వేగంగా మండల వ్యవస్థ.. విద్యా సౌకర్యాలు పెరగక అవస్థ

ప్రధానాంశాలు

వేగంగా మండల వ్యవస్థ.. విద్యా సౌకర్యాలు పెరగక అవస్థ

మండలాల సంఖ్యకు అనుగుణంగా ఎంఈవోలు ఏరీ?

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో రెవెన్యూ మండలాల సంఖ్య ఏటేటా భారీగా పెరుగుతుండగా.. అందుకనుగుణంగా పాఠశాల విద్యావ్యవస్థలో సౌకర్యాలు పెరగడం లేదు. రాష్ట్ర ఆవిర్భావం నాటికి మండలాల సంఖ్య 467 ఉండగా అవి 593కి పెరిగాయి. తాజాగా మరో మూడు మండలాల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో వాటి సంఖ్య 596కు చేరుకుంది. ఆ ప్రకారం విద్యాశాఖలో ఆయా విద్యాసంస్థల ఏర్పాటు, పోస్టుల భర్తీలాంటి ప్రక్రియలను పూర్తి చేయకపోవడం వల్ల పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందటం లేదని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మండలాలు 596.. ఎంఈవో పోస్టులు 539

రాష్ట్రంలో 2016లో 125 కొత్త మండలాలు ఏర్పాటైన తర్వాత 85 ఎంఈవో పోస్టులను మాత్రమే మంజూరు చేశారు. ప్రస్తుతం 596 మండలాలకు 539 ఎంఈఓ పోస్టులున్నాయి. ఇంకా 57 మండలాలకు అసలు పోస్టులే లేకపోవడం గమనార్హం. విచిత్రమేమిటంటే 22 మండలాల్లోనే రెగ్యులర్‌ ఎంఈఓలు ఉన్నారు. మిగిలిన చోట్ల ఇన్‌ఛార్జులే. ఒక్కో ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుడికి 3 నుంచి 7 మండలాల బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఎంఈఓలకు కొత్త మండలాల్లో మండల వనరుల కేంద్రాలు(ఎంఆర్‌సీ) లేవు. ‘ఎన్ని కొత్త మండలాలు వచ్చినా ఎంఆర్‌ఓలు, ఎస్‌ఐ, ఎంపీడీఓలు.. ఇలా అన్ని పోస్టులు మంజూరు చేస్తున్నారు. ఎంఈఓ పోస్టులను ఎందుకు మంజూరు చేయరు?’ అని టీఎస్‌యూటీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి చావ రవి ప్రశ్నించారు. ఎంఈఓ పేరిట నియామకాలు జరిపితే న్యాయపరంగా ఇబ్బంది అనుకుంటే అకడమిక్‌ మానిటరింగ్‌ ఆఫీసర్‌(ఏఎంఓ) పేరిట సీనియర్‌ ప్రధానోపాధ్యాయులకు తాత్కాలిక బాధ్యతలు అప్పగించవచ్చని సూచించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని