గొర్రెల పంపిణీ ద్వారా అద్భుత ఫలితాలు: తలసాని

ప్రధానాంశాలు

గొర్రెల పంపిణీ ద్వారా అద్భుత ఫలితాలు: తలసాని

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం రూ.5 వేల కోట్లతో చేపట్టిన మొదటి విడత గొర్రెల పంపిణీతో అద్భుతమైన ఫలితాలు వచ్చాయని పశుసంవర్ధక, మత్స్యశాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో అన్ని జిల్లాల పశువైద్యాధికారులు, పశుసంవర్ధక శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో గొర్రెల పంపిణీ, ఇతర పథకాల అమలుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. రెండోవిడత గొర్రెల పంపిణీ కోసం రూ.6 వేల కోట్లను విడుదల చేసి, యూనిట్‌ ధరను రూ.1.25 లక్షల నుంచి రూ.1.75 లక్షలకు పెంచామన్నారు. పంపిణీ చేసే గొర్రెలకు కొనుగోలు ప్రాంతంలోనే బీమా చేసి పత్రాలను అందజేయాలని, గొర్రె చనిపోతే పది రోజుల్లోగా బాధితుడికి మరో జీవాన్ని అందించేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. మొదటి విడతలో 79.16 లక్షల గొర్రెలను పంపిణీ చేయగా వాటికి కోటి 30 లక్షల పిల్లలు పుట్టినట్లు తెలిపారు. వీటి విలువ రూ.7800 కోట్లని వివరించారు. అంతేకాకుండా 93 వేల టన్నుల మాంసం ఉత్పత్తి జరిగిందన్నారు. గొర్రెలను అమ్ముకునేందుకు, కొనుగోలు చేసేందుకు అన్ని రకాల సౌకర్యాలతో ఖమ్మం, పెద్దపల్లి, వనపర్తి తదితర జిల్లాల్లో గొర్రెల మార్కెట్ల నిర్మాణ పనులను త్వరలో ప్రారంభించనున్నట్లు మంత్రి ప్రకటించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని