆదేశించింది. సెప్టెంబరు 9లోగా కౌంటరు దాఖలు చేయకుంటే వైద్యవిద్య ముఖ్యకార్యదర్శి రికార్డులతో సహా వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది.  
హైదరాబాద్‌ నాచారం పెద్దచెరువు కట్ట నడకదారిని తొలగించి ఎఫ్‌టీఎల్‌ పరిధిలో రోడ్డు నిర్మాణం చేపట్టడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో కౌంటరు దాఖలు చేయకపోవడంతో రూ.10 వేలు చెల్లించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను ధర్మాసనం ఆదేశించింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని